Home News Politics

ఈ సారైనా పొట్లూరి కల నెరవేరేనా…?

SHARE

పొట్లూరి వర ప్రసాద్… పీవీపీగా అందరికి సుపరిచితుడు. సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా పరిచయం అక్కర్లేని పేరు. వ్యాపార రంగంలో సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా సక్సెస్ రుచి చూసిన పీవీపీ తన చిరకాలవాంచ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. పొలిటికల్ గా సక్సెస్ గోల్ కొట్టాలనుకుంటున్న పీవీపీ కల కల్లగానే మిగిలిపోతుంది. తనకు అందుబాటులో ఉన్న అన్ని సోర్స్ లు ఉపయోగించుకుంటున్న పీవీపీకి రాజకీయరంగంలో ఎందుకు సక్సెస్ కొట్టలేకపోతున్నారు పొట్లూరి పొలిటికల్ ఫూచర్ ఏంటీ…

గడచిన 2014 ఎన్నికల్లో పోటీకి కాస్తంత గట్టిగానే యత్నించిన పీవీపీ… ఏకంగా తన తురుపు ముక్కగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కూడా ప్రయోగించారు. అయినా కూడా చివరి నిమిషంలో కేశినేని నాని ఆ యత్నాన్ని కూడా భగ్నం చేసేశారు. మొత్తంగా నాడు పవన్ మాటే మంత్రంగా సాగిన చంద్రబాబు కూడా విజయవాడ సీటు విషయంలో పీవీపీ ఆశయాన్ని నెరవేర్చేలేకపోయారు. అయితే ఈ సారైనా పీవీపీ ఆశయం నెరవేరుతుందా? అంటే… డౌటేనన్న సమాధానం వస్తోంది. పార్టీ ఏదైనా విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టాలన్నది పీవీపీ జీవితాశయం.

అయితే టీడీపీ నుంచి ఈ దఫా సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేశినేని… తన స్థానాన్ని పీవీపీకే కాదు ఏ ఒక్కరికి కూడా త్యాగం చేసే అవకాశాల్లేవు. ఈ క్రమంలో వైసీపీ నుంచి నరుక్కొద్దామని భావించిన ఆయనకు విజయ్ ఎలక్ట్రికల్స్ అధినేత దాసరి జై రమేశ్ నుంచి మరో ఆటంకం వచ్చి చేరింది. ఈ దఫా వైసీపీ టికెట్ జై రమేశ్ కేనని గట్టిగా వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో పీవీపీకి అటు టీడీపీ నుంచే కాకుండా ఇటు వైసీపీ నుంచి కూడా దాదాపుగా డోర్స్ క్లోజేనని చెప్పక తప్పదు.

ఇక తన ఆప్త మిత్రుడైన పవన్ పార్టీ నుంచి పీవీపీకి టికెట్ దక్కే అవకాశాలున్నా… గెలుపుపైనే బోలెడన్ని అనుమానాలు. ఎందుకంటే… కమ్మ సామాజిక వర్గం డామినేట్గా ఉన్న బెజవాడ ఎంపీ సీట్లో… అన్ని పార్టీలు అదే సామాజిక వర్గానికి చెందిన నేతలను బరిలోకి దింపుతున్నాయి. ఈ క్రమంలో జనసేన పార్టీకి బలమైన సామాజిక ముద్ర ఉండటంతో ఆ పార్టీ తరఫున బరిలోకి దిగితే… పీవీపీ గెలిచే ఛాన్స్ దాదాపుగా లేనట్టే. వెరసి పీవీపీ ఎంపీ కల… కలగానే మిగిలిపోతుందా? అన్న వాదన ఇప్పుడు బెజవాడ రాజకీయాల్లో వినిపిస్తోంది.