Home News Politics

సంగారెడ్డి బరిలో..నిర్మలారెడ్డి..

SHARE

జగ్గారెడ్డి అరెస్ట్ సంగారెడ్డి రాజకీయాన్ని వేడెక్కిస్తోంది.. ఆ నియోజకవర్గంలో తాము ఖచ్చితంగా గెలుస్తామని లెక్కలు వేసుకుంటుంది కాంగ్రెస్‌ .. అయితే జగ్గారెడ్డి అరెస్ట్ తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనించాల్సి వస్తోంది కాంగ్రెస్‌ పెద్దలకి… ఆ క్రమంలో కొత్త చర్చ మొదలైంది పార్టీలో.. జగ్గారెడ్డి మళ్లీ ఎన్నికల బరిలో నిలుస్తారా లేదా ఆయన స్థానం లో కుటుంబ సభ్యులు గోదాలో దిగుతారా? అన్న దానిపై పెద్ద డిబేటే నడుస్తోంది..

మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి నకిలీ పాస్ పోర్ట్ కేసులో అరెస్ట్ అవ్వడంతో సంగారెడ్డి లో సరికొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి… నకిలీ పాస్ పోర్ట్ తో మహిళల అక్రమ రవాణా అంశంతో పాటు… భూవివాదాలు తెరపైకి వస్తుండటం తో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోందట.. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ సంగారెడ్డిలో ఖచ్చితంగా గెలుస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు పార్టీ పెద్దలు.. ఇలాంటి పరిస్థితుల్లో జగ్గారెడ్డి అరెస్ట్ తో సరికొత్త పరిణామాలు చోటుచేసుకునే పరిస్థితి కనిపిస్తోంది.. అరెస్ట్‌ ఎఫెక్ట్‌తో భవిష్యత్తులో ఏం చేయాలన్న అంశం పై పార్టీ అధిష్టానం సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తు కార్యాచరణ పై అభిప్రాయ సేకరణ కూడా మొదలుపెట్టిందంట..

కాంగ్రెస్‌ పార్టీ తన అభ్యర్థుల తొలి జాబితాను త్వరలో ప్రకటించాల్సి ఉంది.. సదరు తొలి జాబితాలోనే జగ్గారెడ్డిని సంగారెడ్డి అభ్యర్థిగా ప్రకటిస్తారన్న ప్రచారం సాగింది… అయితే ఆయన అరెస్ట్‌తో ఈ కేసులు , బెయిల్ లాంటి అంశాలు ఎప్పటికి తేలుతాయో అన్న స్పష్టత.. అటు పార్టీ అధిష్టానం.. ఇటు ఆయన అనుచర వర్గంలో క్లారీటి లేకుండా పోయింది. ఒక వేళ ఎన్నికల నాటికి ఆయన బయటకు రాకపోతే ఏంటన్న ఉత్కంఠ ఆయన అనుచరగణంలో నెలకొంది.. ఇలాంటి పరిస్థితుల్లో జగ్గారెడ్డి స్థానం లో ఆయన కుటుంబ సభ్యులు పోటీకి దిగుతారన్న ప్రచారం సాగుతోంది.

జగ్గారెడ్డి స్థానం లో ఆయన భార్య నిర్మల రెడ్డి ని కాంగ్రెస్‌ ఎన్నికల బరిలో నిలిపే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.. సంగారెడ్డి కాంగ్రెస్ వర్గాల్లోనూ ఇదే చర్చ సాగుతోంది.. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న నిర్మలా రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.. కొంతకాలంగా ఆమె నియోజకవర్గం అంతా పర్యటిస్తూ కార్యకర్తల సమావేశాలను నిర్వహిస్తూ వస్తున్నారు…

నిర్మలా రెడ్డి ని పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే ఓటర్ల ను ఏ మేరకు ప్రభావితం చేయగలరు… ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై అభిప్రాయ సేకరణ కూడా జరుగుతోందంట.. మూడు రోజుల క్రితం సంగారెడ్డి లో కాంగ్రెస్ నిర్వహించిన మైనార్టీ గర్జన సభ లో తన భర్త ను అక్రమంగా అరెస్ట్ చేసారంటూ నిర్మలా రెడ్డి భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు.. అది ఆమె ఎన్నికల బరిలో దిగనున్నారనడానికి సంకేతంగా భావించవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు..