Home News Politics

సేన సరే.. సారథ్యమేదీ!?

SHARE

పార్టీకి అభిమానులు ఉన్నారు కాని సరైన నాయకత్వం లేదు. అన్ని వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తారు కాని వారిని ఆకట్టుకునే ఆచరణలో మాత్రం ఆమడ దూరంలో ఉంటారు. కొత్త జెండా,ఎజెండాతో ఎన్నికల బరిలోకి దిగుతున్న జనసేనాని జిల్లాలో నాయకత్వలోపం పై మాత్రం ఇప్పటికి దృష్టిపెట్టడం లేదు. పవన్‌ సొంత జిల్లాగా భావించే నెల్లూరులో ఇప్పటి వరకు పార్టీ నిర్మాణం జరగలేదు. యువకులు, విద్యావంతులు, మహిళలు, బడుగు, బలహీన వర్గాలతో పార్టీ నిర్మాణం జరగాలన్నది పవన్‌ లక్ష్యం. అయితే ఆ దిశగా ఇప్పటి వరకు తొలి అడుగు కూడా పడలేదు. ప్రధాన పార్టీల్లో టిక్కెట్లు ఆశించి అవి దక్కని నాయకులతో జనసేన నిండే సూచనలు కనిపిస్తున్నాయి తప్ప కొత్త నాయకత్వం జాడలు కనిపించడం లేదు.

జనసేనని పవన్ కల్యాణ్ విషయంలో నెల్లూరు జిల్లా ప్రత్యేకమైనది. ఒక మాటలో చెప్పాలంటే ఆయనకు సొంత జిల్లాతో సమానం. ఆయన కుటుంబ సభ్యులు నెల్లూరులో కొన్నేళ్లపాటు ఉండటంతో పవన్‌ హైస్కూలు విద్య ఇక్కడే కొనసాగింది. నెల్లూరు వ్యక్తులు, పరిస్థితులు పవన్‌ కళ్యాణ్‌కు బాగా పరిచయం. పైగా నెల్లూరు ప్రజలకు మెగా కుటుంబం అంటే ప్రత్యేక అభిమానం ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయంగా పవన్‌ కల్యాణ్‌ జిల్లాలో ఏ మేరకు ఫలితాలు సాధించగలుతారు అనే అంశం ఆసక్తికరంగా మారింది.

జిల్లాలో మెగా కుటుంబ అభిమానుల సంఖ్య గణనీయంగానే ఉంది. పవన్‌ కల్యాణ్‌ సామాజికవర్గం కూడా బలంగానే ఉంది. చిరంజీవి సేవా కార్యక్రమాలైన రక్తదానం, నేత్రదానం తదితర సేవా కార్యక్రమాల్లో అభిమానులు రాష్ట్రంలోని ఇతర జిల్లాల కన్నా ముందు వరుసలో నిలిచారు. మెగా కుటుంబ సభ్యుల సినిమాలను బాగా ఆదరిస్తున్నారు. ఇక సామాజికవర్గం విషయానికి వస్తే పలు నియోజకవర్గాల్లో చిరంజీవి సామాజికవర్గం బలంగా ఉంది. 2014 ఎన్నికల్లో ఒక్క ఆత్మకూరు మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కనిష్టంగా 11వేల నుంచి గరిష్ఠంగా 43వేల ఓట్ల వరకు వచ్చాయి. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి గెలవగా, రూరల్‌ నియోజకవర్గంలో అత్యల్ప ఓట్లతో గెలుపు చేజారిపోయింది.

అయితే ఆ పరిస్థితులు ఇప్పుడు కనిపించడం లేదు. సినిమాల పరంగా అభిమానం చెక్కు చెదరలేదు కానీ రాజకీయంగా మాత్రం మెగా కుటుంబాన్ని విశ్వసించాలంటే సంశయించే పరిస్థితి వచ్చింది. 2014 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ వైపు నిలిచిన పాపానికి ఒక వర్గం రాజకీయంగా దారుణంగా నష్టపోయింది. ప్రధాన పార్టీల్లో విశ్వసనీయత కోల్పోయింది. దీంతో సుమారు కొన్నేళ్ల పాటు ఈ సామాజికవర్గం రాజకీయ అనాధలుగా మారిపోయారు. రాష్ట్ర విభజన అంటూ జరగకపోయి ఉంటే ఈ వర్గం శాశ్వతంగా గుర్తింపు కోల్పోయే పరిస్థితి. విభజనతో రాష్ట్రం చిన్నది కావడం, సంఖ్య పరంగా ఈ వర్గం బలమైనది కావడంతో ప్రధాన పార్టీలు అనివార్యంగా వీరిని స్వీకరించాయి. గతంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా మరోసారి మెగా కుటుంబ నాయకత్వాన్ని నమ్మి కొత్త జెండా పట్టుకోవాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.


పార్టీ కన్వీనర్‌ మాదాసు గంగాధరం సీనియర్‌ నాయకుడు కావడం, జిల్లా రాజకీయాలపై సమగ్ర అవగాహన కలిగి ఉండటం ప్లస్‌ పాయింట్లే అయినా ఇప్పటివరకు పార్టీ నిర్మాణమే జరగకపోవడంతో జనసేన ఉనికి కనిపించడం లేదు. జిల్లాకు చెందిన ముఖ్య నాయకులను ఆకర్షించే ప్రయత్నాలు మొదలు కాలేదు. 2014 ఎన్నికల తరహాలో సామాజికవర్గం ఏక పక్షంగా నిలబడుతుందన్న గ్యారెంటీ లేదు. కాపు సామాజికవర్గం ప్రతినిధిగా మంత్రి నారాయణ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే ఆ వర్గానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. పట్టణాల నుంచి పల్లెల వరకు ఈ వర్గానికి చెందిన ప్రజలు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీల్లో కొనసాగుతున్నారు. పార్టీల విషయంలో అభిమానులు మనసు మార్చుకున్నంత సులభంగా ఇతరులు మార్చుకోరు.

ఇన్ని ప్రతికూల పరిస్థితుల నడుమ నెల్లూరులో పర్యటించి రొట్టెల పండుగలో గెలుపు రొట్టే స్వీకరించిన పవన్ పార్టీనికూడా గాడిలో పెడితే బెటర్ అన్న అభిప్రాయం వినిపిస్తుంది. పర్యటన ఓకే కాని దాని ప్రతిఫలం దక్కాలంటున్నారు అభిమానులు.