Home News Politics

తెలంగాణ ఎన్నికల పోరు త్రిముఖ పోటీగా మారిందా…?

SHARE

తెలంగాణ ఎన్నికల ముఖచిత్రం మారిపోయింది. నిన్నటి వరకూ ద్విముఖపోరు అనుకుంటే మోడీ టూర్‌తో అది త్రిముఖ పోరులా తయారైంది. చాపకింద నీరులా కమలదళం కూడా ప్రచారంలో దూసుకెళుతోంది. బీజేపీ హైకమాండ్‌ కూడా… తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాజస్థాన్ లాంటి కీలక రాష్ట్రాల్లో ప్రచారాన్ని పక్కనబెట్టి మరీ కమలదళమంతా తెలంగాణ మీద ఎందుకింత దృష్టి పెట్టింది ? తెలంగాణలో బీజేపీ దూకుడు వెనుక అసలు కారణమేంటి?

తెలంగాణలో మొదట్లో అధికార పార్టీ సహా అంతా వార్ వన్ సైడే అనుకున్నారు. కానీ పరిస్థితులు క్రమంగా మారాయి. నామినేషన్ల ఘట్టం పూర్తయ్యేసరికి ప్రజా కూటమి ప్రధాన ప్రత్యర్థిగా నిలబడింది. దీంతో ద్విముఖ పోరు తప్పదనుకున్నారు. అనూహ్యంగా పరిస్థితులు మరో మలుపు తిరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ తెలంగాణలో గత ఎన్నికల మాదిరిగానే నాలుగైదు సీట్లకే పరిమితమవుతుందనుకున్న బీజేపీ దూకుడు పెంచింది. అమిత్‌, మోడీలు ప్రచారంతో కమలాన్ని తక్కువ అంచనా వేయొద్దన్న సంకేతాలు పంపారు. తాము తెలంగాణపై ఎంత పట్టుదలగా ఉందో చెప్పకనే చెప్పారు.

ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందనుకున్నారు. అప్పటికి పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. పైగా బీజేపీ ఎమ్మెల్యేలున్న చోట్ల టీఆర్ఎస్ గట్టి అభ్యర్థుల్ని నిలబెట్టలేదు. పైగా కేసీఆర్ ప్రచారంలో ఎక్కడా బీజేపీని విమర్శించలేదు. వరుస పెట్టి సభల్లో దూసుకెళ్తున్న కేసీఆర్ …. కాంగ్రెస్‌ పార్టీ, కాంగ్రెస్‌ విధానాల్ని, చంద్రబాబు నాయుడిని, ప్రజా కూటమినే విమర్శిస్తూ వచ్చారు తప్ప… ఎక్కడా బీజేపీని పల్లెత్తు విమర్శ కూడా చెయ్యలేదు. కానీన వారం రోజులుగా తెలంగాణ ప్రచార పర్వంలో కమలనాథుల తీరు, జోరు చూస్తుంటే… బీజేపీ కూడా గట్టి పోటీ ఇస్తోందా అనిపిస్తోంది. అమిత్‌ షానే కాదు… ప్రధాని మోడీ కూడా ఒకే రోజు రెండు సభల్లో రాకెట్‌ స్పీడ్‌తో ప్రచారం చేశారు. నిన్న మొన్నటి వరకూ… తెలంగాణ ప్రభుత్వం మీద పెద్దగా రియాక్ట్ అవ్వని మోడీ కూడా.. ఇక్కడ టీఆర్ఎస్‌ సర్కారు మీద నిప్పులు కక్కారు. ఇంతలా విరుచుకుపడి మోడీ ప్రచారం చేస్తారని కూడా ఎవరూ అనుకోలేదు.

ఇక బీజేపీ విమర్శలకు కేసీఆర్ కౌంటర్ కూడా ఇచ్చారు. చర్చకు సిద్ధమా అని మోడీకి సవాల్ చేశారు. మోడీ,అమిత్ షా ల ప్రచారం ఎంత హీటెక్కించిదంటే ప్రజాకూటమిని పక్కన బెట్టి కమలం-కారు పార్టీల మధ్య మాటల తూటలు పేలాయి. కమలదళం తెలంగాణ ఎన్నికలను ఇంత సీరియస్ గా తీసుకోవడంతో కారుపార్టీ కూడా గేరు మార్చింది. అదే స్థాయిలో తేల్చుకుందాం రా…సవాళ్ళు ప్రతి సవాళ్ళకి దిగింది.

ఉత్తరాదిన దాదాపుగా విస్తరించిన కాషాయదళం… దక్షిణాదిన దక్కిన ఒక్క అవకాశాన్ని కర్నాటకలో చేజార్చుకుంది. అందుకే ఇప్పుడు అదే వ్యూహాన్ని తెలంగానలో అమలు చేసేందుకు ప్రచారంలో దూకుడు పెంచుతోంది. ఇక్కడ తమకు అందివచ్చిన ఛాన్స్ ను మరింత పెంచుకుని గతంలో కన్నా కనీసం రెట్టింపు సీట్లు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ అనూహ్యంగా టీఆర్‌ఎస్‌ మీద ఎందుకింతలా దాడి చేస్తోంది? అటు అమిత్‌ షా, ఇటు మోడీ ఇద్దరూ తెలంగాణ మీద ఎందుకింత సీరియస్ గా దృష్టి పెట్టారు? ప్రచారంలో కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నా… టీఆర్ఎస్‌ను ఎందుకు ప్రధానంగా టార్గెట్‌ చేసుకున్నారు. దీని వెనుక వ్యూహమేంటి? కీలకమైన ఉత్తరాది రాష్ట్రాలను కూడా పక్కన బెట్టి.. దక్షిణాదిన తెలంగాణ మీద ఎందుకు ఇంత తీక్షణంగా దృష్టి సారించారు? ఇలా ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి.