Home News Politics

ఎన్నికల సంఘం సెక్స్‌వర్కరా!?

ఈవీఎంలు బ్రోత్స‌ల్స్‌గా మారిపోయాయా?

స్వ‌తంత్ర వ్య‌వ‌స్థ‌లా ప‌నిచేయాల్సిన ఎన్నిక‌ల క‌మిష‌న్ అధికారంలో ఉన్న‌వారికి కొమ్ముకాస్తోంద‌న్న అప‌నింద‌లు ఎదుర్కుంటోంది. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ని పార‌ద‌ర్శ‌కంగా, స‌జావుగా న‌డిపంచాల్సిన వ్య‌వ‌స్థ ప‌దిమందీ వేలెత్తిచూపిస్తుంటే త‌లొంచుకునే దోషిలా క‌నిపిస్తోంది. ఈ దేశంలో ద‌శాబ్ధాలుగా ఎన్నిక‌ల‌ను నిర్వ‌హిస్తున్న ఈసీపై ఈ స్థాయిలో అప‌నింద‌లు ఎప్పుడూ లేవు. ఆరోప‌ణ‌లు చేసేవారు ఎప్పుడూ ఉంటారు. అయితే అనుమానాలు నివృత్తి చేయ‌లేక‌…ప‌దేప‌దే అవే త‌ప్పులు జ‌రుగుతున్నా స‌రిదిద్ద‌లేక‌పోవ‌డ‌మే ఈ ప‌రిస్థితికి కార‌ణ‌మ‌వుతోంది.

పులిలా గాండ్రించే శివ‌సేన ఎవ‌రిమీద‌యినా మాట‌ల పంజా విసురుతుంది. పీక‌కొరికి చంపేస్తాన‌న్నంత ఉగ్ర‌రూపాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంటుంది. బీజేపీతో బంధం చెడిపోయాక కేంద్ర విధానాల్ని, ఆ పార్టీ సిద్ధాంతాల్ని విమ‌ర్శించ‌డం వేరు. కానీ ఎన్నిక‌ల సంఘాన్ని టార్గెట్ చేసుకుని తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తోంది శివ‌సేన‌. గ‌తంలో ఎవ‌రూ చేయ‌ని, భ‌విష్య‌త్తులో ఎవ‌రూ చేయ‌ల‌ని స్థాయిలో దారుణాతిదారుణంగా నిందిస్తోంది. ఎన్నిక‌ల‌సంఘాన్ని సెక్స్ వ‌ర్క‌ర్‌తో పోల్చింది శివ‌సేన‌. ఎన్నో అనుమానాల‌కు తావిస్తున్న ఈవీఎంలు బ్రోత‌ల్స్‌గా మారిపోయాయంటోంది.

ఓ పార్టీ ఇంత తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు చేస్తున్నా త‌న పాతివ్ర‌త్యాన్ని నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేయ‌లేక‌పోతోంది ఎన్నిక‌ల క‌మిష‌న్‌. శివ‌స‌ననే కాదు…ఇంతకుముందు ఈ దేశంలో ఎన్నో పార్టీలు ఈవీఎంల‌పై అనుమానాన్ని వ్య‌క్తంచేశాయి. రాహుల్‌గాంధీ, మాయావ‌తి, అఖిలేష్‌యాద‌వ్‌, కేజ్రీవాల్‌, మ‌మ‌తాబెన‌ర్జీ వంటి నాయ‌కులెంద‌రో ఈవీఎంల మాటున మాయా జ‌రుగుతోంద‌ని అనుమానం వ్య‌క్తంచేశారు. తాజాగా జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లోనూ ప‌దుల‌సంఖ్య‌లో పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొండికేయ‌డాన్ని కూడా ప్ర‌తిప‌క్షాలు కుట్ర కోణంలోనే చూస్తున్నాయి.

ఏ రంగంలోనైనా సాంకేతిక ప‌రిజ్ఙానాన్ని అందిపుచ్చుకోవాల్సిందే. వాట్సాప్‌లు వ‌దిలేసి మ‌ళ్లీ ఇన్‌ల్యాండ్ లెట‌ర్లో, పోస్ట్‌కార్డులో ఎలా రాసుకుంటూ కూర్చోలేమో…ఎన్నిక‌ల్లోనూ బ్యాలెట్ ప‌త్రాల్ని న‌మ్ముకోలేం. అయితే ఈవీఎంల‌ని మేనేజ్ చేస్తున్నార‌నే అనుమానాలు నూటికి నూరుశాతం అబ‌ద్ధ‌మ‌నే విష‌యాన్ని ఎన్నిక‌ల‌సంఘం సాధికారికంగా రుజువు చేయ‌లేక‌పోతోంది. ఓ రాజ‌కీయ‌పార్టీలా ఆరోప‌ణ‌ల్ని కొట్టిపారేస్తే స‌రిపోదు. ఈ దేశంలో ప్ర‌తీ రాజ‌కీయ‌పార్టీలో ఈవీఎంల‌పై న‌మ్మకం క‌లిగించాల్సిన బాధ్య‌త‌, అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్య‌త ఈసీదే. ఆ విష‌యంలో ఈసీ విఫ‌ల‌మైతే ఈ దేశంలో ఎన్నిక‌ల వ్య‌వ‌స్థే అప‌హాస్యం పాల‌య్యే ప్ర‌మాదం ఉంది.