Home News Politics

గీత రాకతో.. పిఠాపురంలో మారిన సీన్…?

SHARE

తూర్పు గోదావరి జిల్లా రాజకీయాల్లో పిఠాపురం విలక్షణ నియోజకవర్గం. అధికారపార్టీకి తిరుగులేదని భావిస్తున్న ఈ నియోజకవర్గంలో ఇప్పుడు పరిస్థితి మారుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సిట్టింగ్ ఎమ్యెల్యే ఎస్వీ ఎస్ వర్మ కు ఎదురుగాలి వీస్తుంది. వర్మ కోటరికే అత్యధిక పనులు చేసిపెట్టడంతో టిడిపి క్యాడర్ లో కూడా అంతర్గంతంగా అసంతృప్తి విస్తరిస్తుంది అన్నది టాక్. 2014 లో టిడిపి అభ్యర్థిగా పోతుల విశ్వం ను ప్రకటించడంతో రెబెల్ గా బరిలోకి దిగిన వర్మ ఇండిపెండెంట్ గా గెలిచి తెలుగుదేశం లో చేరారు. తనకు టికెట్ దక్కలేదని కన్నీళ్లు పెట్టుకుని ఇల్లు ఇల్లు తిరిగిన వర్మ సానుభూతితో గెలుపుగుర్రం ఎక్కేశారు. అలాంటి సానుభూతి పవనాలు ఇప్పుడు లేవని తేలిపోతుంది. దాంతో ఆయనకు ఎదురీత తప్పడం లేదు.

2009 లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ప్రస్తుత కాకినాడ వైసీపీ ఎంపి అభ్యర్థి వంగా గీత విశ్వనాధ్ పిఠాపురం ఎమ్యెల్యే గా విజయం సాధించారు. ముద్రగడ పద్మనాభం లాంటి నేతను మట్టికరిపించి మరీ గెలుపొందిన గీతకు నియోజకవర్గంలో మంచి పేరు వుంది. ఎమ్యెల్యేగా నిత్యం ప్రజలకు అందుబాటులో వున్న వంగా గీతకు మైనస్ లు కన్నా ప్లస్ పాయింట్లే అధికం. ఆమె మాటకు విలువ కూడా వుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పిఠాపురం నుంచి వైసిపి తరపున బరిలోకి దిగిన పెండెం దొరబాబు కు క్రమంగా విజయావకాశాలు మెరుగు పడుతున్నాయి అంటున్నారు.

వాస్తవానికి పిఠాపురం జనసేన అడ్డాగా చెప్పుకోవొచ్చు. అత్యధికశాతం ఓట్లు కాపు సామాజిక వర్గం వారివి కూడా. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం ఆసక్తి ప్రదర్శించారు. అలాంటి స్థానంలో ఇప్పుడు గతంలో వున్న జోష్ లేకుండా పోయిందని జన సైనికులు నిరాశ చెందుతున్నారు. జనసేన అభ్యర్థి మాకినీడి శేషుకుమారి ఆశించిన స్థాయిలో దూసుకువెళ్లడం లేదని ప్రలోభాలకు జనసేన దూరం అని అధినేత చేసిన ప్రకటనతో మరికొందరు డీలా పడ్డారు. మరి రాబోయే ఎన్నికల్లో ఏమి జరుగుతుందో చూడాలి.