Home News

జైపాల్ రెడ్డి ఇక లేరు…!

SHARE

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మృతి చెందారు. నిమోనియా వ్యాధితో బాధపడుతున్న జైపాల్ రెడ్డి కొద్దిరోజులుగా గచ్చిబౌలిలోని ఏషియన్‌ గ్యాస్‌ ఎంట్రాలజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. జైపాల్ రెడ్డి వయసు 77 సంవత్సరాలు కాగా ఆయన మహబూబ్ నగర్ జిల్లా మాడుగులలో జైపాల్ రెడ్డి 1942 జనవరి 16వ తేదీన జన్మించారు. జైపాల్ రెడ్డి అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం 2గంటలకు నెక్లెస్ రోడ్డులో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. రేపు ఉదయం 11గంటలకు కార్యకర్తల సందర్శనార్థం జైపాల్ రెడ్డి భౌతిక కాయాన్ని గాంధీ భవన్ లో ఉంచుతారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలోనూ జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. జైపాల్ రాజకీయ జీవితంలో అనేక ఎత్తుపల్లాలు చూశారు. కాంగ్రెస్ ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ ఆపార్టీకి రాజీనామా చేసి జనతాపార్టీలో చేరారు. 1985 నుంచి 88 వరకు జనతాపార్టీలో ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
1969లో తొలిసారి మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టిన జైపాల్‌రెడ్డి .. నాలుగు సార్లు అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించారు. 1984లో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 1999, 2004లో మిర్యాలగూడ నుంచి ఎంపీగా గెలుపొందారు. 1990, 1996లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. జూన్‌ 1991 నుంచి 1992 వరకు రాజ్యసభాపక్ష నేతగా వ్యవహరించారు.

ఐకే గుజ్రాల్‌ కేబినెట్‌లో కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. మన్మోహన్‌సింగ్‌ హయాంలో పెట్రోలియం, పట్టణాభివృద్ధి, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు. 1998లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పురస్కారం అందుకున్నారు. దక్షిణాది నుంచి తొలిసారి ఉత్తమ పార్లమెంటేరియన్‌ పురస్కారం అందుకున్న నేతగా జైపాల్‌రెడ్డి గుర్తింపు పొందారు.