Home News Politics

కాంగ్రెస్ లో ఆ సీటు చాలా హాటు గురూ…!

SHARE

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం అవుతుంది. ఆశావహుల నుండి దరఖాస్తు లు కోరుతుంది. ఆశావహులు సంఖ్య భారీగానే ఉన్న ఒక సీటు పై మాత్రం అందరి కన్ను పడింది.ఆ సీటు మాకంటే మాకు అంటూ సీనియర్ల నుంచి జూనియర్ల వరకు పోటీ పడుతున్నారు.మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ మంచి ఫలితాలు రావడంతో అందరి కన్ను ఆ సీటు పై పడింది…

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో.. ఎక్కువ మంది నాయకులు ఖమ్మం పార్లమెంట్ సీటు మీదే కన్నేశారు. అక్కడే పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. అందుకే.. పార్టీలో ముఖ్య నాయకులు మొదలు విజయశాంతి లాంటి వాళ్ళు కూడా ఖమ్మం గురించి ఆలోచిస్తున్నారు. ఇటు..సీనియర్ నాయకుడు విహెచ్ కూడా ఈ సీటు ఆశిస్తున్నారు. పార్టీ కి దరఖాస్తు కూడా పెట్టేశారు. ఇక ఖమ్మం మాజీ ఎంపీ రేణుక చౌదరి మాత్రం తనను కాదని ఇక్కడ ఎవరికి అంత సీన్ లేదంటున్నారు.అదే జిల్లాకి చెందిన మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా ఈ సీటు పై ఖర్చీఫ్ వేశారు.

ఖమ్మం తర్వాత… ఎక్కువ మంది నాయకులు టికెట్ ఆశిస్తున్న నియోజకవర్గం నాగర్ కర్నూల్. సిట్టింగ్ ఎంపీ నంది ఎల్లయ్య ఉండగానే..పార్టీలో చాలా మంది నాయకులు ఈ సీటు మీద కన్నేశారు. మాజీ ఎంపీ మల్లు రవి తో పాటు మాజీ ఎమ్మెల్యే సంపత్… రేవంత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ మాదిగ కూడా సీటు ఆశిస్తున్నారు.
నల్గొండ నుంచి పటేల్ రమేష్ రెడ్డి కూడా పార్టీ టికెట్ కోసం దరఖాస్తూ చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట టికెట్ ఆశించి బంగపడ్డ రమేశ్ రెడ్డికి ఈ సీటు పై అప్పట్లో హామీ లభించింది. ఇక భువనగిరి నుండి వంగాల స్వామిగౌడ్ సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వరంగల్ నుంచి ఇందిర పోటీ పడుతున్నారు. ఇటీవలే స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ నుండి పోటీ చేసిన ఇందిరా మళ్ళీ టికెట్ కోసం ప్రయత్నం మొదలుపెట్టారు.

మహబూబా బాద్ సీటు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ ఎంపీ సీటు ఆశిస్తున్నారు. అయితే ఇదే సీటు కోసం బెల్లయ్య నాయక్ దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎంపీలకు టికెట్లు ఇవ్వటానికి అధిష్టానం సిద్ధంగా లేదని చెప్తున్నాయి ఏఐసీసీ పార్టీ వర్గాలు. మహారాష్ట్రలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు బెల్లయ్య నాయక్.

మహబూబ్ నగర్ సీటు పై పాలమూరు అగ్రనాయకుల కన్నుపడింది.ఆ జిల్లా నుంచి మొన్నటి ఎన్నికల్లో ఓటమిపాలైన మాజీ మంత్రి డీకే అరుణ,రేవంత్ రెడ్డి మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి సీటు కోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నారు.ఇక డీకే అరుణ ఒకడుగు ముందుకేసి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి తనకు మద్దతు కూడగట్టుకుంటున్నారు.మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలైన సీనియర్లు ఎలాగోఅలా టిక్కెట్ దక్కించుకుని దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ సానుకూల పవనాలలో విక్టరీ కొట్టాలని స్కెచ్ లు గీస్తూన్నారు.కాంగ్రెస్ నుండి టికెట్ ఆశిస్తున్న వారికి రెండు రోజుల మాత్రమే గడువు మిగిలింది. ఇంకా ఎంతమంది పార్లమెంట్ సీట్ల కోసం పోటి పడతారో… ఎవరిని అధిష్టానం బరిలో నిలుపుతోందో చూడాలి..