Home News Stories

సైకిల్ పార్టీ ఆశావహుల్లో టిక్కెట్ల దడ…!

SHARE

ఎన్నికల్లో నెగ్గాలంటే ఏముండాలి… ప్రజల్లో పలుబడి ఉండాలి… ప్రచారానికి ఆర్థిక బలం ఉండాలి. పంచడానికి పచ్చనోట్లుండాలి… ఇవన్నీ ఓకే.. కానీ వాటన్నింటికన్నా ముందు మరొకటి ఉండాలి…అదే పార్టీ సీటు. అవును…. పార్టీ టికెట్‌ ఇవ్వకపోతే… ఇదే ఇప్పుడు పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ పెడుతోంది. అసలు టికెట్‌ వస్తుందా? రాదా? అన్నభయం ఏపీలో చాలా మంది నేతల్ని వెన్నాడుతోంది.

ఎన్నికల ముందుకు శరవేగంగా దూసుకెళ్తున్న ఏపీలో రాజకీయాలు రోజు రోజుకూ మారిపోతున్నాయి. నిన్నటి వరకూ ఓ పార్టీలో ఉన్న నేతలు… ఇప్పుడు మరో పార్టీలోకి చేరుతున్నారు. పొద్దున్న ఒక పార్టీలో ఉన్న నేతలు.. సాయంత్రం కల్లా మరో పార్టీలోకి చేరిపోతున్నారు. దశాబ్దాలుగా ఒక పార్టీలో ఉన్న నేతలు.. ఇప్పుడు కొత్త అవకాశాల కోసం కండువాలు మార్చేసుకుంటున్నారు. కొందరైతే కుటుంబ కథా చిత్రంలా…ఏకంగా ఫ్యామిలీ ప్యాకేజ్‌తోనే పార్టీలు మారుతున్నారు. అప్పటి రాజకీయ సమీకరణాలు, స్థానిక పరిస్థితులు, ప్రీపోల్ సర్వేలు… కుల సమీకరణాలు… వర్గ సమీకరణాలు… ప్రభుత్వాల సంక్షేమ పథకాలు… విపక్షాల ఎజెండాలు… ఇలా ఎన్నో లెక్కలేసుకున్నాక… అత్యంత రహస్యంగా ఇతర పార్టీ నాయకులతో మంతనాలు జరిపి, పూర్తి స్థాయిలో భరోసా, హామీలు వచ్చాక ఓ ఫైన్ మార్నింగ్ నేరుగా వెళ్లి కండువాలు మార్చేస్తున్నారు.

ఇక్కడి వరకూ బాగానే ఉంది. కానీ ఇక్కడి నుంచే కొత్త టెన్షన్లు మొదలవుతున్నాయి. అదే టెన్షన్లు కొత్తగా వచ్చిన నేతలకు అనుమానాలు రేకెత్తిస్తుంటే… అప్పటికే పార్టీలో కష్టపడుతున్న ఆశావహులకు అంతులేని భయాల్ని పుట్టిస్తోంది. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలతో పాటు.. ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో నెగ్గుకురావడం అటు అధికార టీడీపీకి ఎంత ముఖ్యమో… ప్రతిపక్ష వైసీపీకి కూడా అంతే ముఖ్యం. అందుకే రెండు పార్టీల అధినేతలూ… ఎలాగైనా నెగ్గితీరాలన్న కసిలో ఉన్నారు. ఇప్పటికే వైఎస్‌ జగన్ చేసిన సుదీర్ఘ పాదయాత్ర తనకు ప్లస్సవుతుందని భావనలో ఉంటే…. సంక్షేమ పథకాలే తనను మరోసారి పీటమెక్కిస్తాయని సీఎం చంద్రబాబు నాయుడు నమ్ముతున్నారు. వీళ్లందరి ఆలోచనలు, అంచనాలు బాగానే ఉన్నా అధినేతల హామీలతో పార్టీలు మారిన నియోజకవర్గాలతో పాటు.. మరికొన్ని స్థానాల్లో సిట్టింగ్‌లకు ఈ సారి టికెట్‌ వస్తుందో రాదో అన్న భయం పట్టుకుంది.

ఇప్పుడు ఏపీలో అధికార పార్టీ నేతల్లో ఈ టెన్షన్ ఎక్కువగా కనిపిస్తోంది. ఈ టెన్షన్ కేవలం ఇతర పార్టీల నుంచి కొత్త నేతలు వచ్చి చేరిన సెగ్మెంట్లలోనే కాదు.. దాదాపు ఉన్న అందరి సిట్టింగ్‌లోనూ ఈ టెన్షన్ కనిపిస్తోంది. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో ఏపీ అధికార పార్టీలో 30 మంది సిట్టింగ్‌లకు టికెట్లు దక్కే అవకాశం లేదన్న అభిప్రాయాలు పార్టీలో చక్కర్లు కొడుతున్నాయి. ఎమ్మెల్యేల పనితీరును బట్టి ఒకరిద్దరు సిట్టింగ్‌లకు టికెట్లు రాకపోవడం అన్నది కామన్. కానీ ఇలా అనూహ్యంగా 30 మంది సిట్టింగ్‌లకు టికెట్లు ఎగిరిపోతాయని తెలిసి… ఆ ముప్పై మంది ఎవరా అని ప్రతి ఒక్కరూ టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో టీడీపీ 106 సీట్లు దక్కించుకుంది. అంటే వీరిలో 30 మందికి టికెట్లు గల్లంతు అంటే… దాదాపు ప్రతి ముగ్గురు సిట్టింగ్‌ల్లో ఒక్కరికి ఎసరు పడినట్టే. అందుకే సీటెవరికో… వేటెవరికో తెలియక టీడీపీ సిట్టింగ్‌లు టెన్షన్ పడుతున్నారు.

టీడీపీ సిట్టింగ్‌లు పడుతున్న టెన్షన్ అంతా ఇంతా కాదు… తమకు టికెట్‌ వస్తుందో రాదో… తెలియదు. రాకపోతే ముందు జాగ్రత్త పడేందుకు తగిన సమయం కూడా లేదు. అయితే వీరిలో కొందరిని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నిలబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ ఎమ్మెల్సీగా ఛాన్స్ దక్కితే ఫర్వాలేదు. అసలు సీటే దక్కకపోతే అన్న భయం మిగిలిన వారిలో పెరిగిపోతోంది. కొన్ని చోట్ల వైసీపీ నుంచి వచ్చిన నాయకులు టికెట్లు తమకే దక్కుతాయని అనుకుంటే.. గత ఎన్నికల్లో అదే స్థానంలో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిన అభ్యర్థులు కూడా అధిష్టానాన్ని ఒప్పించి అవకాశం దక్కించుకోవాలని చూస్తున్నారు.

అధికార పార్టీలో ఆశావహుల పరిస్థితి ఇలా ఉంటే.. వైసీపీ నుంచి టీడీపీలోకి జంపయిన నేతల్లో కూడా కొందరికి టికెట్‌ దక్కతుందో దక్కదో అన్న భయాలు కనిపిస్తున్నాయి. తమకు బలం, బలగం ఉన్న సెగ్మెంట్లో టికెట్‌ దక్కించుకోవాలని కొందరు ఆలోచనలు చేస్తుంటే… తమ కుటుంబీకులకు టికెట్లు ఇప్పించాలని మరికొందరు ఆలోచనలు చేస్తున్నారు. అయితే అధిష్టానం మాత్రం వేరే సమీకణాలు వేస్తూ.. వాళ్లను పక్క నియోజకవర్గాలకు పరిమితం చెయ్యాలని చూస్తోందన్న వార్తలు వాళ్లలో కూడా గుబులు పుట్టిస్తున్నాయి. అంటే గతంలో పార్టీ మారేటప్పడు స్పష్టమైన హామీ ఉన్నా.. మారిన పరిస్థితుల దృష్ట్యా అందరికీ అనుకున్న అన్ని చోట్లా టికెట్లు దక్కవన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.