Home News Politics

ఇద్ద‌రూ ఒక్క‌టై విక్టరీ కొడతారా…?

SHARE

ఎట్టకేలకు ఒక వివాదం ముగిసింది. ఏళ్ళ తరబడి ఫ్యాక్షన్ గొడవలతో దద్దరిల్లిన జ‌మ్మ‌ల‌మ‌డుగులో టీడీపీ పార్టీ పంచాయితీ ఎట్ట‌కేల‌కు ప‌రిష్కార‌మైంది. గ‌త కొంత‌కాలంగా అమరావతిలో సీఎం సమక్షంలో నలుగుతున్న ఈ గొడవకి ఓ పరిష్కారం లభించి సైకిల్ పార్టీకి మంచి రిలీఫ్ ఇచ్చింది. ఎమ్మెల్సీ రామ‌సుబ్బారెడ్డి రానున్న ఎన్నిక‌ల్లో జ‌మ్మ‌ల‌మ‌డుగు అసెంబ్లీకి పోటీ చేయ‌నున్నారు. మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి క‌డ‌ప పార్ల‌మెంటు స్థానానికి పోటీ చేస్తారు. అయితే, ఇందుకు గానూ రామ‌సుబ్బారెడ్డి ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేయాల‌నే ఒప్పందానికి వ‌చ్చారు. ఈ ప‌ద‌విని ఆదినారాయ‌ణ‌రెడ్డి కుటుంబంలో ఒక‌రికి ఇవ్వ‌నున్నారు.

కడప జిల్లాలో రాజకీయం హీట్ ఎక్కుతోంది. ముఖ్యంగా అది వైసీపీ అధినేత వైయస్ జగన్ సొంత జిల్లా కావడంతో ఆ జిల్లాకు ప్రాముఖ్యత మరింత పెరిగింది. జిల్లాలో కీలక నియోజకవర్గం మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న జమ్మలమడుగు నియోజకవర్గం. ముందు నుంచి రాష్ట్ర రాజకీయాల్లో జమ్మలమడుగుకు ప్రత్యేక స్థానం ఉంది. అక్కడి రెండు కుటుంబాలదే పైచేయిగా ఉంటూ వస్తోంది. కొన్ని దశాబ్దాలుగా జమ్మలమడుగు నియోజక వర్గంలో రెండు కుటుంబాలదే ఆధిపత్యంగా ఉంటూ వస్తోంది. ఒకటి పొన్నపురెడ్డి కుటుంబం అయితే రెండవది దేవగుడి కుటుంబం.

ద‌శాబ్దాలుగా జ‌మ్మ‌ల‌మ‌డుగులో ఆదినారాయ‌ణ‌రెడ్డి, రామ‌సుబ్బారెడ్డి కుటుంబాల మ‌ధ్య ఫ్యాక్ష‌న్ గొడ‌వ‌లు ఉన్నాయి. ఈ గొడ‌వ‌ల‌తో అనేక మంది హ‌త‌మ‌య్యారు కూడా. వీరిద్ద‌రూ ఎప్పుడూ వేర్వేరు పార్టీల్లోనే కొన‌సాగారు. గ‌త ఎన్నిక‌ల్లోనూ ఆదినారాయ‌ణ‌రెడ్డి వైసీపీ నుంచి, రామ‌సుబ్బారెడ్డి టీడీపీ నుంచి పోటీ చేశారు. ఆదినారాయ‌ణ‌రెడ్డి విజ‌యం సాధించి త‌ర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రి ప‌ద‌వి కూడా పొందారు. రామ‌సుబ్బారెడ్డిని బుజ్జ‌గించేందుకు గానూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చారు. ఇద్ద‌రూ ఒక్క పార్టీలోనే ఉన్నా వీరి మ‌ధ్య మాట‌లు లేవు. ఇద్ద‌రిలో ఒక‌రు అసెంబ్లీకి, మ‌రొక‌రు పార్ల‌మెంటుకు పోటీ చేయాల‌ని చంద్ర‌బాబు ప్ర‌తిపాద‌న తీసుకువ‌చ్చిన‌ప్పుడు క‌డ‌ప పార్ల‌మెంటుకు పోటీ చేసేందుకు ఇద్ద‌రూ ఆస‌క్తి చూప‌లేదు. వైసీపీ బ‌లంగా ఉన్న ఆ స్థానానికి పోటీ చేయ‌డం కంటే జ‌మ్మ‌ల‌మ‌డుగు అసెంబ్లీకి పోటీ చేస్తేనే మేల‌ని భావించారు. ఓ ద‌శ‌లో రామ‌సుబ్బారెడ్డిని స్వ‌తంత్ర అభ్య‌ర్థిగానైనా పోటీ చేయాల‌ని వారి అనుచ‌రులు ఒత్తిడి తెచ్చారు.

క్యాడర్ ను కాపాడుకోవాలంటే పోటీ చేయడం తప్పనిసరిగా ఇద్దరు నేతలూ భావిస్తున్నారు. రామసుబ్బారెడ్డి అనుచరులైతే ఏకంగా ఇండిపెండెంట్ గానైనా పోటీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఈ ఇద్దరు నేతలు పైకి కలిసినట్లుగా కనిపిస్తున్నా ఇద్దరి మధ్య మాటలే లేవు. నేతల మధ్యే మాటలు లేకపోతే క్యాడర్ మాత్రం కలిసి పనిచేసే అవకాశం ఉండదంటున్నారు. దీంతో పోటీ చేసిన నేతకు ఇతర క్యాడర్ అనుచరులు సహకరించే అవకాశాలు కూడా కనిపించడం లేదు. కాబట్టి, కేవలం నేతలను ఒప్పించడమే కాకుండా క్యాడర్ ను కూడా కలపాల్సిన అవసరం పార్టీపై ఉంటుంది. మరి, అనేక ఏళ్లుగా బద్ధవైరం కలిగిన రెండు పక్షాల క్యాడర్ ఏమేర కలిసి పనిచేస్తుందో చూడాలి.

చివ‌ర‌కు ఆదినారాయ‌ణ‌రెడ్డి ఒక‌డుగు వెన‌క్కు వేసి క‌డ‌ప పార్ల‌మెంటుకు పోటీ చేసేందుకు అంగీక‌రించారు. ఇద్ద‌రు బ‌ల‌మైన నేత‌ల మ‌ధ్య సంధి కుద‌ర‌డంతో జ‌మ్మ‌ల‌మ‌డుగులో పార్టీకి తిరుగులేద‌ని తెలుగు త‌మ్ముళ్లు భావిస్తున్నారు. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు బాగానే ఉన్నా… రేపు ఎన్నిక‌ల్లో వీరిద్ద‌రూ ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకుంటారా అంటే అనుమాన‌మే. రెండేళ్లుగా ఒక్క పార్టీలోనే ఉంటున్నా.. వీరిద్ద‌రి మ‌ధ్య ఇప్ప‌టివ‌ర‌కు మాట‌లే లేవు. మ‌రి, ఇద్ద‌రు నేత‌లూ, రెండు వ‌ర్గాలూ ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకుంటేనే జ‌మ్మ‌ల‌మ‌డుగు స్థానాన్ని టీడీపీ గెలుచుకునే అవ‌కాశం ఉంటుందంటున్నారు. ఇక‌, ఆదినారాయ‌ణ‌రెడ్డి వంటి బ‌ల‌మైన నేత టీడీపీ నుంచి క‌డ‌ప పార్ల‌మెంటుకు పోటీ చేస్తుండ‌టం ఆ పార్టీకి క‌డ‌ప జిల్లాలో కొంత మేలు చేసేదే అంటున్నారు.