Home News Politics

అసలు తెలంగాణ కాంగ్రెస్‌లో మిగిలేది ఎవరు?

తెలంగాణ కాంగ్రెస్‌లో మిగిలేది ఎవరు? ప్రశ్న వేసుకోవడంతోపాటు సమాధానం వెదుకుతోంది తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం. ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టిందని..మొదట భావించినా అసలు కారణాలు వేరే ఉన్నాయని భావిస్తున్నాయి గాంధీ భవన్ వర్గాలు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను కోలుకోలేని విధంగా దెబ్బకొట్టడంతోపాటు…సీఎల్పీని ఖాళీ చేసేందుకు టీఆర్ఎస్ వ్యూహం అమలు చేస్తోందా?. కాంగ్రెస్, బీజేపీ ముక్త భారత్ అనే కేసీయార్ నినాదం అసలు లోగుట్టు, ఆచరణను వదిలేస్తే… కాంగ్రెస్ ముక్త తెలంగాణ అనే దిశలో మాత్రం జోరుగా పావులు కదులుతున్నయ్… మరో అయిదారుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరకతప్పదు, సీఎల్పీ టీఆర్ఎస్‌లో విలీనం కాక తప్పదు… సబిత సహా కాంగ్రెస్ వీరవిధేయులు అనుకున్నవాళ్లు కూడా వెళ్లిపోతుంటే ఇక మిగిలేదే ఎవరు…?

కాంగ్రెస్ నుండి రోజుకో ఎమ్మెల్యే… కారెక్కుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్య బలం పెంచుకోవటం కోసం టిఆర్ఎస్ చేరికలను..ప్రోత్సహిస్తున్నట్టు భావించింది కాంగ్రెస్. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా కాంగ్రెస్ నుంచి మరో ఎమ్మెల్యే కారెక్కేశారు. ఇప్పటికి కాంగ్రెస్ పార్టీకి చెందిన… ఆరుగురు ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియ నాయక్, సబితా ఇంద్రారెడ్డి, ఉపేందర్ రెడ్డి,వనమా వెంకటేశ్వరరావు…ఇలా అంతా టీఆర్ఎస్‌లోకి క్యూ కట్టారు. వీరంతా టీఆర్ఎస్‌లో చేరితే..కాంగ్రెస్‌లో మిగిలేది 12 మంది మాత్రమే. ఇందులో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి గెలిచిన వారిలో పొదెం వీరయ్య , సీఎల్పీ నేత భట్టి మాత్రమే మిగిలారు. భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య తోనూ టీఆర్ఎస్ నేతలు టచ్‌లో ఉన్నారు. ఈ ఇద్దరు కూడా టీఆర్ఎస్‌లో చేరితే..జిల్లా నుంచి భట్టి మాత్రమే మిగులుతారు.

తెలంగాణ కాంగ్రెస్‌ను ఏకతాటిపై నడిపించగల నాయకత్వం ఏమైనా ఉందా..? అసలు ఆ పార్టీలో ఎవరు కేసీయార్ కోవర్టో ఎవరూ చెప్పలేని స్థితి… ఒక్క ముక్కలో చెప్పాలంటే కేసీయార్ గనుక గట్టిగా విజిల్ వేస్తే, మొత్తం సీఎల్పీయే ఖాళీ అవుతుందేమో అనేంత దుస్థితి ఇప్పుడు… మరోవైపు డీకేఅరుణ బీజేపీలో జంప్… జానా, నైజానా అనే సందిగ్ధంలో ఉన్న ఓ పెద్ద నేత కొడుకు కూడా త్వరలో అరుణ బాటేనట..వాళ్లను ఆపడం రాహుల్ తరం కాదు, ఇంకెవరి వల్ల కూడా కాదు… టీఆర్ఎస్ పెట్టే ఒత్తిళ్లు, చూపే ప్రలోభాలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిజంగా ఎందరు మిగులుతారో చెప్పడమూ కష్టమే… ఈ అయిదేళ్లే కాదు, మరో అయిదేళ్లూ మేమే, మేం చెప్పినట్టు వింటే మావాళ్లు, లేదంటే మీ ఇష్టం… ఇలాంటి మాటలు విన్నాక, ఎవరైనా తమ చాన్సులే చూసుకుంటారు కదా…


నిజానికి రెండేళ్లుగా బీజేపీ గనుక సిన్సియర్‌గా ప్రయత్నిస్తే బోలెడు మంది బీజేపీలో చేరేవాళ్లు… కానీ ఆ దిశలో సరైన ప్రయత్నాలు జరగలేదు… రాష్ట్ర నాయకత్వం కూడా కొత్తవాళ్లను అంగీకరించే స్థితిలో లేదు, కొందరు నాయకులు కొత్తవాళ్లను రానివ్వరు… చివరకు హార్డ్ కోర్ రాజాసింగ్ వంటి నేతలే విసిగిపోయారు… పార్టీలోకి వచ్చిన ఆ నాగం జనార్ధన‌రెడ్డి వంటి మొండి లీడర్లే బయటికి వెళ్లిపోయే దుస్థితి… అమిత్ షాయే తెలంగాణ పార్టీ స్థితీగతీ అర్థం గాక నెత్తీనోరూ బాదుకున్నాడు పలు మీటింగుల్లో… సో, తెలంగాణ బీజేపీకి రోగచికిత్స స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు రాంమాధవ్ వల్ల కూడా కాదట… మరి ఈ స్థితిలో డీకే అరుణ బీజేపీలో చేరడం వల్ల ఆమెకొచ్చే ఫాయిదా ఏమిటి..? కొంచెం ఇండిపెండెంటు ధోరణి ఉండే ఆమె దాన్ని ఏమాత్రం సహించని తెలంగాణ బీజేపీలో ఇమడగలదా..? ఎవరికీ అంతుపట్టదు… సొంతంగా తన వోట్లు ప్లస్ బీజేపీ వోట్లతో మహబూబ్‌నగర్ ఎంపీ సీటు గెలవగలదా..? గెలిచినా ఓడినా కేంద్రంలో మంచి అవకాశాలు ఇస్తామని హామీ ఇచ్చారా..? లేక సికింద్రాబాద్, మహబూబ్‌నగర్ మాకు వదిలేయి…, స్నేహపూర్వక పోటీ వంటి బలహీన అభ్యర్థులతో సహకరించు అని కేసీయార్‌తో మాట్లాడారా..


టీఆర్ఎస్‌ వ్యూహానికి కాంగ్రెస్‌ విలవిల్లాడుతోంది. కాంగ్రెస్‌ సభ్యుల్లో మూడింట రెండొంతులమందిని చేర్చుకోవడం ద్వారా సీఎల్పీని విలీనం చేసుకోవాలని టీఆర్ఎస్‌ వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు ప్రతిపక్షహోదాను గల్లంతు చేయడంతోపాటు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఆ పార్టీని దెబ్బతీయాలనేది గులాబీ బాస్ వ్యూహంగా కనిపిస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ 19సీట్లు గెలిచింది. ఇందులో 14 మంది టీఆర్ఎస్‌లో చేరితే.. దాన్ని పార్టీ విలీనంగా గుర్తించవచ్చు.గతంలో అసెంబ్లీలో టీడీపీ, మండలిలో కాంగ్రెస్‌ విషయంలో ఇదే వ్యూహాన్ని అమలు చేసింది. కాంగ్రెస్ నుంచి ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరడాని సిద్ధం కావడంతో.. మరో 8 మంది వస్తే విలీనం పూర్తైనట్లే. ఈ ఎనిమిది మందిని కూడా సమీకరించే ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం.

టీఆర్ఎస్‌లోకి ఆపరేషన్ ఆకర్ష్ పూర్తైతే.. కాంగ్రెస్‌లో ఇక కరడు కట్టిన కాంగ్రెస్ వాదులే మిగుల్తారా..?. ప్రస్తుతం కాంగ్రెస్ లో… సీఎల్పీ నేత భట్టి, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, సుధీర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి, గండ్ర, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సీతక్క, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ మాత్రమే మిగిలారు. వీరిలోకూడా ఎంత మంది మిగులుతారు. ? ఎంత మంది కారెక్కడనికి సిద్ధంగా ఉన్నారు అనేది ఆసక్తికరంగా మారింది.సొంత పార్టీ ఎమ్మెల్యే లనే అనుమానంగా చూడాల్సిన పరిస్థితిలో ఉంది కాంగ్రెస్ నాయకత్వం. ఓవైపు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటం..మరో వైపు గెలిచిన ఎమ్మెల్యే లు చే జారిపోవటం కాంగ్రెస్‌కి నష్టం కలిగించే అంశమే. పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోవటానికి..ఎమ్మెల్యేలు కీలకం. కేసీఆర్… పార్లమెంట్ ఎన్నికల వ్యూహాన్ని అమలు చేస్తుంటే.. కాంగ్రెస్… చేతులు కట్టుకుని నిలబడి చూస్తోంది తప్పితే.. ఎమ్మెల్యేలను ఆపేందుకు ప్రయత్నాలేమీ చేయడం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది.