Home News Politics

సికింద్రాబాద్ లో సంకుల సమరం…?

SHARE

సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఆసక్తికరమైన పోటీ నెలకొంది. మూడు ప్రధాన పార్టీలూ బరిలో వున్నాయి. ప్రస్తుతం బీజేపీ ఖాతాలో ఉన్న ఈ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు టీఆర్‌ఎస్‌ పక్కా వ్యూహంతో వెళుతోంది. గతంలో రెండుసార్లు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్‌ అభ్యర్ధి ఎం.అంజన్‌కుమార్‌ యాదవ్‌ కూడా గట్టి ప్రయత్నాల్లోనే వున్నారు. బీజేపీ సిటింగ్‌ ఎంపీ బండారు దత్తాత్రేయను కాదని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డిని రంగంలోకి దింపింది. దీంతో ఇక్కడ త్రిముఖ పోటీ ఏర్పడింది. సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ఖాతాలో ఉండగా, నాంపల్లి నుంచి టీఆర్‌ఎస్‌ మిత్రపక్షం ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తోంది. సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో 19,54,813 ఓటర్లు ఉన్నారు. మైనారిటీలు, బీసీలు అధిక సంఖ్యలో ఉండడంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఎవరికి వారు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.

టీఆర్‌ఎస్‌ ఇప్పటి వరకూ సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని చేజిక్కించుకోలేదు. తొలిసారి ఈ సీటును తమ ఖాతాలో వేసుకునేందుకు పావులు కదుపుతోంది. దీని పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో తమ పార్టీ ఎమ్మెల్యేలే ఉండడం కలిసి వస్తుందని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండడం సానుకూలాంశంగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు విజయానికి దోహదపడతాయని టీఆర్‌ఎస్‌ నాయకులు అంటున్నారు. ఈ స్థానం నుంచి మొదటిసారి పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తలసాని సాయికిరణ్‌ యాదవ్‌ తన గెలుపుపై ధీమాతో ఉన్నారు.

ఆయన తండ్రి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నీ తానై కుమారుడిని గెలిపించుకునేందుకు కృషి చేస్తున్నారు. టికెట్‌ ఖరారు చేయించేందుకు కూడా తీవ్రంగా ప్రయత్నించారు. తమ కుమారుడికి టికెట్‌ ఇస్తే గెలిపించి తీరతానని కేసీఆర్‌కు ఆయన హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఒకవైపు టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ ఎమ్మెల్యేలతో ఆయన మంతనాలు జరిపారు. వారి నుంచి కలిసికట్టుగా తన కొడుకు విజయం కోసం పని చేస్తామన్న హామీ తీసుకున్నారు.

రెండుసార్లు ఎంపీగా గెలిచిన అనుభవం, తనకున్న పరిచయాలు ఈసారి తన విజయానికి దోహదపడతాయని కాంగ్రెస్‌ అభ్యర్ధి ఎం.అంజన్‌కుమార్‌ యాదవ్‌ భావిస్తున్నారు. సెంటిమెంట్‌ను నమ్ముకున్న ఆయన ఇప్పటికే నియోజక వర్గంలో కలియతిరుగుతున్నారు. గతంలో రెండు సార్లు ఇక్కడి నుంచి విజయం సాధించారు అంజన్ కుమార్ యాదవ్. తెలంగాణ ఇచ్చిన సోనియాకు సికింద్రాబాద్‌ సీటును కానుకగా ఇవ్వాలన్న నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు.

బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే జి.కిషన్‌ రెడ్డి పోటీ చేస్తుండడంతో నియోజకవర్గంలోని బీజేపీ వర్గాల్లో కొత్త సమీకరణాలు ప్రారంభమయ్యాయి. అందరినీ కలుపుకుపోయే వ్యక్తిగా కిషన్‌ రెడ్డికి పేరుంది. డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ చేదు అనుభవాన్ని అధిగమించాలన్న కసితో ఆయన ఉన్నట్టు చెబుతున్నారు. బీజేపీ సంప్రదాయ ఓటర్లతో పాటు మోదీ చరిష్మా తమకు లాభిస్తుందని బీజేపీ వర్గాలు ఆశిస్తున్నాయి.