Home News Politics

తెలంగాణలో ఈ మంత్రులు డౌటేనా…?

SHARE

ముందస్తు ఎన్నికల ముప్పు తెలంగాణలో కొందరు మంత్రులకు ముచ్చెమటలు పట్టిస్తుంది. కార‌ణాలు.. అనేకం.. క‌ర్ణుడి చావుకు అన్న‌ట్టుగా.. అధికార పార్టీ టీఆర్ఎస్ త‌ర‌ఫున బ‌రిలో నిలిచిన మంత్రుల్లో చాలా మందికి ఈ సారి టఫ్ ఫైట్ ఎదురయ్యేలా ఉంది. ప్రభుత్వంలో కీలక స్థానాల్లో పని చేసిన మంత్రులు కొందరు ఓటమి అంచుల్లో ఉన్నారు. తెలంగాణ తొలి క్యాబినెట్ మంత్రుల్లో కొందరికి వార్ వన్ సైడ్ గా ఉన్నామరికొందరికి మాత్రం ఎన్నికలు నిద్రలేని రాత్రులు మిగులుస్తున్నాయి.


ఉమ్మడి వరంగల్ జిల్లాకి చెందిన మంత్రి అజ్మీరా చందూలాల్‌. ఈయ‌న గ‌త ఎన్నిక‌ల్లో ములుగు నుంచి విజ‌యం సాధించి.. కేసీఆర్ కేబినెట్‌లో టూరిజం మంత్రిగా ఉన్నారు. అయితే, ఈయ‌న ప‌నితీరు పైనా స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఆయ‌న కుమారుడు ప్ర‌హ్లాద పైనా ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉండడంతో ఇక్క‌డ ఓట‌మి ఖాయ‌మ‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి. ఆయ‌న లంబాడా తెగ‌కు చెందిన నాయ కుడు అయినా.. ఆదివాసీల‌కు-లంబాడాల‌కు మ‌ధ్య ఉన్న గ్యాప్‌ను పూడ్చ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. దీనికితోడు ప్ర‌త్యేక జిల్లాగా ములుగును ఏర్పాటు చేయించ‌డంలోనూ విఫ‌ల‌మ‌య్యారు. ఇక‌, ఇక్క‌డ నుంచి ఆదివాసీ తెగ‌కు చెందిన సీత‌క్క రంగంలోకి దిగ‌నుంది. 2009లో గెలిచిన సీత‌క్క‌కు నియోజ‌క‌వ‌ర్గంలో క్లీన్ ఇమేజ్ ఉంది. దీంతో ఇక్క‌డ అజ్మీరా చందూలాల్‌.. ఓట‌మి ఖాయ‌మ‌న్న టాక్ ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో బ‌లంగా వినిపిస్తోంది.

మ‌రో మంత్రి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి చెందిన రవాణ శాఖ మంత్రి మ‌హేంద‌ర్‌రెడ్డి. ఈయ‌న తాండూరు నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఈయ‌న‌కు కూడా ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయి. త‌మ‌కు అందుబాటులో లేర‌ని, త‌మ స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న టాక్ బలంగా వినిపిస్తుంది. ఇక‌, గ‌త ఏడాది ఇక్క‌డ జ‌రిగిన మునిసిపాలిటీ ఎన్నిక‌ల్లో మహేంద‌ర్ రెడ్డి త‌న హ‌వాను చూపించ‌లేక పోయారు. తాండూరు మునిసిపాలిటీని టీఆర్ఎస్ చేజార్చుకుంది. వ్య‌క్తిగ‌తంగాను ఆయ‌న ఇమేజ్ ఇక్క‌డ త‌గ్గిపోయింది. ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం మారాల‌ని… శేరిలింగంప‌ల్లిలో పోటీ చేయాల‌ని అనుకున్నా కుద‌ర్లేదు. ఇక్క‌డ నుంచి ప్ర‌త్య‌ర్థిగా పైల‌ట్ రోహిత్ రెడ్డి ఉన్నారు. ఆయ‌న ఇక్క‌డ మ‌హేంద‌ర్‌రెడ్డికి గ‌ట్టి పోటీ ఇచ్చి చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాకి చెందిన మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి ప‌రిస్తితి అత్యంత దారుణంగా ఉంది. సూర్యాపేట‌లో ఈయ‌న‌ పై తీవ్ర వ్య‌తిరేకత వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ అభ్య‌ర్థిగా మాజీ మంత్రి రాంరెడ్డి దామోద‌ర రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వ‌చ్చిన ప‌టేల్ ర‌మేష్ రెడ్డి టిక్కెట్ రాక రెబ‌ల్‌గా బరిలో దిగడంతో జగదీశ్ ఊపిరి పీల్చుకున్నారు . అయితే రమేశ్ కి గట్టీ హామి ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం పోటీ నుంచి విరమింపజేయడంతో ఇక్కడ జగదీశ్ రెడ్డికి కష్టాలు తప్పేలా లేవు.

టీఆర్ ఎస్ ప్ర‌భుత్వ మంత్రి వ‌ర్గంలో కీల‌క స్థానంలో నిలిచిన మంత్రి, స‌న‌త్‌న‌గ‌ర్ సిట్టింగ్ ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌కు తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ టికెట్‌పై విజ‌యం సాధించి.. త‌ర్వాత ప‌ద‌వీ కాంక్ష‌తో పార్టీ మారిపోయి.. ప్ర‌జ‌ల‌ను సైతం ప‌ట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. ఇక శ్రీనివాస్ యాద‌వ్‌కుమారుడు.. ప్రైవేటు సెటిల్‌మెంట్ల‌లో ఆరితేరిపోయి.. పోలీసుల‌నే బెదిరించిన ఉదంతాలు వెలుగు చూశాయి. దీంతో ఆయ‌న‌పై తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తోంది. ప్ర‌ధానంగా పార్టీ ఫిరాయించ‌డాన్ని ప్ర‌జ‌లు జీర్ణించు కోలేక పోతున్నారు. ఇక్క‌డ నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా రంగంలో ఉన్న కూన వెంక‌టేష్ గౌడ్‌ గెలుపు కోసం శ్రమిస్తున్నారు. గ‌డిచిన 15 ఏళ్లుగా ఈయ‌న ప్ర‌జ‌ల్లోనే ఉంటున్నారు. టీడీపీ కోసం అన్నివిధాలా కృషి చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లోనే ఆయ‌న స‌న‌త్‌న‌గ‌ర్ నుంచి పోటీ చేయాల్సి ఉంది. అయితే త‌ల‌సాని బాబుపై తీవ్ర‌మైన ఒత్తిడి తేవ‌డంతో కూన సికింద్రాబాద్ నుంచి బ‌ల‌వంతంగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఇప్పుడు ఇటు కూన‌పై సానుభూతి, అటు త‌ల‌సానిపై వ్య‌తిరేక ప‌వ‌నాలు నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లంగా క‌నిపిస్తున్నాయి.

మ‌రో మంత్రి, ఉమ్మడి మహబూబ్ నగర్ కి చెందిన కేసీఆర్‌ ఆప్త మిత్రుడు ల‌క్ష్మారెడ్డి ప‌రిస్తితి కూడా దారుణంగా ఉంది. ల‌క్ష్మారెడ్డి జెడ్చ‌ర్ల‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. ఇక్క‌డ ల‌క్ష్మారెడ్డిపై వ్య‌తిరేక‌త క‌న్నా ఇక్క‌డ నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా బ‌రిలో దిగుతున్న మ‌ల్లు ర‌వికి సానుభూతి ప‌వ‌నాలు ఎక్కువ‌గా వీస్తున్నాయి. గ‌తంలో ఓట‌మి పాలైన ఆయ‌న‌ను ఈ సారైనా గెలిపించుకుని తీరాల‌నే గ‌ళాలు వినిపిస్తుండ‌డం ల‌క్ష్మారెడ్డికి ఇబ్బందిగా మారింది.

ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ నియోజకవర్గంలో ఎదురీదుతున్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. గత ఎన్నికల్లో బీఎస్పీ తరుపున తన వ్యక్తిగత చరిశ్మతో గెలిచిన ఇంద్రకరణ్ తర్వాత గులాబీ పార్టీకి జైకొట్టారు. దింతో వెంటనే ఆయనకు మంత్రిపదవి వరించింది. ఇక్కడ కాంగ్రెస్ తరుపున జిల్లా అధ్యక్ష్డు మహేశ్వర రెడ్డి రూపంలో బలమైన ప్రత్యర్ధి ఉన్నారు. బీజేపీ నుంచి కూడా సువర్ణరెడ్డి చాపకింద నీరులా దూసుకుపోతుండటంతో ఇంద్రకరణ్ రెడ్డికి ఇబ్బందులు తప్పేలా లేవు.

ఇక కేసీఆర్ సన్నిహితులు టీడీపీలో ఉన్నప్పటి నుంచి మిత్రులుగా ఉన్న నిజామాబాద్ జిల్లా బాన్స్ వాడ కి చెందిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం జిల్లాకి చెందిన సీనియర్ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు కూడా కొంత గడ్దు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. పోచారం పై పోటీకి దిగిన కాంగ్రెస్ అభ్యర్ధి కాసుల బాలరాజు పై వరుసగా ఓటమి పాలయ్యారన్న సానుభూతి ఉండటంతో ఇక్కడ కొంత పోటీ నెలకొంది.


ఇక తుమ్మల ఖమ్మం జిల్లా పాలేరు నుంచి రంగంలోకి దిగారు. కాంగ్రెస్ కంచుకోట పాలేరులో ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో తుమ్మల విజయం సాధించినా అప్పటి పరిస్థితులకు ఇప్పుడు పూర్తి భిన్నమైన వాతావరణం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి బడా కాంట్రాక్టర్ నియోజకవర్గానికే చెందిన కందాల ఉపేందర్ రెడ్డి బరిలో దిగడంతో తుమ్మల టఫ్ ఫైట్ ఎదుర్కొంటున్నారు. వాస్త‌వానికి పార్టీ అధినేత‌ కేసీఆర్ ఖ‌మ్మం జిల్లా బాధ్య‌త‌లు మొత్తం తుమ్మ‌ల‌కే అప్ప‌గించినా.. ఆయ‌న మాత్రం పాలేరు చుట్టూ తిరుగుతున్నాడంటే ఇక్క‌డ ఏ రేంజ్‌లో పోటీ నెల‌కొందో ఇట్టే అర్ధ‌మ‌వుతుంది.
ఏదేమైనా తెలంగాణ‌లో చాలా మంది మంత్రులు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు కోసం అష్ట‌క‌ష్టాలు ప‌డాల్సిన ప‌రిస్థితి నెలకొంది.