Home News Politics

రాజంపేట లోక్‌సభ బరిలో ఎవరో ?

SHARE

అటు వైసీపీ,ఇటు టీడీపీ మెయిన్ బాస్ ల అడ్డాగా కలగలిసిన కడప,చిత్తురు జిల్లాల కాంబీనేషన్ లో ఉన్న పార్లమెంట్ నియోజకవర్గం రాజంపేట. ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఎవరనేది తేలినా టీడీపీలో పోటీ కొనసాగుతోంది. రాజంపేట లోక్‌సభ పరిధిలో రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాలు జిల్లా పరిధిలో ఉండగా, చిత్తూరు జిల్లాలో పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపారు. ఇక్కడ నుంచి గెలుపు సాధించాలంటే చిత్తూరు జిల్లా ఓటర్లు ప్రభావితం చేస్తారని గత ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్నాయి. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం పై తెలుగు పాపులర్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్….

2014 ఎన్నికల్లో రాజంపేట స్థానాన్ని టీడీపీ పొత్తుల కింద బీజేపీకి కేటాయించింది. దగ్గుపాటి పురందేశ్వరి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయగా, వైసీపీ నుంచి చిత్తూరు జిల్లాకు చెందిన మిధున్‌రెడ్డి తలపడ్డారు. బీజేపీ అభ్యర్థి పురందేశ్వరికి 36.86 శాతంతో 4,26,990 ఓట్లు వచ్చాయి. మిధున్‌రడ్డికి 51.95 శాతంతో 6,01,752 ఓట్లు వచ్చాయి. 1,74,762 ఓట్ల ఆధిక్యంతో మిధురెడ్డి రాజంపేట లోక్‌సభ అభ్యర్థిగా గెలుపోందారు. ఇక్కడ గతంలో బలిజ సామాజిక వర్గం అభ్యర్థులే ఎక్కువ సార్లు గెలుస్తూ వచ్చేవారు. అలాంటిది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మిధున్‌రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందడం అన్ని సామాజిక వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఈ సారి ఎలాంటి పొత్తులు లేకుండా టీడీపీ తమ అభ్యర్థిని బరిలో దింపి గెలుపు సాధించేలా వ్యూహ రచన సాగిస్తోంది. ఇది తెలుసుకున్న జిల్లాలోని ముఖ్యనేతలు అధినేత చంద్రబాబును కలిసి రాజంపేట లోక్‌సభకు పోటీ చేసేలా ఒక అవకాశమివ్వాలంటూ అభ్యర్థిస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి సాయిప్రతాప్‌ సీఎంను కలిసి తన అల్లుడు సాయి లోకే్‌షకు ఈ సారి అవకాశమివ్వాలంటూ కోరినట్లు సమాచారం. చిత్తూరు జిల్లాకు చెందిన డీకే ఆదికేశవులు తనయుడు శ్రీనివాసులు ఈ సారి పోటీ చేయాలని ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. కానీ శ్రీనివాసులుపై గతంలో పలు కేసులు నమోదు కావడం అడ్డంకిగా మారుతోంది. బలిజ సామాజిక వర్గానికి చెందిన మరో నేత బత్యాల చెంగల్రాయులును పోటీ చేయిస్తే ఎలా ఉంటుందన్నది కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి కడప లోక్‌సభ నుంచి పోటీ చేయాలని ఆలోచన చేస్తుండగా జమ్మలమడుగు సమీకరణతో మంత్రి ఆదికి ఆ అవకాశం దక్కింది. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి శ్రీనివాసులరెడ్డి తీసుకెళ్లడంతో ఏదోక చోట సర్దుబాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు ఆ పార్టీలో చర్చ సాగుతోంది. వైసీపీ నుంచి సిట్టింగ్‌ ఎంపీ మిధున్‌రెడ్డి పోటీ చేస్తుండడంతో అదే సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాసులరెడ్డిని పోటీకి నిలిపితే ఎలా ఉంటుందన్నది టీడీపీలో చర్చ సాగుతున్నట్లు సమాచారం.

గత ఎన్నికలను పరిశీలిస్తే రాజంపేట పరిధిలోని 7 నియోజకవర్గాల్లో మదనపల్లి,పుంగనూరు,రైల్వే కోడూరు,రాయచోటి,పీలేరు నియోజకవర్గాల్లో వైసీపీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ఇప్పటికి ఆ నియోజకవర్గాల్లో వైసీపీ బలంగా ఉండటంతో టీడీపీ అభ్యర్ది ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తుంది. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి కావడం వల్ల ఓట్లు సాధించలేకపోయాం అంటున్న టీడీపీ వర్గాలు ఈ సారి రాజంపేటలో గెలుపు తమదే అంటున్నారు. ఏదేమైన నియోజకవర్గం పై వైసీపీకి పూర్తి పట్టుండటం ఇక్కడ టీడీపీకి సవాల్ గా మారింది. ఇక జనసేన ఇప్పటివరకు ఇక్కడ ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేయకపోవడం ఆ పార్టీ పై ఇక్కడ పెద్ద అంచనాలు కూడా లేవు. ఇక కాంగ్రెస్,బీజేపీ పోటీ చేసిన అవి పోటీకి మాత్రమే పరిమితం…ఇక్కడ టగ్ ఆఫ్ వార్ మాత్రం టీడీపీ-వైసీపీ మధ్యే సాగనుంది.