Home News Stories

గూడెంలో భగ్గుమన్న విభేదాలు…అభ్యర్ధి ఎంపికతో అసమ్మతి సెగ…!

SHARE

పశ్చిమగోదావరిజిల్లా రాజకీయం రోజుకొరకంగా మలుపుతిరుగుతుంది. 2014ఎన్నికల్లో వన్ సైడ్ గా జిల్లాని సొంతం చేసుకున్న తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో అసమ్మతి సెగ పొగబెట్టబోతోంది. నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేల తీరుపై గుర్రుగా ఉన్న కార్యకర్తలు, నాయకులు అధినేత చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టినా ఉపయోగంలేకపోవడంతో అసమ్మతిసెగ కాకరేపుతోంది. తాజాగా తాడేపల్లిగూడెం టిక్కెట్ విషయంలో అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయం అసమ్మతిసెగని మరింత రాజేయబోతోంది. గూడెం టిక్కెట్ పై కోటిఆశలు పెట్టుకున్న ముళ్ళపూడి బాపిరాజును కాదని, కాపునేత ఈలినానికి టిక్కెట్ కేటాయించడంపై బాపిరాజు వర్గం జీర్ణించుకోలేకపోతోంది. దీంతో బాపిరాజు రాజకీయాల నుంచి తప్పుకొబోతున్నట్లుగా తెలుస్తోంది.

పశ్చిమగోదావరిజిల్లాలో టిడిపి సీట్ల సర్ధుబాటు విషయం అక్కడి నేతలను అయోమయానికి గురిచేస్తోంది. అవినీతి, అసమ్మతి సెగతో చాలా నియోజకవర్గాలో అభ్యర్ధుల ఎంపిక ఇంకా పెండింగ్ లోనే ఉంది. కార్యకర్తలను స్వప్రయోజనాలకు పెద్దపీఠ వేసిన నేతల విషయంలో అభ్యర్ధుల ఎంపిక ఇంకా పెండింగ్ లోనే ఉంది. నిత్యం కార్యకర్తలతోనే ఉంటూ, పార్టీ క్యాడర్ ను కాపాడుకుంటూ వచ్చిన ఆశావాహులకు సైతం టిక్కెట్ దక్కకపోవడంతో రాజకీయాలనుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నారు అక్కడి నేతలు. అదేకోవలో పశ్చిమగోదావరి జిల్లాపరిషత్ చైర్మెన్ ముళ్లపూడి బాపిరాజు త్వరలో రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. 2009లో తాడేపల్లిగూడెం నుంచి పోటిచేసిన ముళ్ళపూడి 2014లోను సీటు ఆశించారు. అయితే బిజేపి మిత్రపక్షానికి టిక్కెట్ కేటాయించండంతో బాపిరాజు జెడ్పిచైర్మెన్ అయ్యారు. 2019లో మరోసారి టిక్కెట్ ఆశించినా అది దక్కకపోవడంతో రాజకీయాల నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నారు బాపిరాజు.

పశ్చిమగోదావరిజిల్లా రాజకీయాల్లో కీలకనేతగా ఉన్న ముళ్లపూడి బాపిరాజు గోపాలపురం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో మంచి పట్టున్న నేత. వచ్చే ఎన్నికల్లో గూడెం టిక్కెట్ అవకాశం లేదని అధినేత తేల్చి చెప్పడంతో రాజకీయాల నుంచి తప్పుకొబోతున్నారని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం పార్టీలు మారుతూ వచ్చిన ఈలినానికి టిక్కెట్ కేటాయించడమే. 2009లో తాడేపల్లిగూడెం నుంచి టిడిపి టిక్కెట్ కేటాయించినా ప్రజారాజ్యంలో చేరిన ఈలినాని తర్వాత జరిగిన పరిణామాల్లో తిరిగి టిడిపి గూటికి చేరారు. 2009 నుంచి గూడెం కార్యకర్తలు, నాయకులకు అందుబాటులో ఉంటూ వచ్చిన బాపిరాజుకు 2014లోను భంగపాటు తప్పలేదు. బిజేపి మిత్రపక్షంగా గూడెం టిక్కెటును ఎగరేసుకుపోయింది. ఆ ఎన్నికల్లో బిజేపి గెలుపునకు బాపిరాజు గట్టిగానే కృషిచేయడం, తర్వాత బిజేపితో విభేదాలు వచ్చినా క్యాడర్ ను పటిష్టం చేయడంలో బాపిరాజు కృషి ఉంది. ఈధీమాతోనే 2019 ఎన్నికల్లో టిక్కెట్ పై బాపిరాజు ఆశలు పెట్టుకున్నా ఆకల నెరవేరకపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు.

తాడేపల్లిగూడెం టిక్కెట్ విషయంలో బాపిరాజుకు అవకాశం దక్కకపోవడానికి ప్రధాన కారణం కులసమీకరణాలే. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండే తాడేపల్లిగూడెంపై అటు జనసేన, ఇటు బిజేపి, వైసిపి లు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. ఈనేపద్యంలో కాపునేతకే టిక్కెట్ కేటాయించాల్సి రావడంతో బాపిరాజుకు అవకాశం దక్కలేదు. సర్వేలన్ని బాపిరాజుకు అనుకూలంగానే ఉన్నాయంటూ సీఎం చెబుతూనే టిక్కెట్ కేటాయించడం మాత్రం కుదరదని తేల్చేసారు. ఇదే సమయంలో ఈలినాని సైతం బాపిరాజు సహకారం లేకుంటే తనకి టిక్కెట్ ఇచ్చినా ఉపయోగం ఉండదని తేల్చిచెప్పినా ఉపయోగం లేకుండా పోతోంది. అయితే బాపిరాజుకు టిక్కెట్ కేటాయించాలంటూ ఆయన వర్గం గట్టిగానే పట్టుబట్టినా సీఎం మాట కాదనలేక బాపిరాజు ఇపుడు తన అనుచరులు, అభిమానులతో చర్చల్లో మునిగిపోయారు. రాజకీయాల నుంచి తప్పుకొబోతున్నట్లు ఇప్పటికే చాలా మంది అనుచరులకు వివరణ ఇచ్చారు.

జిల్లాలో కీలక నేతగా ఉన్న బాపిరాజు ఎన్నికల సమయంలో పార్టీకి దూరంగా ఉంటే ఎదురయ్యే ఇబ్బందుల గురించి ముందే ఊహించిన అధినేత ఆయనకి ఎమ్మెల్సీ కేటాయిస్తాననే హమీఇచ్చినా దానికి బాపిరాజు అంగీకరించకపోవడం ఇపుడు జిల్లాలో హట్ టాపిక్ అయ్యింది. తాడేపల్లిగూడెం లో మరోసారి టిడిపి జెండా ఎగరేసే విషయంలో అదిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.