Home Entertainment Cinema

`క‌ణం`తో ఎమోష‌న‌ల్‌ క‌నెక్ష‌న్‌

`క‌ణం`తో ఎమోష‌న‌ల్‌ క‌నెక్ష‌న్‌

SHARE

నాగశౌర్య, సాయిపల్లవి నటించిన చిత్రం ‘కణం’. ఎన్.వి.ఆర్ సినిమా స‌మ‌ర్ప‌ణ‌లో లైకా ప్రొడక్షన్స్ సినిమాను నిర్మించింది. విజయ్ దర్శకుడు. సినిమా ఏప్రిల్ 27న విడుదలవుతుంది. ఈ సందర్భంగా సాయిప‌ల్ల‌వి ఈ సిన్మా అనుభ‌వాల్ని పంచుకుంది. త‌న త‌ల్లికోసమే ఈ సిన్మా చేశాన‌ని చెప్పుకుంది.

ద‌ర్శ‌కుడు విజ‌య్‌తో `చార్లి` అనే సినిమా చేయాల్సింది. కానీ కుద‌ర‌లేదు. త‌ర్వాత ఈ క‌థ‌ను నాకు చెప్పారు. ముందు నేను న‌టించ‌న‌న్నా. ఎందుకంటే తెలుగులో కొన్ని సినిమాలు చేసిన‌ప్ప‌టికీ.. మాతృభాష త‌మిళంలో నా మొద‌టి సినిమా కావ‌డంతో… తొలి త‌మిళ చిత్రంలోనే త‌ల్లిపాత్ర‌లో ఎందుకు న‌టించాల‌నే వ‌ద్ద‌నుకున్నాను. అయితే స్క్రిప్ట్ చ‌దివి న‌చ్చితే న‌టించ‌మ‌ని అన్నారు. నేను స్క్రిప్ట్ చ‌ద‌వ‌లేదు కానీ.. మా అమ్మ చ‌దివి.. మంచి క‌థ‌, ఎందుకు చేయ‌న‌ని అన్నావ‌ని అడిగింది. త‌మిళంలో తొలి సినిమా అమ్మ పాత్ర‌లో న‌టించ‌డ‌మే కాదు.. హార‌ర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయ‌నే చేయాల‌నిపించ‌లేద‌ని చెప్పాన‌ను. అయితే అమ్మ చెప్ప‌డంతో ఆ సినిమా ఒప్పుకున్నాను.

న‌టిగా పాత్ర ఏదైనా బావుంటే చేయాలి. సాధార‌ణంగా యంగ్ ఏజ్‌లో ప్రేయ‌సి పాత్ర‌లు చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌తాం. అలాగే ఎవ‌రికైనా రెండు మూడు సినిమాలు చేశాక మన ఆలోచనా విధానం మారుతుంది. అలాగే నా ఆలోచ‌నా విధానం మారుతూ వ‌స్తుంది. ఇక `క‌ణం` సినిమాతో ఆ ఆలోచనా విధానం మరింత మెరుగుపడిందనే చెప్పాలి. ఈ సినిమా చేస్తున్నంత సేపూ నన్ను నేను ఓ తల్లిగానే ఊహించుకుంటూ చేశాను. వెరోనికాతో బాగా క‌నెక్ట్ అయ్యాను. ఓ ర‌కంగా చెప్పాలంటే ఈ సినిమాపై నా ఆలోచనా తీరు మారింది. నాకు నేను కొత్త‌గా క‌న‌ప‌డుతున్నాను. ఈ సినిమా చేసిన తర్వాత తల్లి పాత్రలో ఎందుకు నటించాన‌న్న అసంతృప్తి అస్సలు లేదు.

మొటిమ‌కూడా ముత్య‌మేలే..

నేను జార్జియాలో డాక్ట‌ర్ కోర్సు చ‌దువుకున్నాను. నాకు మొటిమ‌లు బాగా వ‌చ్చేవి. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా మొటిమ‌లు త‌గ్గ‌లేదు. బ‌య‌టికి వెళ్లేట‌ప్పుడు ముఖానికి బ‌ట్ట క‌ట్టుకుని వెళ్లేదాన్ని. నా తొలి చిత్రం ప్రేమ‌మ్ చేసిన‌ప్పుడు నా ముఖం నిండా మొటిమ‌లే. న‌న్ను ప్రేక్ష‌కులు హీరోయిన్‌గా ఒప్పుకుంటారా? అని బాధ‌ప‌డేదాన్ని. కానీ సినిమా రిలీజ్ అయ్యాక‌.. ప్రేక్ష‌కులు న‌న్ను రిసీవ్ చేసుకున్న తీరు నాకెంతో ధైర్యాన్నిచ్చింది. ముఖం ఎంత అందంగా ఉంద‌ని కాదు.. ఎంత మంచి పాత్ర చేశామ‌నేదే ముఖ్యం. ఒక‌ప్పుడు మొటిమ‌ల‌తో బాధ‌ప‌డే అమ్మాయిలు.. ఇప్పుడు సాయిప‌ల్ల‌వికి కూడా మొటిమ‌లు ఉన్నాయి క‌దా అనుకుంటున్నారు. వాటి గురించి ప‌ట్టించుకోవ‌డం మానేశారు.

`క‌రు` సినిమాను త‌మిళంలో ఇప్పుడు `దియా` అని టైటిల్ మార్చారు. త‌ల్లికి, బిడ్డ‌కు మ‌ధ్య మ‌ధ్య ఎమోష‌న‌ల్ బాండింగ్‌ మూవీ. సినిమా చేస్తున్నంత సేపు మూవీకి ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ అయ్యాను. ఇంత‌కు ముందు చెప్పినట్లు ఇందులో దియా పాత్ర‌లో న‌టించిన వెరోనికాతో ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ అయిపోయాను. త‌ల్లి ఇలాగే ఆలోచిస్తుందా? అనిపించేది. ఓ సంద‌ర్భంలో విజ‌య్‌గారి ద‌గ్గ‌ర‌కెళ్లి.. ఆ పాప‌ను ద‌త్త‌త తీసుకోవాల‌నుంద‌ని చెప్పాను. అదే విష‌యం అమ్మ‌కు చెబితే `ముందు నిన్ను నువ్వు చూసుకో… త‌ర్వాత వేరే వారి గురించి ఆలోచించ‌వ‌చ్చు అని చెప్పింది. నా మాతృభాష త‌మిళ‌మే అయినా, త‌మిళంలో డ‌బ్బింగ్ చెప్ప‌డానికి ఒక‌టిన్న‌ర రోజు ప‌ట్టింది. అదే తెలుగులో సగం రోజులోనే డ‌బ్బింగ్ చెప్పేశాను. ఎందుకో తెలియ‌దు కానీ.. తెలుగు కంఫ‌ర్ట్‌గా ఉంది.

నేనెవ‌రినీ బాధ పెట్ట‌ను

నాగశౌర్య మంచి న‌టుడు. కెమెరా ముందుకు రాగానే ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ అయిపోతారు. త‌ను నేను మాట్లాడ‌టం లేద‌ని ఫీల‌య్యాడ‌నుకుంటా. నేను ఎవ‌రినీ బాధ పెట్ట‌ను. ఒక‌వేళ నా వ‌ల్ల ఎవ‌రైనా బాధ ప‌డ్డార‌ని తెలిస్తే వెంట‌నే సారీ చెప్పేస్తాను. డ‌బ్బింగ్ స‌మ‌యంలో అంద‌రం క‌లిసి డిన్న‌ర్ చేద్దామ‌ని నాగశౌర్య‌కు ఫోన్ చేద్దామ‌నుకుంటే.. ఆయ‌న ద‌గ్గ‌ర ఫోన్ లేద‌ని చెప్పారు. ఆయ‌న మేనేజ‌ర్‌కి కాల్ చేస్తే.. `ఛ‌లో` మూవీ ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్నార‌ని చెప్పారు. నేను ఆ స‌మ‌యంలో ఎంతో బాధ‌ప‌డ్డాను. కావాల‌ని ఆయ‌న్ని బాధ‌పెట్ట‌లేదు. ఒక‌వేళ నిజంగా బాధ పెట్టి ఉంటే సారీ చెప్పేస్తాను