Home News Stories

మోడీ పై దండెత్తుతున్న ప్రియాంక…!

SHARE

వారణాసి నుంచి ఎందుకు పోటీ చేయకూడదని కార్యకర్తల్ని ప్రశ్నించడం ద్వారా…రాజకీయ ప్రత్యర్థులను, విశ్లేషకుల్ని ఆలోచలో పడేశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. పార్టీ ఆదేశిస్తే ఎక్కడ నుంచి పోటీ చేసేందుకైనా సిద్ధమే అని రెండు రోజుల క్రితం చెప్పిన ప్రియాంక.. సడన్‌గా వారణాసి ఊసెత్తడం పార్టీ నేతల్లో ఉత్సాహం పెంచింది. వారణాసి నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి పోటీ చేస్తున్నారు. ప్రియాంక వారణాసిలో పోటీకి దిగుతారా?.

దేశ రాజకీయం అంతా ఉత్తరప్రదేశ్‌లోనే నడుస్తోందా?. ఎవరి సత్తా ఏంటో తేల్చుకుందాం అని యూపీలో సవాల్ విసురుతున్నాయి కాంగ్రెస్- బీజేపీ. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న అమేథీలో అమీతుమీకి సిద్ధమైంది బీజేపీ. రాహుల్ మీద మరోసారి స్మృతీ ఇరానీ అనే అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. అమేథీలో పరిస్థితి అంత అనుకూలంగా లేకపోవడంతో..రాహుల్ మరో సేఫ్ ప్లేస్ వెతుక్కునే పనిలో ఉన్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. దీంతో యూపీ బాధ్యతలు చేపట్టిన ప్రియాంక..తమ కంచుకోటలాంటి అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల్లో పర్యటించారు. అక్కడి ఓటర్లతో చర్చించారు…

రాయ్‌బరేలీ కాంగ్రెస్ అభ్యర్థిగా సోనియా గాంధీని ఇప్పటికే ప్రకటించింది కాంగ్రెస్ నాయకత్వం. సోనియా అనారోగ్యంతో ఉండటంతో.. ఆమె తరపున ప్రియాంక ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. ఇదే విషయాన్ని పార్టీ నేతలు, ఓటర్లకు చెబుతున్నారు. సోనియా ఆరోగ్యం సహకరించక ప్రచారానికి రాలేదని చెప్పడంతో.. రాయ్ బరేలీ నుంచి పోటీ చేయాలని స్థానిక నేతలు ప్రియాంక గాంధీని కోరారు. ఈ సమయంలో…రాయ్ బరేలీలోనే ఎందుకు… వారణాసి నుంచి ఎందుకు పోటీ చేయకూడదు.. అని ప్రశ్నించడంతో పార్టీ నేతలు ఆశ్చర్యపోయారు. ప్రియాంక మాటలతో… యూపీ రాజకీయాల్లో చర్చ మొదలైంది.

యూపీలో పార్టీ ప్రచారాన్ని గంగాయాత్ర ద్వారా ప్రారంభించిన ప్రియాంక… ప్రయాగ రాజ్‌ నుంచి వారణాసి వరకూ ప్రయాణించారు. యాత్ర ముగింపు సమయంలో వారణాసిలో ఆమెకు అనూహ్య స్వాగతం లభించింది. ఒక రోజంతా వారణాసిలోనే ఉండి పార్టీ నేతలతో చర్చలు జరిపారు. బీజేపీ అమేథీ సీటుని సీరియస్‌గా తీసుకోవడంతో.. తాము కూడా వారణాసిని అంతకంటే ఎక్కువ సీరియస్‌గా తీసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రియాంక పోటీ చేస్తే.. వారణాసిలో సమీకరణలు మారే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో మోడీపై ఆప్ అభ్యర్థిగా అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో నరేంద్రమోడీ మూడున్నర లక్షల ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. ప్రియాంక వారణాసి నుంచి పోటీ చేస్తే…బీజేపీ చెమటోడ్చక తప్పని పరిస్థితి.