Home News Politics

తెలంగాణ ఎన్నికల్లో భారీగా బంధుగణం….!

SHARE

తెలంగాణ ఎన్నికల బరిలో బంధుగణం బానే కనిపిస్తోంది.. ఒకే ఇంటి నుంచి ఇద్దరుముగ్గురు పోటీలో నిలుస్తుంటే.. కొందరి చుట్టాలు కూడా రంగంలోకి దిగుతున్నారు .. అలాంటి వారిలో ఒకే పార్టీ నుంచి కొందరు….ప్రత్యర్థులుగా మరికొందరు పోటీ చేస్తుండటం విశేషం..ఈ ముందస్తు ఎన్నికల్లో రాజకీయంగా సత్తా చాటేందుకు సిద్దమవుతున్న బంధువులు, సన్నిహితుల వివరాలపై తెలుగు పాపులర్ ఎక్స్ క్లూజివ్ రిపొర్ట్…

టిఆర్‌ఎస్‌ నుంచి తండ్రి, కుమారుడు .. మేనల్లుడు మూడు చోట్ల నుంచి మళ్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారు… అత్త.. మేనల్లుడు మరోసారి ప్రత్యర్ధులుగా బరిలో నిలుస్తున్నారు… తాజామాజీ ఎమ్మెల్యేలైన భార్యభర్తలు మరోసారి తమ సత్తా చాటుకోవడానికి సిద్దమవుతున్నారు .. ఇక అత్త, మేనల్లుళ్లు.. వేరువేరు చోట్ల విజయం కోసం పోరాడుతున్నారు. ఇలా తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బంధువులు, సన్నిహితులు రాజకీయంగా సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.ఇప్పటికే టిఆర్‌ఎస్‌ 12 మినహా మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది… కాంగ్రెస్‌ అధికారికంగా అభ్యర్థులను ప్రకటించకున్నా పలువురు బంధువులు బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది..


ఆపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు టి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర కీలక కాంగ్రెస్‌ నేతల కుటుంబసభ్యులు ఈ సారి కూడా ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఒక పార్టీ నుంచే కాకుండా వివిధ పార్టీల నుంచి పోటీకి సిద్దమయ్యారు … కొన్ని చోట్ల ప్రత్యర్థులుగానూ తలపడుతూ ఆసక్తి రేపుతున్నారు.. టిఆర్‌ఎస్‌ నుంచి కేసీఆర్‌, ఆయన తనయుడు కేటీఆర్‌, మేనల్లుడు హరీష్‌రావులు వారు గతంలో ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల నుంచి మళ్లీ బరిలో నిలిచారు..
టి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్‌ నుంచి మరోమారు బరిలో దిగనున్నారు… ఉత్తమ్‌ సతీమణి మాజీ ఎమ్మెల్యే పద్మావతి ఈ సారి కూడా కోదాడ అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి పోటీ చేస్తారని పార్టీ వర్గాల సమాచారం…. ఇప్పటికే ఆమె ప్రచారం కూడా మొదలుపెట్టేశారు.. ఫ్యామిలీకి ఒకే టికెట్‌.. అని రాహుల్‌గాంధీ పెట్టిన నిబంధనకు సంబంధించి వీరి విషయంలో మినహాయింపు ఇచ్చారంటున్నారు..

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు మాజీ మంత్రి డీకే అరుణ తన సొంత నియోజకవర్గం గద్వాల నుంచి బరిలో దిగడం ఖియమే .. ఆమె భర్త డీకే భరత్‌సింహారెడ్డి సోదరి కుమారుడు కృష్ణమోహన్‌రెడ్డి ఆమెకు ప్రత్యర్థిగా టిఆర్‌ఎస్‌ తరపున మరోసారి బరిలో దిగనున్నారు.. గత ఎన్నికల్లో మేనల్లుడిపై డీకే అరుణ విజయం సాధించారు…. దాంతో అత్తా, మేనల్లుళ్ల పోటీ ఈ సారి కూడా ఆసక్తికరంగా తయారైంది..

మరోవైపు డికే అరుణ సోదరుడు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మక్తల్‌ నుంచి టిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.. గత ఎన్నికల్లో ఆయన మక్తల్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన రామ్మోహన్‌ .. ఆ తర్వాత టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు..కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సారి కూడా నల్గొండ నుంచి పోటీ చేయనున్నారు… ఆయన సోదరుడు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు… వీరికి కూడా రాహుల్‌ విధించిన ఫ్యామిలీకి ఒకే టికెట్‌ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందంటున్నారు..

కాంగ్రెస్‌ పార్టీ ప్రచారకమిటీ ఛైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఆయన సోదరుడు మాజీ ఎంపీ మల్లు రవి ఇద్దరూ కూడా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు .. భట్టివిక్రమార్క ఖమ్మం జిల్లా మధిర నుంచి … మల్లురవి మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల సెగ్మెంట్‌ నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు, మాజీ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి ఈ సారి మహేశ్వరం నుంచి మరోమారు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు…


ఆమె మేనల్లుళ్లు ప్రత్యర్ధి పార్టీ టిఆర్‌ఎస్‌ తరపున పోటీలో నిలిచారు .. తాండూరు నుంచి ప్రస్తుత ఆపద్దర్మ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి … ఆయన తమ్ముడు నరేందర్‌రెడ్డి కొడంగల్‌ నుంచి టిఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా బరిలో నిలిచారు… ఈ ఇద్దరు సబితా మేనల్లుళ్లే.. ఇక సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి గత ఎన్నికల్లో చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు .. ఆయన కూడా ఈ సారి రాజేంద్రనగర్‌ కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు… ఇలా వివిధ చోట్ల బంధుగణం పోటీ చేస్తుండటం ఆసక్తి రేపుతోంది