Home News Politics

టీడీపీ నుంచి ఈ 75 నియోజకవర్గాల అభ్యర్ధులు ఫైనల్….

SHARE

ముందస్తుగా అభ్యర్ధులను ప్రకటిస్తానన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆ దిశగా కసరత్తు ప్రారంభించేశారు…ఇప్పటికే సుమారు 75 నియోజకవర్గాలకు పైగా అభ్యర్థులను ఖరారు చేసేసినట్టు సమాచారం…దాదాపు నెల రోజుల క్రితం నుంచి అభ్యర్థులతో ఒన్ టు ఒన్ మీటింగులు మొదలు పెట్టిన చంద్రబాబు..ఎన్నికలు హీట్ పెరిగిన క్రమంలో దీన్ని తిరిగి కంటిన్యూ చేస్తున్నారు.

తన ధోరణికి భిన్నంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలకు చాలా ముందుగానే అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తు మొదలుపెట్టడమే కాకుండా.. పోటీ చేసే అభ్యర్థులకు క్లారిటీ ఇచ్చేయడం కొత్త ట్రెండే అంటున్నాయి పార్టీ వర్గాలు… ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న చోట అభ్యర్థులను ఖరారు చేయడం.. సిట్టింగులకు పనితీరు మెరుగుపర్చుకోవడానికి మరికొంత సమయం ఇవ్వడం అనే స్ట్రాటజీతో కసరత్తు ప్రారంభించారు టీడీపీ సుప్రీమో… చివరకు వరకు నాన్చడం.. తుది వరకు టెన్షన్ పెట్టడం.. చివరికి అభ్యర్ధులు పరుగు పరుగున వెళ్లి నామినేషన్ వేయడం.. ఇది టీడీపీకి అలవాటైన వ్యవహరం.

అయితే ప్రస్తుతం టీడీపీలో కొత్త వెర్షన్ నడుస్తోందని.. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా.. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ అభ్యర్థులకు టెన్షన్ ఫ్రీ చేసే దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు వడివడిగా అడుగులేస్తున్నారంటున్నారు… దీనికి అనుగుణంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలను గుర్తు చేస్తున్నారు… గత కొన్నిరోజులుగా చంద్రబాబు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు … అదీ తన సొంత జిల్లా చిత్తూరు నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు … అయితే మధ్యలో దీనికి కొంత గ్యాప్ వచ్చింది… ఇప్పుడు మళ్లీ ఎన్నికలు హీట్ పెరుగుతున్న క్రమంలో తిరిగి అభ్యర్థులు.. పార్టీ నేతలతో చంద్రబాబు ముఖా ముఖి కార్యక్రమాలు మొదలు పెట్టారు. ప్రస్తుతం కృష్ణా, గుంటూరు, కడప, కర్నూలు జిల్లాలకు చెందిన వివిధ నియోజకవర్గాల నేతలతో విడివిడిగా సమావేశం అవుతున్నారు ..

జిల్లాల వారీగా చూస్తే.. చిత్తూరు జిల్లాలో దాదాపు కసరత్తు పూర్తి అయినట్టే కన్పిస్తోంది. పీలేరు, చంద్రగిరి, పుంగనూరు, నగరి, మదనపల్లె, పూతలపట్టు, గంగాధర నెల్లూరు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల కసరత్తు దాదాపు పూర్తి చేశారు బాబు … ఇప్పటికే పీలేరు నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి యాక్టివ్‌గా ఉన్నారు… తన నియోజకవర్గంతోపాటు.. తనకున్న ఇమేజ్.. పరిచయాలతో మిగిలిన నియోజకవర్గాల్లో కూడా పార్టీని గెలిపించే దిశగా బాధ్యతను భుజాన వేసుకున్నారు కిషోర్ కుమార్ రెడ్డి…

చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థిగా చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు పులివర్తి నాని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది … ఈ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఇటీవల వరకు గల్లా అరుణ కుమారి ఉన్నా.. ఆమె స్వచ్చంధంగా తప్పుకోవడంతో పులివర్తి నానికి లైన్ క్లియర్ అయింది… అలాగే పుంగనూరు నియోజకవర్గం నుంచి అనూషారెడ్డి రేసులో ముందు కనిపిస్తున్నారు … దీంతో పాటు నగరి నియోజకవర్గానికి గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుటుంబంలో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా.. సహకరిస్తామనే మాటను చంద్రబాబుకు ఇచ్చారు ఆ కుటుంబ సభ్యులు. ఇక మదనపల్లె సెగ్మెంట్ నుంచి దమ్మాలపాటి రమేష్, రామ్ దాస్ చౌదరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. పూతలపట్టు అభ్యర్థిగా లలితా థామస్ పేరు వినిపిస్తున్నా .. ఆమె చిత్తూరు ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. .. ఇక గంగాధర నెల్లూరు సెగ్మెంటుకు కుతూహలమ్మ తనయుడు హరికృష్ణ అధిష్టానం పరిశీలనలో ఉన్నారు.

శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గానికి అభ్యర్థిగా మాజీ మంత్రి కొండ్రు మురళీ పేరు వినిపిస్తోంది… ఇక ఈ జిల్లాలో సిట్టింగ్ స్థానాల్లో మినహా మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్టే కన్పిస్తోంది… పలాస నియోజకవర్గం నుంచి ఈసారి గౌతు శిరీష పేరు వినిపిస్తున్నా.. చివరి నిమిషంలో తండ్రికైనా టిక్కెట్ కేటాయించే సూచనలు ఉన్నాయని చెబుతున్నారు.

ప్రస్తుతం రోజుకు పది నియోజకవర్గాలకు తగ్గకుండా నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు టిడిపి అధినేత … గత మూడు రోజుల నుంచి కృష్ణా, గుంటూరు, కర్నూలు, కడప జిల్లాలకు చెందిన నేతలతో చంద్రబాబు ముఖా ముఖి సమావేశాలు నిర్వహించారు… దీంట్లో భాగంగానే జమ్మలమడుగు, రాజం పేట పంచాయతీలను ఒక కొలిక్కి తెచ్చారు … రాయచోటి నియోజకవర్గం నుంచి రమేష్ రెడ్డిని బరిలోకి దించడానికి టిడిపి అధిష్టానం మొగ్గుచూపుతోందంట

ఇక రైల్వే కోడూరు నుంచి ఎంపీ శివ ప్రసాద్ అల్లుడు ప్రసాద్ రేసులో ఉన్నా.. మరో మహిళ నేత పేరు కూడా పరిశీలనలో ఉంది .. కడప నియోజకవర్గం నుంచి తాజాగా పార్టీలో చేరిన మాజీ మంత్రి అహ్మదుల్లా తనయుడుకు టిక్కెట్ కేటాయించే విషయమై కసరత్తు జరుగుతోంది… పులివెందుల నుంచి సతీష్‌రెడ్డి మరోసారి పోటీ చేయడం ఖాయమే ..ఇక జిల్లాలో ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు, కమలాపురం వంటి నియోజకవర్గాల అభ్యర్థుల కసరత్తు చేయాల్సి ఉంది.

మొత్తమ్మీద ఇప్పటికే దాదాపు 75 నియోజకవర్గాలకు పైగా అభ్యర్థుల జాబితాను చంద్రబాబు సిద్దం చేసేసుకున్నారని.. అభ్యర్థుల జాబితాను కూడా వీలైనంత త్వరగా విడుదల చేసేందుకే చంద్రబాబు కసరత్తు చేస్తున్నారని అంటున్నారు. ఇక మరో 25 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక చివరి దశలో ఉందని ప్రచారం. అలాగే గతంలో మాదిరి కాకుండా.. ఈసారి అభ్యర్థుల ఖరారుకు సంబంధించి రెండు జాబితాలకు మించి ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నాయి పార్టీ వర్గాలు.