Home News Politics

స్మృతికి ఎస‌రు పెట్టిన అతి!

ఎంత‌యినా యాక్ట‌ర్‌..ప్ర‌తీదీ ఓవ‌ర్‌..

SHARE

అప్పుడోసారి ఓ షోరూంకి వెళ్లి ట్ర‌య‌ల్ రూంలో కెమెరాలున్నాయ‌ని అర‌చి గోల చేసింది. కేంద్ర‌మంత్రిగా ఉన్న మ‌హిళ‌కే ర‌క్ష‌ణ లేక‌పోతే ఎలాగ‌న్న రేంజ్‌లో చ‌ర్చ జ‌రిగింది. తీరాచూస్తే అలాంటిదేం లేద‌నీ…స్మృతిఇరానీనే ఎక్కువ‌గా ఊహించుకుని అల్ల‌రిచేసింద‌ని తేలిపోయింది. మొద‌ట్లో మాన‌వ‌వ‌న‌రుల‌శాఖ ఇచ్చిన‌ప్పుడు ఏ అర్హ‌త చూసి ఆమెకు అంత కీల‌క బాధ్య‌త‌లిచ్చార‌న్న విమ‌ర్శ‌లొచ్చాయి. వివాదాస్ప‌ద ఉత్త‌ర్వుల‌తో చివ‌రికి ఆ విమ‌ర్శ‌ల‌కు బ‌లం చేకూర్చేలా వ్య‌వ‌హ‌రించారు స్మ‌తి ఇరానీ. త‌ర్వాత ప్రాధాన్యం త‌గ్గించి మ‌రోశాఖ ఇచ్చి…పోయిన్సారి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో మ‌ళ్లీ కీల‌క‌మైన కేంద్ర స‌మాచారశాఖ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే ఆమె వ్య‌వ‌హార‌శైలితో అదికూడా మూణ్ణాళ్ల ముచ్చ‌ట‌గానే మిగిలింది.

బుల్లితెర‌నుంచి వెండితెర స్థాయికి ఎదిగిన స్మృతిఇరానీ అదృష్టం క‌లిసొచ్చి నాయ‌కురాలు అయ్యారు. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా కేంద్ర‌మంత్రి స్థాయికి ఎదిగారు. కాస్త తెలివిగా వ్య‌వ‌హ‌రించి దాన్ని నిల‌బెట్టుకోవాల్సింది పోయి కోరి వివాదాలు కొనితెచ్చుకోవ‌డ‌మే కొంప‌ముంచుతోంది. ఆమె నిర్ణయాలు ప్ర‌తీసారీ వివాదాస్ప‌ద‌మ‌వుతూనే ఉన్నాయి. ఈమ‌ధ్య జాతీయ చలన చిత్ర అవార్డుల ప్ర‌దానోత్స‌వ కార్య‌క్ర‌మంలో ఆమె చేసిన పనికి రాష్ట్రపతి భవన్ ప్రతిష్ట దిగజారింది. 65వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్య‌క్ర‌మానికి 60 మందికి అవార్డు గ్ర‌హీత‌లు హాజ‌రుకాలేదు. కేవలం 11మందికే రాష్ట్ర‌ప‌తి చేతుల‌మీదుగా అవార్డులు ఇస్తామంటూ రాసిన లేఖ‌తో ఈ రాద్ధాంతం జ‌రిగింది. దీనిపై రాష్ట్ర‌ప‌తి కూడా అస‌హ‌నం వ్య‌క్తంచేశారు.

త‌న నిర్ణ‌యంతో రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌ని ఇబ్బందిపెట్టిన స్మృతి ఇరానీని చివ‌రికి కేంద్ర సమాచార ప్రసార శాఖ నుంచి తప్పించారు ప్రధాని . ఇప్పుడే కాదు. గతంలోనూ స్మృతీ ఇరానీ ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. ఆన్‌లైన్‌లో త‌ప్పుడువార్త‌లు రాసేవారి అక్రిడేషన్ల ర‌ద్దుతో పాటు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేసారు. మీడియాని నియంత్రించేందుకు కేంద్రం ప్ర‌య‌త్నిస్తోంద‌ని తీవ్ర నిర‌స‌న వ్య‌క్తంకావ‌టంతో ప్రధాని జోక్యం చేసుకుని ఆదేశాల్ని వెనక్కి తీసుకోవాలని స్మృతీ ఇరానీని ఆదేశించాల్సి వ‌చ్చింది. ఒక‌ప్పుడు వెంక‌య్య‌నాయుడు లాంటి సీనియ‌ర్ నాయ‌కుడు చూసిన శాఖ బాధ్య‌త‌ల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల్సింది పోయి..అత్యుత్సాహంతో అవ‌కాశాన్ని చేజార్చుకున్నారు స్మృతి ఇరానీ. ప్ర‌స్తుతం ఆమె చేతిలో జౌళిశాఖ మాత్రమే మిగిలి ఉంది.