Home News Politics

టీడీపీ కంచుకోటలో గులాబీ గుబాలిస్తుందా…?

SHARE

ఇప్పటికే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేత ఓ వైపు…..హ్యాట్రిక్ దక్కకుండా విజయం దూరం చెయ్యాలనే కసితో చేతులు కలిపిన నేతలు ఒకవైపు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అందించిన సత్తుపల్లిలో తాజా పరిస్థితి ఇది. సత్తుపల్లి ఓటరు ఎటు చూస్తున్నాడు….రెండు పక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఈ స్థానం లో ఫలితాలు ఏంటి. ప్రభావితం చేసే అంశాలు ఏంటి…తెలంగాణ,ఆంధ్ర ప్రజల మేలు కలయికలో ఉన్న సత్తుపల్లిల్లో ఎన్నికల వేళ రాజకీయ ముఖచిత్రం ఎలా ఉంది తెలుగుపాపులర్ టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్…


ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజవకర్గాల్లో సత్తుపల్లి ఒకటి. 30 ఏళ్లుగా ఓటర్ల తీర్పుని పరిశీలిస్తే సత్తుపల్లి టిడిపి కంచుకోట అన్న విషయం అర్థం చేసుకోవడానికి పెద్దగా విశ్లేషణలు అవసరం లేదు. తెలుగు దేశం ఆవిర్భావం తరువాత 8 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మూడు సార్లు కాంగ్రెస్ గెలిస్తే, 5 సార్లు టిడిపి విజయం సాధించింది. ఇదే ప్రాంతానికి చెందిన జలగం వెంగళరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా పని చేశారు. 1973 నుంచి 1978 వరకు వెంగళరావు ఎపి ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన తరువాత కుమారులు ఆయన రాజకీయ వారసత్వం కొనసాగిస్తున్నారు.

సత్తుపల్లి అసెంబ్లీలో సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, వేంసూరు మండలాలు ఉన్నాయి. ఇక్కడ కొత్త ఓటర్ లిస్ట్ ప్రకారం 2 లక్షల 10 వేల 389 మంది ఓటర్లు ఉన్నారు. పూర్తిగా వ్యవసాయాధారిత ప్రాంతంగా ఉన్న ఈ నియోజవర్గంలో ఓపెన్ కాస్ట్ గనులు కూడా ఉన్నాయి. 1985లో తొలి సారి సత్తుపల్లి నుంచి తెలుగు దేశం అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరావు గెలిచారు. తరువాత 1994,1999 ఎన్నికల్లో గెలిచిన తుమ్మల చంద్రబాబు క్యాబినెట్ లో కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. 1989లో జలగం ప్రసాదరావు రావుచేతిలో ఓడిన తుమ్మల…మళ్లీ 2004లో జలగం కుటుంబానికే చెందిన జలగం వెంకట్రావు చేతిలో ఓటమి పాలయ్యారు.


2009కి ముందు వరకూ జనరల్ స్థానంగా ఉన్న సత్తుపల్లి ఎస్సీ రిజర్వ్‌డ్‌గా మారింది. దీంతో ఈ స్థానంలో టిడిపి అభ్యర్థిగా సండ్ర వెంకట వీరయ్య టిడిపి నుంచి పోటీ చేసి గెలిచారు. 1994లో పాలేరు అసెంబ్లీ స్థానంలో సిపిఎం అభ్యర్థిగా గెలిచి శాసన సభకు వెళ్లిన సండ్ర….తుమ్మల ఆశీస్సులతో రిజర్వ్‌ స్థానంగా మారిన మారిన సత్తుపల్లికి షిప్ట్ అయ్యారు. 1999, 2014 ఎన్నికల్లో కూడా టిడిపి అభ్యర్థిగా గెలిచిన సండ్ర….తనతో గెలిచిన వారంతా పార్టీ మారినా…ఆయన మాత్రం టీడీపీని వీడలేదు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా టిడిపి నుంచి పోటీ చేస్తూ సత్తుపల్లిలో హ్యాట్రిక్ కోట్టాలని గట్టి ప్రయత్నాల్లో ఉన్నారాయన.


2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పిడమర్తి రవి ఈసారి కూడా కారుపార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. 2014లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే.. ప్రస్తుతం సత్తుపల్లిలో రాజకీయం పూర్తిగా మారిపోయింది. ఎన్నికల ఫలితం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో సండ్ర కేవలం 2485 ఓట్లతో గెలిచారు. రెండో స్థానంలో వైసిపి నిలవగా…. అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కలేదు. వైసీపీ అభ్యర్థిగా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లిలో పోటీ చేసిన మట్టా దయానంద్ 73 వేల ఓట్లు తెచ్చుకున్నారు. విజయానికి కేవలం 2500 ఓట్ల దూరంలో ఆగిపోయారు. సండ్రకు కు 75490 ఓట్లు రాగా మట్టా దయానంద్ కు 73, 005 ఓట్లు వచ్చాయి. దీంతో స్వల్ప మెజరిటీతో సండ్ర గెలిచి అసెంబ్లీకి వెళ్లారు. అయితే ఈ స్థానంలో టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పిడమర్తి రవి కేవలం 6వేల666 ఓట్లుమాత్రమే సాధించారు. అయితే ఈ సారి ఎన్నికల్లో కూడా పిడమర్తి రవి మళ్లీ పోటీ చేస్తున్నారు.


గత ఎన్నికల్లో గెలుపు గుమ్మం వరకు వెళ్లిన మట్టా దయానంద్ టిఆర్ఎస్ లో చేరారు. సత్తుపల్లిలో గట్టి బలం ఉన్న తుమ్మల కూడా ప్రభుత్వంలో భాగస్వామి కావడంతో ఇక్కడ పరిస్థితులు మారాయి. స్థానికంగా బలమున్న మువ్వా విజయ బాబు అధికార పార్టీలోనే ఉన్నారు. వీరికి తోడు జలగం కుటుంబానికి చెందిన జలగం ప్రసాద రావు కూడా కొద్దిరోజుల క్రితం టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఖమ్మం ఎంపి గా గెలిచిన శ్రీనివాస్ రెడ్డి కూడా ఇప్పుడు గులాబీ పార్టీలో ఉన్నారు. దీంతో కేవలం 6వేల ఓట్లు మాత్రమే సాధించిన పిడమర్తి రవి ఇప్పుడు అనూహ్య ఫలితం అందుకుంటారని ఆ పార్టీ నేతలు లెక్కలు వేస్తున్నారు.

టిడిపి అధిష్టానానికి దగ్గరగా ఉండే సండ్ర….రెండు సార్లు టిటిడి బోర్డ్ మెంబర్ గా అవకాశం దక్కించుకున్నారు. నియోజవకర్గంలో అందరికీ అందుబాటులో ఉండే నేతగా కూడా సండ్రకు పేరుంది. తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అభివృద్ది చేశానని సండ్ర చెపుతుండగా…..అధికారం లోకి వచ్చే టిఆఎస్ ను గెలిపిస్తే నియోజవకర్గ తిరుగు లేని అభివృద్ది చేస్తామని చెపుతున్నారు టిఆర్ఎస్ నేతలు……

ఆంధ్ర ప్రాంత ప్రభావం కనిపించే సీటులో పాగా వెయ్యాలని టిడిపి గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అయితే అరుగురు నేతలను రంగంలోకి దించిన టిఆర్ఎస్ ఈ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ పార్టీనుంచి జలగం ప్రసాదరావును టీఆర్ఎస్‌లోకి తీసుకురావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన వల్ల టిఆర్ఎస్ కు మేలు జరగకపోగా….కొన్ని వర్గాలు దూరం అయ్యే అవకాశం ఉందనే చర్చ కూడా ఉంది. అయితే జిల్లాకు చెందిన ముఖ్యనేతలు అంతా ఇక్కడ దృష్టిపెట్టడంతో ఈ సారి సత్తుపల్లి ఫలితం ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి ఏర్పడింది.