Home News Politics

సిక్కోలులో ఎవరి సీన్ ఏంటీ…?

SHARE

శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? జగన్ పార్టీ అసలు సీట్లు గెలుచుకుంటుందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే సిక్కోలు రాజకీయ ముఖచిత్రాన్ని ఒకసారి పరిశీలించాల్సిందే. పదిహేనేళ్ల నాటి సీన్ రిపీట్ అయ్యేలా ఉంది. తెలుగుదేశం పార్టీ గ్రూపు విభేదాలతో సతమతమవుతుంటే… వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ముందుకు సాగుతుండటం గమనార్హం. గత ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. మొత్తం పది అసెంబ్లీ స్థానాలున్న సిక్కోలులో మెజారిటీ సీట్లను గత ఎన్నికల్లో గెలుచుకుంది. కానీ ఈసారి సిక్కోలు ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి…

అయితే ఎర్రన్నాయుడు, తమ్మినేని సీతారాం, ప్రతిభా భారతి వంటి నేతలు గ్రూపులను ప్రోత్సహించి పదిహేనేళ్ల క్రితం పార్టీ పరాజయానికి కారకులయ్యారు. సేమ్ సీన్ ఇప్పుడు టీడీపీలో కన్పిస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో గ్రూపు ల రచ్చ జరుగుతూనే ఉంది. కిమిడి కళావెంకట్రావు, అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ వంటి నేతలతో ఆధిపత్య పోరు మామూలుగా లేదు. ప్రతి నియోజకవర్గంలో మంత్రులు గ్రూపులను ప్రోత్సహించడంతో ఎన్నికల వేళ అవి బయటపడుతున్నాయి. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడికి ప్రచారంలో ఇది అవగతమయింది. నేతల మధ్య సమన్వయం లేదు. రాజీ కుదిర్చేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు. దీంతో రామ్మోహన్ నాయుడు కొందరు మాట వినని నేతలపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు కూడా చెబుతున్నారు.

ఇక గత ఎన్నికల్లో సిక్కోలులో చతికలపడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రమంగా కోలుకుంటోంది. నేతలందరూ కలసికట్టుగా సమిష్టిగా పనిచేయడం ఆ పార్టీకి కలసి వచ్చే అంశంగా చెబుతున్నారు. ధర్మానప్రసాదరావు, తమ్మినేని సీతారాంలు కలసికట్టుగా పనిచేస్తున్నారు. ఐదేళ్లు అధికారానికి దూరంకావడంతో వీరికి అసలు విషయం తెలిసి వచ్చినట్లుంది. టిక్కెట్ల పంచాయతీ కూడా ఇక్కడ పెద్దగా లేదు. అసంతృప్తులు పెద్దగా లేకపోవడంతో సిక్కోలు నేతలందరినీ పిలిచి అధినేత జగన్ క్లాస్ పీకడంతో చేతులు కలిపి జనం ముందుకు వెళుతున్నారు.

ఇటీవలే పార్టీలో చేరిన మాజీ మంత్రి కిల్లి కృపారాణికి జగన్ టిక్కెట్ కేటాయించలేదు. కిల్లి కృపారాణి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో? నన్న అనుమానం వైసీపీ నేతల్లో ఉంది. ప్రధానంగా ధర్మాన ప్రసాదరావు తన టిక్కెట్ కు అడ్డుపడ్డారని కిల్లి వర్గం అనుమానిస్తుంది. అయితే జగన్ వీరితో మాట్లాడటంతో కిల్లి కృపారాణి నేరుగా వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలోకి దిగడం కలసి వచ్చే అంశంగా చెబుతున్నారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో వైసీపీ లో మూడు గ్రూపులుండేవి. అయితే అభ్యర్థి సాయిరాజ్ కు మద్దతుగా రెండు వర్గాల నేతలు లల్లూ, రామారావులు పనిచేస్తుండం ఆశ్చర్యం కల్గిస్తోంది. పలాస, టెక్కలి, నరసన్నపేట, ఆముదాలవలస, పాతపట్నం నియోజకవర్గాల్లో విభేదాలను పక్కనపెట్టి అంతా ఒక్కటవ్వడం వైసీపీకి శుభపరిణామంగా చెబుతున్నారు. మరి చంద్రబాబు ఇక్కడి నేతల మధ్య సమన్వయం కుదురుస్తారో? లేదో? చూడాలి.