Home News Politics

తెలంగాణ అసెంబ్లీలో ఇక అంతా స్వ‌ప‌క్ష‌మే!

కాంగ్రెస్ చేజార‌బోతున్న విప‌క్ష హోదా కాంగ్రెస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల విలీనం

SHARE

నిర్మాణాత్మ‌క ప్ర‌తిప‌క్ష‌ముంటే ప్ర‌భుత్వ త‌ప్పిదాల్ని ప్ర‌శ్నించేందుకు వీల‌వుతుంది. ప్ర‌జాస్వామ్యంలో అదో ఆరోగ్య‌క‌ర‌మైన సంప్ర‌దాయం కూడా. కానీ తెలంగాణ అసెంబ్లీలో ప్ర‌శ్నించేవారే ఉండ‌కూడ‌ద‌నుకుంటోంది అధికార‌పార్టీ. స్వ‌ప‌క్ష‌మైనా విప‌క్ష‌మైనా ఎవ‌రి ప‌క్ష‌మైనా అంతా తానే కావాల‌నుకుంటోంది. తెలంగాణ క‌ల‌ను సాకారం చేసిన పార్టీగా…అధికారంలోకి రావాల‌ని క‌ల‌లుగ‌న్న కాంగ్రెస్‌ని రెండుసార్లు ఓడించిన టీఆర్ఎస్‌….ఆ పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉండ‌టానికి కూడా వీల్లేద‌నుకుంటోంది. అందుకే తిరుగులేని మెజారిటీతో అధికారంలోకొచ్చాక కూడా ఫిరాయింపుల ప‌ర్వం సాగుతూనే ఉంది.

తెలంగాణ‌లో కాంగ్రెస్ భ‌య‌ప‌డిందే జ‌రుగుతోంది. అధికారం అంద‌క‌పోయినా ప్ర‌తిప‌క్షంగా బ‌ల‌మైన పాత్ర పోషించాల‌నుకున్న కాంగ్రెస్‌ని ఉనికే లేకుండా చేస్తోంది టీఆర్ఎస్‌. ఇప్ప‌టికే ప‌దిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ కండువా క‌ప్పుకున్నారు. తాజాగా మ‌రో ముగ్గురు టీఆర్ఎస్‌లో చేరిక‌కు సిద్ధ‌మ‌య్యారు. దీంతో జూన్‌లో అసెంబ్లీ స‌మావేశాలు మొద‌ల‌య్యేనాటికి టీకాంగ్రెస్‌కు ప్ర‌తిప‌క్ష హోదా కూడా లేకుండా పోతుంది. కేసీఆర్‌పై ఒంటికాలిమీద లేచే సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి కూడా చెయ్యివ్వ‌డం కాంగ్రెస్‌కి మింగుడుప‌డ‌ని ప‌రిణామం.

గ‌త డిసెంబ‌రులో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే చివ‌రికి ఆరుగురే మిగిలేలా ఉన్నారు. తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క పోను మ‌రో న‌లుగురే పార్టీతో ఉన్న‌ట్లు. వారు కూడా చివ‌రిదాకా ఉంటారన్న గ్యారంటీ లేదు. దీంతో ప్ర‌తిప‌క్ష‌హోదాకు కావాల్సిన సంఖ్యాబ‌లం కాంగ్రెస్ చేజారింది. 13మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంత‌కాల‌తో విలీనం లేఖ‌ను స్పీక‌ర్‌కు అంద‌జేయ‌బోతోంది టీఆర్ఎస్‌. అంటే ఓ ప్రాంతీయ‌పార్టీలో జాతీయ‌పార్టీ విలీనం కాబోతోంద‌న్న‌మాట‌!

త‌గిన మెజారిటీ ఉండి కూడా కేసీఆర్ ఫిరాయింపుల్ని ఎందుకు ప్రోత్స‌హిస్తున్నార‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం క‌నిపిస్తూనే ఉంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫలితాల త‌ర్వాత కొడుకు కేటీఆర్‌కి ప‌ట్టాభిషేకం చేయాల‌న్న‌ది గులాబీబాస్ ఆలోచ‌న‌. ఒకే ఒర‌లో రెండు క‌త్తులు ఇమ‌డ‌వ‌నే మేన‌ల్లుడు హ‌రీష్‌రావుని నిదానంగా ప‌క్క‌కు త‌ప్పించేశారు. ఇప్పుడు అసెంబ్లీలో కూడా ప్ర‌తిప‌క్షం పూర్తిగా నిర్వీర్యం అయితే పాల‌క‌ప‌క్షం మ‌రింత బ‌లంగా క‌నిపిస్తుంది. రాజ‌కీయ వార‌సుడి భ‌విష్య‌త్తు న‌ల్లేరుపై బండిన‌డ‌క‌లా సాగేందుకే ఈ ఏర్పాట్ల‌న్నీ. ఇప్పుడు కాంగ్రెస్ నెత్తీనోరు బాదుకున్నా చేయ‌గ‌లిగిందేమీ లేదు. చేష్ట‌లుడిగి చూడ‌టం త‌ప్ప‌!