Home News Stories

ఆ ఎమ్మెల్యేలతో ఎందుకలా—సబితా విషయంలో ఎందుకిలా…?

SHARE

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వరుసగా పార్టీని వీడుతున్నట్లు ప్రకటిస్తున్నారు .. వారు పార్టీ మారుతున్నప్పుడు ఒక నాయకుడు కూడా పట్టించుకోలేదు.. అయితే ఇప్పుడు సబితా విషయంలో మాత్రం అందరూ క్యూకట్టి మంతానాలు సాగిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.. అసలింతకీ కాంగ్రెస్ లో ఎం జరుగుతుంది?… ఎమ్మెల్యేలు జంప్ అవుతుంటే పార్టీ పెద్దలు ఏం చేస్తున్నారు? .. పార్టీ మారడానికి సిద్దమవుతున్న వారిని కట్టడి చేయడంలో కూడా ఎవరి రాజకీయం వాళ్లు చేస్తున్నారా?

కాంగ్రెస్ ఎమ్మెల్యే లు చేజారిపోతుంటే… పార్టీ పెద్దలు అనుసరిస్తున్న తీరు విమర్శలపాలు అవుతోంది… పార్టీలో జరుగుతున్న వ్యవహారం చూస్తూ .. పాపం కాంగ్రెస్ అనే సానుభూతిపరులు కూడా పార్టీ నాయకత్వం మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు …ఆత్రం సక్కు, రేగా కాంతారావు, హరిప్రియ నాయక్, చిరుమర్తి లింగయ్యలు పార్టీ మారుతున్నట్లు ప్రకటిస్తే మాత్రం కనీసం సంప్రదింపులు కూడా చేయలేదు. కట్టడి చేసే ప్రయత్నం చేయకపోగా అమ్ముడు పోయారు అనే కెమెంట్లు చేశారు కొందరు నేతలు .. దాంతో ఆదివాసీ నాయకులు అంటే అంత చులకనా … అన్నచర్చ తెర మీదకు తెచ్చారు పార్టీ మరీన ఎమ్మెల్యేలు… దాని పై కూడా సరైన వివరణ ఇచ్చుకోలేకపోయింది కాంగ్రెస్ … పార్టీ మారుతున్నాం అని సదరు ఎమ్మెల్యేలు ప్రకటించిన తర్వాత .. కనీసం వారితో సంప్రదింపులు జరపలేదన్న అపవాదు ఎలాగూ మూటగట్టుకుంది… ఇలా రెండు రకాలుగా దెబ్బతింది పార్టీ నాయకత్వం.

ఇక సబితా ఇంద్రారెడ్డి రెడ్డి వ్యవహారంలో కూడా పార్టీ నాయకుల ఆధిపత్య ధోరణి బయట పడింది… సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి లు వెళ్లి సబితను పార్టీ మారవద్దని సముదాయించే ప్రయత్నం చేశారు… అయితే ఎలాంటి స్పందనా కనిపించలేదు .. అయితే పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్ రెడ్డి ఎంట్రీతో సీన్‌ మారినట్లు కనిపించింది.. రేవంత్‌ భేటీ తర్వాత సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారటం పై వెనక్కి తగ్గారు అనే లీకులు వచ్చాయి… దాంతో కాంగ్రెస్‌లో జరుగుతున్న రాజకీయం, పార్టీ పెద్దల వ్యవహారతీరుపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి

ఇప్పటి వరకు చిరుమర్తి లింగయ్య, ఆత్రం సక్కు, రేగా కాంతారావు, హరిప్రియ నాయక్ లు పార్టీ మారితే మాత్రం..కనీసం ఒక్క నాయకుడు కూడా అసలు ఎందుకు పార్టీ మారుతున్నారు అని అడిగే ప్రయత్నం కూడా చేయలేదు. కానీ సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారుతున్నారు అనగానే… పార్టీలో ఉన్న అగ్రనాయకుల అంతా సబిత ఇంటికి క్యూ కట్టారు. మిగిలిన నలుగురు ఎమ్మెల్యేల పట్ల ఒకలా…సబిత పట్ల ఇంకోలా ఎందుకు వ్యవహరించారు అనే చర్చ పార్టీలో మొదలైంది. పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా ముఖ్యనేతలు ..ఎవరికి వారే యమునా తీరు అన్నట్టు వ్యవహరిస్తుండటం కాంగ్రెస్‌ శ్రేణులకు మింగుడు పడటం లేదు.. ఆ క్రమంలో పార్టీ నాయకత్వం వేసే ప్రతి అడుగుపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి… మరి చూడాలి కాంగ్రెస్ నావ ఒడ్డుకు చేరుతుందో.. లేకుంటే నట్టేట మునుగుతుందో …