Home News Stories

సంగారెడ్డిలో జగ్గారెడ్డి నెగ్గేనా….త్రిముఖ పోటీలో గెలుపెవరిది…?

SHARE

గ్రేటర్ కు కూత వేటు దూరంలో ఉన్న నియోజకవర్గంలో రాజకీయం నివురుగప్పిన నిప్పులా ఉంది. పారిశ్రామికవాడలు, విద్యా, వైద్య సంస్థలు ఉన్నా ఈ సెగ్మెంట్‌లో సత్తా చాటాలని మూడు ప్రధాన పార్టీలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు జరిగిన పరిణామాలతో.. సంగారెడ్డిలో ఏం జరగనుందనే దానిపై ఉత్కంఠ రేగింది. కాంగ్రెస్- టీఆర్ఎస్- బీజేపీ మధ్య గేమ్‌లో పై చేయి ఎవరు సాధిస్తారనేది ఆసక్తికరం. ఏ పార్టీలో ఉన్నా అందరి దృష్టిని ఆకర్షించే నేతగా గుర్తింపు పొందిన జగ్గారెడ్డి భవిష్యత్ ఏం కానుంది? సమగారెడ్డి రాజకీయ ముఖచిత్రం పై తెలుగుపాపులర్ టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్.

సంగారెడ్డి జిల్లా, మెదక్‌ లోక్‌సభ పరిధిలోకి వస్తుంది సంగారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్‌. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన తర్వాత సంగారెడ్డి నియోజకవర్గం పరిధి కుంచించుకు పోయింది. ప్రస్తుతం నియోజకవర్గం పరిధిలో సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలతో పాటు సంగారెడ్డి, కంది, కొండాపూర్, సదాశివపేట మండలాలు ఉన్నాయి. 1962 ఎన్నికల నుంచి కాంగ్రెస్‌ పార్టీ కంచుకోటగా ఉన్న సంగారెడ్డి నియోజకవర్గంలో 1994 ఎన్నికల తర్వాత రాజకీయ పరిస్థితులు శరవేగంగా మారాయి. నియోజకవర్గ చరిత్రలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రామచంద్రారెడ్డి అత్యధికంగా ఐదు సార్లు గెలిచి రికార్డు సృష్టించారు. మంత్రిగా, శాసనసభ స్పీకర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారాయన. పి.రామచంద్రారెడ్డి మినహా సుదీర్ఘ కాలం పాటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మరో నేత ఎవరూ లేకపోవడం ఆసక్తికరం. మూడు సార్లు స్వతంత్రులకు నియోజకవర్గ ఓటర్లు పట్టం కట్టడం మరో విశేషం. నియోజకవర్గంలో పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో కార్మికుల ఓట్‌ బ్యాంక్‌ను నమ్ముకుని ప్రచారం చేస్తున్నారు బీఎల్‌ఎఫ్‌ నుంచి బరిలో ఉన్న సీపీఎమ్‌ నేత మల్లేశం. తనదైన శైలిలో ఇంటింటికి ప్రచారం చేస్తున్నారాయన.

సంగారెడ్డి నియోజవకర్గంలో విద్యా, పారిశ్రామిక రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. మంజీర పరివాహక ప్రాంతం సంగారెడ్డి పరిసరాల్లో ఉన్న ఎద్దుమైలారం ఆయుధ కర్మాగారం వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. ఐఐటీ హైదరాబాద్‌తో పాటు అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాయి. నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లు..3 లక్షల 94 వేల 376 కాగా, వీరిలో మహిళా ఓటర్ల సంఖ్య లక్షా 97వేల 92. పురుషుల ఓటర్లు ఇతరులు లక్షా 97వేల 248. ఇతరులు 36 మంది ఇక్కడ ఉన్నారు. నియోజకవర్గంలో పలు సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇంత వరకు ఒక్క డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు పూర్తిగా నిర్మాణానికి నోచుకోలేదు. సంగారెడ్డి పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందనేది స్థానికుల ప్రధాన ఆరోపణ.

ప్రస్తుతం కాంగ్రెస్ తరపున రంగంలో దిగిన జగ్గారెడ్డి రాజకీయ జీవితం బీజేపీ నుంచి ప్రారంభమయ్యింది. మున్సిపాలిటీ కౌన్సిలర్‌గా, ఛైర్మన్‌గా పని చేశారు. తర్వాత 2004లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా బరిలో నిలబడి గెలిచారు. తర్వాతి ఎన్నికలకు కండువా మారింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ బీ ఫారమ్‌ పై పోటీ చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. 2012 నుంచి 2014 మధ్య ప్రభుత్వ విప్‌గా ఉన్న ఆయన 2014 ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. ఆ తర్వాత మరో కొత్త రంగు వెతుక్కున్నారు. మెదక్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కమలం కండువా కప్పుకుని బ్యాల్‌ట్‌ పోరుకు సిద్ధపడ్డారు. కాని మూడో స్థానానికే పరిమితమయ్యారు. అక్కడ కూడా జగ్గారెడ్డి కాలు ఆగలేదు. ఓటమి తర్వాత మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరారు.

బరిలో ఉన్న మిగిలిన అభ్యర్ధులు తక్కువ తినలేదు. టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి చింతా ప్రభాకర్‌ 2009లో సైకిల్‌ పై సవారీ చేశారు. అప్పుడు జగ్గారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. గత ఎన్నికలు వచ్చే సరికి సైకిల్‌ వదిలి కారు ఎక్కి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. జగ్గారెడ్డికి ఓటమి బాకీ తీర్చేశారు. గత ఎన్నికల్లోల టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి చింతా ప్రభాకర్‌ కాంగ్రెస్‌ నేత జగ్గా రెడ్డి పై సుమారు 30వేల మెజార్టీతో జయకేతనం ఎగరేశారు. ఇక ప్రస్తుత బీజేపీ అభ్యర్ధి రాజేశ్వర రావు దేశ్‌ పాండే నిన్నటి వరకు గులాబీ గూటిలో ఉన్న నేతే. టికెట్‌ లభించకపోవటంతో ఆలస్యం చేయకుండా కాషాయం తీర్ధం పుచ్చుకున్నారు. పార్టీ మారిన ప్రభావం ఉండదని, కేంద్ర ప్రభుత్వ పథకాలు తన విజయానికి బాట వేస్తాయని అన్నారు దేశ్‌పాండే.

ఈ ఎన్నికల్లో అభ్యర్ధుల ప్రచారాస్త్రాల్లో పార్టీల మ్యానిఫెస్టోలతో పాటు కేసుల వ్యవహారం ప్రధానంగా చోటు సంపాదించుకుంటోంది. 25 ఏళ్ల క్రితం జగ్గారెడ్డి మానవ అక్రమ రవాణా చేశారు అనేది ప్రధాన ఆరోపణ. హఠాత్తుగా రెండు నెలల క్రితం ఈ కేసును తిరగదోడింది రాష్ట్ర ప్రభుత్వం. జగ్గారెడ్డి నేతృత్వంలో సంగారెడ్డిలో మైనార్టీలతో ప్రత్యేక బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీ జాతీయ నాయకులను ఆహ్వానించిన తరుణంలో జరిగిన అరెస్ట్‌ స్థానికంగా సంచలనం రేపింది. రాజకీయ క్రీడకు బీజం వేసింది. దీనితో కాంగ్రెస్‌ నేతలు కౌంటర్‌ అటాక్‌కు దిగారు. ఈ ఆరోపణలు ఎదుర్కొన్న సమయానికి జగ్గారెడ్డి వాస్తవంగా టీఆర్‌ఎస్ నేతగా ఉన్నారు. అప్పట్లో ఇదే కేసులో కేసీఆర్‌, హరీశ్‌ రావు, ఇతర టీఆర్‌ఎస్‌ నేతల ప్రమేయం ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. మిగతా వారిని వదిలేసి జగ్గారెడ్డిని మాత్రమే అరెస్ట్‌ చేయడం రాజకీయ కుట్రగా విమర్శలు ఎక్కు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల ప్రచారంలో ఈ అంశం జగ్గారెడ్డి ప్రత్యర్థులకు ప్రధాన అస్త్రంగా మారింది. ప్రస్తుతం బెయిల్ పై బయటకు వచ్చిన జగ్గారెడ్డిని పోలీసులు ఎప్పుడైనా మళ్లీ అరెస్ట్‌ చేయవచ్చని…కాబట్ట్టి అతని ఓటు వేయటం వృధా అని ప్రత్యర్ధులు ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి.

తనను రాజకీయంగా ఎదుర్కోలేక టీఆర్‌ఎస్‌ ఇటువంటి కుట్రలు పన్నుతోందని జగ్గారెడ్డి సభల్లో పదే పదే ప్రస్తావిస్తున్నారు. అటు ప్రజలు మాత్రం ఇద్దరు ప్రత్యర్ధుల మధ్య పోటీ గట్టిగా ఉందని తేల్చేస్తున్నారు. స్థానిక సమస్యలను పరిష్కరించే నేతకే జై కొడతామంటున్నారు. రాజకీయంగా జగ్గారెడ్డికి ఇది చాలా కీలకమైన తరుణం. అందుకే ఎన్నికను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన ప్రత్యర్థులు కూడా ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ.. జగ్గారెడ్డిని ఓడించడాన్ని ఇజ్జత్‌కా సవాల్‌గా తీసుకున్నారు. రెండు వర్గాలు హోరాహోరీగా తలపడుతూ ఉండటంతో… ఓటరు తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.