Home News Politics

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి…

SHARE

టీడీపీతో ఇబ్బందిలేదనుకునేలోపు టీజేఎస్‌. జనసమితికి సర్దిచెప్పేసరికి సీపీఐ. భూమి గుండ్రంగా ఉన్నట్లు… ఎటుమొదలుపెట్టినా మళ్లీ మొదటికొస్తోంది ప్రజాకూటమి పొత్తుల వ్యవహారం. ఇంకెన్నాళ్లు సాగదీస్తాం…తొందరగా తేల్చేద్దామనుకుంటున్నా…ఏవో ఒక పేచీలతో సీట్ల పంపకం  తెగడం లేదు. ప్రజాకూటమిలో సీట్ల లొల్లి పరేషాన్ ఎప్పటివరకు…

ప్రజాకూటమిలో పార్టీల సీట్ల సర్దుబాటు వ్యవహారం… చూసుకుని మురువంగా.. చెప్పుకుని ఏడవంగా అన్నట్లుంది. ఇన్నాళ్లు కాంగ్రెస్ మెడ మీద కత్తి పెట్టిన  కోదండరాం పార్టీ.. ఇప్పుడు కొంత సైలెంట్ అయ్యింది. సీట్ల సర్దుబాటు వ్యవహారంలో కొంత పురోగతి ఉండటంతో తెలంగాణ జనసమితి కాస్త చల్లబడింది. ఇక టీటీడీపీ పొత్తు సీట్ల విషయంలో పెద్దగా తొందరపడటం లేదు. ఎన్ని సీట్లు, ఏయే సీట్లన్నదానిపై టెన్షన్‌ పడాల్సిన పన్లేదన్నట్లే ఉన్నారు టీటీడీపీ నేతలు. ఏదన్నా తేడా వస్తే…అంతా చంద్రబాబే చూసుకుంటారు అనే ధోరణిలో ఉంది టీటీడీపీ. ప్రజాకూటమిలో సీట్ల సర్దుబాటుపై మొదట్నించీ ఆ పార్టీ కొంత పట్టువిడుపు ధోరణితోనే ఉంది. 11 సీట్లయితే తప్పకుండా ఇస్తారన్న ధీమాతో ఉన్నారు తెలంగాణ టీడీపీ నేతలు. కూటమిలో కాక మీదుంది కామ్రేడ్ చాడ వెంకట్ రెడ్డే.

తెలంగాణలో విపక్షాలని ఓ తాటిపైకి తెచ్చేందుకు చొరవచూపిన తమనే కాంగ్రెస్‌ నిర్లక్ష్యం చేస్తోందన్న అసంతృప్తితో ఉంది సీపీఐ. కూటమి కోసం మొదటి నుంచి ప్రయత్నం చేసిన పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారని కామ్రేడ్లు కస్సుబుస్సుమంటున్నారు. ఇప్పటిదాకా సీట్లు సర్దుబాటుపై చర్చించకుంటే ఎలాగని అసహనంతో ఉంది సీపీఐ. అసలు ప్రజాకూటమిలో సీపీఐ ఉండాలనుకుంటోందా… లేదంటే అవసరం లేదనే ఆలోచనతో కాంగ్రెస్‌ ఉందా అన్న అనుమానమొస్తోంది సీపీఐ నేతలకి. కూటమిలో సీట్ల సర్దుబాటుపై చాడ వెంకటరెడ్డి గరం గరంగా ఉన్నారు. కాంగ్రెస్‌ ఇలాగే వ్యవహరిస్తే కూటమినుంచి బయటికి వెళ్లేందుకు కూడా సిద్ధమని ఎల్‌.రమణ, కోదండరాంల దగ్గర చాడ ప్రస్తావించారని సమాచారం. కూటమికోసం కసరత్తు చేసి… ఇప్పుడు మీరే బయటికి వెళ్లిపోతామంటే ఎలాగని టీటీడీపీ, టీజేఎస్‌ నేతలు చాడకి నచ్చజెప్పారు.


పొత్తు సీట్ల విషయంలో పంతానికి పోకుండా భాగస్వామ్య పక్షాలు కొంత సర్దుకుపోయే ధోరణితోనే ఉన్నాయి. సీపీఐ కూడా కొన్ని సీట్ల త్యాగానికి సిద్ధమైంది. నల్గొండ జిల్లాలో మునుగోడు,  దేవరకొండ నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్ ఉన్నా.. ఆ సీట్లు కాంగ్రెస్‌కి వదిలేసేందుకు సిద్ధమైంది సీపీఐ. 2014 ఎన్నికల్లో పార్టీ గెలిచిన దేవరకొండ సీటుని కూడా కాంగ్రెస్‌కి ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే ఖమ్మం విషయంలో మాత్రం..కాంగ్రెస్ మొండిగా వ్యవహరిస్తోందని సీపీఐ కోపంగా ఉంది. సీపీఐ సీనియర్ నాయకుడు కూనంనేని కోసం కొత్తగూడెం సీటడిగితే..అక్కడ తమ పార్టీలోనే పంచాయతీ ఉందంటోంది కాంగ్రెస్‌.

నల్గొండ జిల్లాలో తమకు పట్టున్న ఒకటికి రెండు సీట్లు వదులుకున్నా…ఖమ్మం జిల్లా విషయంలో కాంగ్రెస్ ఏమాత్రం సర్దుకుపోవడం లేదనేది సీపీఐ అసంతృప్తి. సీపీఐ వైరా సీటు అడుగుతున్నా…ఇక్కడ కూడా కాంగ్రెస్ పీటముడి వేసింది. అటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పోటీచేయాలనుకుంటున్న కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ సీటు విషయంలోనూ కాంగ్రెస్‌ తగ్గడం లేదు. హుస్నాబాద్‌లో తమకు బలమైన అభ్యర్థి ఉన్నాడని కాంగ్రెస్‌ చెబుతోంది. అయితే చాడ వెంకట్ రెడ్డి  గతంలో ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావటంతో హుస్నాబాద్‌ విషయంలో పట్టుదలతో ఉన్నారు. అయితే కాంగ్రెస్‌ మాత్రం తేల్చటం లేదు. తాము సర్దుకుపోతున్నా, కొన్ని త్యాగాలకు సిద్ధపడినా కాంగ్రెస్‌ మాత్రం తన మాటే నెగ్గాలనే పట్టుదలతో ఉందని…తమను తేలిగ్గా తీసుకుంటోందన్న ఫీలింగ్‌తో ఉన్నారు చాడ వెంకటరెడ్డి.