Home News Politics

వలస నేతలకు వీరతాళ్ళు….మరి మాకేంటి అంటున్న తమ్ముళ్ళు…?

ఎన్నాళ్లు చేయాలి..? ఎన్నేళ్లు చేయాలి..? ఇప్పుడు తెలుగుదేశం వర్గాల్లో ఇదే చర్చ. కొత్తవాళ్లకు పదవులు.. పాతవాళ్లకు ఊరడింపులు.. ఇది టీడీపీలో రోటీన్ అయిపోయిందనే చర్చ జరుగుతోంది… ఒకసారి కాకున్నా.. వేరేసారి వస్తోందనే ఆశలు గతంలో ఉండేవని.. కానీ ఎప్పుడు పదవుల భర్తీ అంశం ఎప్పుడు తెర మీదకు వచ్చినా.. కొత్త వారు రావడం.. వాళ్లు తన్నుకుపోవడమనేది టీడీపీలో రోటీనుగా మారిందంటూ ఆవేదన చెందుతున్నారు పలువురు సైకిల్ పార్టీ సీనియర్ నేతలు…

ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. భారీ ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను అమల్లో పెట్టి.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గతానికంటే ఎక్కువ సీట్లను దక్కించుకుని తన అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఏపీ అధికార పార్టీ.. ఓవైపు ప్రభుత్వం వైపు నుంచి పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాల అమలుకు కావాల్సిన నిధుల సమీకరణకు ప్రయత్నాలు సాగిస్తూనే.. మరోవైపు దాన్నుంచి పొలిటికల్ గా అడ్వాంటేజ్ పొందే ప్రయత్నం చేస్తోంది… ఇది రెగ్యులర్ గా ప్రతి పార్టీలోనూ జరిగే వ్యవహరమే… ఓ విధంగా చూస్తుంటే.. టీడీపీలో ఓ రకంగా పండుగ వాతావరణ కన్పిస్తోందనే చెప్పాలి… ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా వాతావరణాన్ని క్రియేట్ చేయడం ద్వారా ప్రజల నుంచి పాజిటివ్ ఓటు దక్కించుకోవడం టీడీపీ వ్యూహంగా కన్పిస్తోంది.

అయితే ఈ మూడ్ అన్ని స్థాయిల్లో ఉంటోందా..? అంటే అనుమానమే అని చెప్పాలి… దీనికి కారణం లేకపోలేదు… పార్టీలో చాలా కాలంగా ఏదో రకమైన పదవులను దక్కించుకోవాలని కొంత మంది తాపత్రాయపడుతూనే ఉన్నారు. అలాంటి వారికి ఇప్పుడు వస్తోన్న సార్వత్రిక ఎన్నికలు కావచ్చు.. ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు.. ఓ వరంగా కన్పిస్తున్నాయి. ఇంత కాలం పార్టీకి సేవలందించాం కాబట్టి.. ఈసారి ఏదో రకమైన గుర్తింపు ఉంటుందని చాలా మంది నేతలు భావిస్తున్నారు. అయితే పార్టీలో మారుతున్న పరిణామాలు.. చేరికల వ్యవహరం చూస్తుంటే ఆశావహులకు ఈసారి నిరాశే ఎదురయ్యే సూచనలు కన్పిస్తున్నాయి…

మార్చిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. మొత్తం ఐదు స్థానాలను భర్తీ చేయాల్సి ఉండగా.. వాటిల్లో నాలుగు స్థానాలు టీడీపీకి వస్తాయి. ఈ క్రమంలో ఓ స్థానం మంత్రి యనమలకు వెళ్లిపోగా.. మిగిలిన మూడు స్థానాల కోసం పోటీ విపరీతంగానే ఉంది. అయితే పరిస్థితి చూస్తుంటే ఆ సీట్లను పార్టీలోకి కొత్తగా వచ్చేవారు ఎగరేసుకుపోయే సూచనలు కన్పిస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు ఆశావహులు.

కృష్ణా-గుంటూరు జిల్లాలకు సంబంధించి త్వరలోనే బలమైన చేరికలు ఉండబోతున్నాయి. ఇలా పార్టీలో చేరేవారికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. మిగిలిన మూడు ఎమ్మెల్సీ పదవుల్లో రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఇచ్చేస్తే పార్టీలో చాలా కాలంగా ఉంటూ సేవలందిస్తున్న తమ పరిస్థితేంటనే ఆవేదన కొంత మందిలో కన్పిస్తోంది. ముఖ్యంగా ఈ రెండు జిల్లాలకు చెందిన పార్టీ నేతల్లో ఆశావహులు ఉన్నారు. వారిలో ఈ రకమైన నిర్లిప్తిత కన్పిస్తోంది. కృష్ణా జిల్లా విషయానికొచ్చేసరికి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, పంచుమర్తి అనురాధ వంటి వారితోపాటు గుంటూరు జిల్లాకు చెందిన దాసరి రాజా మాష్టార్.. వంటి వారు ఎమ్మెల్సీ టిక్కెట్ల కోసం చాలా కాలం నుంచి వేచి చూస్తోన్న పరిస్థితి. ఇప్పుడు పార్టీలో జరుగుతున్న పరిణామాలతో వీరి ఆశలు గల్లంతైనట్టే కన్పిస్తోంది. ఎమ్మెల్సీ ఆశావహుల విషయం ఇలా ఉంటే.. ఎమ్మెల్యే టిక్కెట్లు దక్కించుకుందామనుకునే వారి పరిస్థితి ఇంచు మించు ఇదే విధంగా కన్పిస్తోంది. మంగళగిరి నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల పార్టీలో చేరారు. ఈ స్థానాన్ని ఆశిస్తున్న గంజి చిరంజీవి ఇతర స్థానిక నేతలు నిరాశలో కన్పిస్తున్నారు.

ఇక తాజాగా రాజంపేట నియోజకవర్గంలో జరిగిన పరిణామాలతో ఆ స్థానంపై ఇంకొందరు నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఈ నియోజకవర్గం ఛాన్స్ దక్కించుకునేందుకు చాలా మంది రేసులో ఉన్నారు. ఇలా రేసులో ఉన్న వారిలో పార్టీకి చాలా కాలంగా సేవలందిస్తున్న జగన్మోహన్ రాజు, పసుపులేటి బ్రహ్మయ్య, వేమన సతీష్ వంటి వారు ఉంటే.. పార్టీలోకి కొత్తగా వచ్చి సడన్‌గా రేసులోకి వచ్చేసిన వారిలో బత్యాల చెంగల్రాయుడు.. రెడ్ బస్ వ్యవస్థాపకుడు చరణ్ రాజ్ వంటి వారు ఉన్నారు. అయితే కొత్తగా వచ్చిన వీరిద్దరికీ.. సామాజిక వర్గమైన అడ్వాంటేజ్ ఒకరికి ఉంటే.. మరొకరికి ఆర్థిక పరమైన అండ ఉన్నట్టు కన్పిస్తోంది. ఈ క్రమంలో వీరిలో ఎవరో ఒకరికి రాజం పేట టిక్కెట్ దక్కే ఛాన్స్ కన్పిస్తోంది. దీంతో చాలా కాలంగా పని చేస్తున్న వారికి అన్యాయం జరిగినట్టే అవుతుందంటున్నారు. ఈ విధంగా ఓవైపు పార్టీలో పండుగ వాతావరణం ఉన్నా.. అది అన్ని స్థాయిలో క్యారీ అవుతుందా..? అనేది మాత్రం అనుమానంగా కన్పిస్తోంది.