Home News Stories

సోషల్ మీడియా వార్ షూరు…!

SHARE

ట్రెండ్ మారింది. ఒకప్పుడు పార్టీ నేత తన ప్రత్యర్థి పై ఆరోపణలు చేస్తే.. తేరుకుని ఇచ్చే వివరణ ప్రజలను చేరేందుకు కనీసం ఒక రోజు పట్టేది. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో క్షణాల్లో కౌంటర్లు సిద్ధమవుతున్నాయి. మోడీ ప్రసంగానికి ఆధారాలు, గణాంకాలతో కాంగ్రెస్‌ కౌంటర్లు ఇస్తుంటే.. రాహుల్‌ వ్యాఖ్యలపై బీజేపీ దాడి చేస్తోంది. ఇదంతా ‘సోషల్‌ మీడియా మైండ్‌ గేమ్‌’! ఇందులో ముందంజలో ఉంటే చాలు.. ఓట్లు ఆటోమేటిక్‌గా రాలతాయని పార్టీలు భావిస్తున్నాయి. దేశంలో సోషల్‌ మీడియా ఖాతాలున్న దాదాపు 25 కోట్ల మంది ఓటర్లను తమవైపు మళ్లించుకుంటే విజయం ఖాయమని అంచనా వేస్తున్నాయి పొలిటికల్ పార్టీలు.

ఈ డిజిటల్ వార్ లో బీజేపీకి ‘నమో’ యాప్‌ అండదండలుండగా.. దానికి దీటుగా కాంగ్రెస్‌ ‘శక్తి’ యాప్‌ను తీసుకొచ్చింది. వామపక్షాలు సహా మిగిలిన పార్టీలూ ఇప్పుడు ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. ఎన్నికల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు ఇప్పుడు అన్ని పార్టీలూ సైబర్‌ యోధులను సిద్ధం చేసుకుంటున్నాయి. అసలు బీజేపీ బలం సోషల్‌ మీడియా అని కాంగ్రెస్‌ గుర్తించింది. దానిని దీటుగా ఎదుర్కొనేందుకు ప్రతి రాష్ట్రంలో డిజిటల్‌ వార్‌రూంలను ఏర్పాటు చేసింది. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో జిల్లాలు, నియోజకవర్గ స్థాయిల్లోనూ వార్‌ రూంలను ఏర్పాటు చేసింది. పార్టీ కమ్యూనికేషన్‌ వింగ్‌ కన్వీనర్‌ ప్రియాంక చతుర్వేది ఈ పనిలోనే నిమగ్నమయ్యారు. పెద్ద ఎత్తున యువ టెకీలు, సాఫ్ట్‌వేర్‌ నిపుణులను రిక్రూట్‌ చేసుకుంటున్నారు. స్థానిక సమస్యలు, రాజకీయ వైఫల్యాలను గుర్తించి వాటిని జాతీయ స్థాయిలో హైలైట్‌ చేయాలన్నది వీరి ప్రయత్నం. ప్రజలతో కనెక్టివిటీ పెంచుకోవడానికి వివిధ మార్గాల్లో వెళుతున్నట్లు అని ప్రియాంక తెలిపారు. సోషల్‌ మీడియా ప్రచారంతోనే ఇటీవలి ఎన్నికల్లో గుజరాత్‌లో బీజేపీని కాంగ్రెస్‌ చాలావరకూ దెబ్బతీసింది. ఇక, 2019 ఎన్నికల కోసం రాహుల్‌ ఓ కార్యాచరణ ప్రణాళిక తయారు చేశారు. దీని పేరు మిషన్‌-2019.

అమిత్‌ షా విజయవంతంగా నడిపిస్తున్న ఓట్‌ క్యాచింగ్‌ సరళిని రాహుల్‌ కొంతవరకూ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. బూత్‌ స్థాయి వరకూ ఓటర్లను వ్యక్తిగతంగా గుర్తించడం, ఏ కులం, ఏ మతం, ఏ ఉద్యోగం, మహిళలు, యువత, బలహీన వర్గాలు తదితర వివరాలన్నీ సమగ్రంగా సేకరిస్తున్నారు. ప్రతి ఓటరు వాట్సాప్‌ నంబరు, మెయిల్‌ ఐడీ, యువత అయితే ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఖాతాలు సేకరిస్తున్నారు. ‘కాంగ్రెస్‌ పనైపోయింది’ అని బీజేపీ ప్రచారం చేస్తుంటే.. ‘బీజేపీ ఇక ఖతం’ అనే ప్రచారాన్ని కాంగ్రెస్‌ అందిపుచ్చుకుంది. ఆ రెండు పార్టీలపైనా బీఎస్పీ, జేడీయూ, ఎస్పీ, కమ్యూనిస్టు పార్టీలు ‘సోషల్‌ వార్‌’ చేస్తున్నాయి. ప్రధానంగా కేంద్రంలోని మోదీ సర్కారును మానసికంగా దెబ్బతీసేందుకు అత్యాచారాలు, హత్యలు, మహిళలపై నేరాలు వంటి అంశాలను విపక్ష పార్టీలు సోషల్‌ మీడియాలో ఆయుధాలుగా మలచుకుంటున్నాయి.

సోషల్‌ మీడియా వేదికగా ఇప్పుడో నయా ట్రెండ్‌ ఆరంభమైంది. గ్రామీణులతో మోదీ వైఫల్యాలను ఎండగట్టించడం.. ఆ వీడియోలను వైరల్‌ చేయడం వంటి చర్యలను కాంగ్రెస్‌ చేపడుతూ బీజేపీని మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. వాటిపై బీజేపీ సైబర్‌ యోధులు వెంటనే కామెంట్లు చేస్తూ.. గణాంకాలను విడుదల చేస్తున్నారు. అటు బీజేపీ మద్దతుదారులు సైతం రాహుల్‌ పార్లమెంట్‌లో నిద్రిస్తున్న చిత్రాలు, కన్ను గీటుతున్న చిత్రాలు, ఆయన ఉపన్యాసాలను సినీ డైలాగులతో పేరడీలుగా మారుస్తూ వైరల్‌ చేస్తున్నారు. ఇలాంటివి కాసేపు సరదాగా అనిపించినా.. ఎన్నికల సమయంలో ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదని మానసిక నిపుణులు చెబుతున్నారు.

ఈసారి అభ్యర్థులు సోషల్‌ మీడియా ఖర్చును సైతం వెల్లడించాల్సిందేనని భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆ మేరకు వివరాలివ్వాలని ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వంటి టెక్‌ దిగ్గజాలను ఆదేశించింది. అయితే.. పార్టీలు దీనికి కూడా ప్రత్యామ్నాయాన్ని ఎంచుకున్నాయి. యాడ్స్‌ ఇతరులతో ఇప్పిస్తున్నాయి. అదీ.. తమ అభ్యర్థులకు అనుకూలంగా కాకుండా.. ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ఉండేలా జాగ్రత్త పడుతున్నాయి. ఇలాంటి యాడ్స్‌ ఎవరిచ్చారు? డబ్బు ఖర్చెంత? ఏ అభ్యర్థి ఖాతాలో ఆ ఖర్చు వేయాలి? అనే ప్రశ్నలకు అటు ఈసీ నుంచి గానీ, ఇటు సామాజిక మాధ్యమాల నుంచి గానీ ఇతమితమైన సమాధానాలు వచ్చే అవకాశాలు అంతంతే అని సైబర్‌ నిపుణులు చెబుతున్నారు.