Home News Politics

అస్త్ర‌మా? భ‌స్మాసుర హ‌స్త‌మా?

మెంట‌ల్‌కృష్ణ‌తో వైసీపీకి ఒరిగేదేంటి?

SHARE


పోసాని కృష్ణ‌ముర‌ళి. అస‌లు పేరుకంటే మెంట‌ల్‌కృష్ణ‌గానే పాపుల‌ర్‌. రీల్ లైఫ్‌లోనే కాదు.. రియ‌ల్ లైఫ్‌లోనూ ట‌న్నుల‌కొద్దీ చెత్తుంది. నోరు తెరిచాడంటే అమ్మ‌ల‌క్క‌లే. ఆఫ్‌లైన్ ప్రోగ్రామ‌యితే సెన్సార్ చేసి టెలికాస్ట్ చేయొచ్చు. కానీ లైవ్‌లో కూడా అమ్మోరు పూనిన‌ట్లు ఊగిపోతుంటాడు. ఎవ‌ర్న‌యినా ఉతికిఆరేస్తాడు. ఆయ‌నంతే అదో టైప్ అని ఇండ‌స్ట్రీ జ‌నం అల‌వాటుప‌డిపోయినా…రాజ‌కీయాల్లో ఉన్న‌వాళ్లు మాత్రం వామ్మో ఇదేం నోర‌ని నోరెళ్ల‌బెడుతున్నారు. ఆ మ‌ధ్య టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర‌ప్రసాద్ సిన్మా ఇండ‌స్ట్రీవాళ్ల‌కు ఏపీ స్టేట‌స్ ప‌ట్ట‌టంలేద‌ని ఓ మాట‌న‌గానే…టాలీవుడ్‌కి తానే అఫీషియ‌ల్ మైక్‌న‌న్న‌ట్లు తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టేశాడు మెంట‌ల్‌కృష్ణ‌.

కొన్నాళ్లుగా చంద్ర‌బాబు పేరెత్తితే చాలు ఒంటికాలిమీద లేస్తున్నాడు పోసాని కృష్ణ‌ముర‌ళి. ఏద‌న్నా సంద‌ర్భ‌మొస్తే స్పందించ‌డం వేరు. కానీ జ‌గ‌న్ అమ్ముల‌పొదిలో ఆయుధంగా మారుతున్నాడు. 2009ఎన్నిక‌ల్లో ప్ర‌జారాజ్యం పార్టీనుంచి పోటీచేసి చిత్తుగా ఓడిపోయిన అనుభ‌వాన్ని పోసాని ఇంకా మ‌ర్చిపోలేదు. గ‌త ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ పోటీకి సాహ‌సించ‌క‌పోయినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న ల‌క్కుని ప‌రీక్షించుకోవాల‌నుకుంటున్నాడు. జ‌గ‌న్ పార్టీలో చేరకపోయినా వైసీపీకి హార్డ్‌కోర్ కార్య‌క‌ర్త‌లా స్పందిస్తున్నాడు. ఈమ‌ధ్య పాద‌యాత్ర‌లో కొంత‌దూరం జ‌గ‌న్‌తో చేతిలో చెయ్యేసి న‌డ‌వ‌డ‌మే కాదు…చంద్ర‌బాబుని, టీడీపీ ప్ర‌భుత్వాన్ని తిట్టేందుకు త‌న‌వంతుగా నోటిసాయం చేస్తున్నాడు.

జ‌గ‌న్ గెల‌వాల‌ని కోరుకుంటున్న మెంట‌ల్ కృష్ణ మ‌రోవైపు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వీరాభిమానిన‌ని చెప్పుకుంటున్నాడు. చిరంజీవినే ఎప్పుడో కాంగ్రెస్‌లో క‌లిపేసిన ప్ర‌జారాజ్యం మ‌ళ్లీ ప్రాణం పోసుకుంటే బాగుంటుందంటున్నాడు. వైసీపీ కండువా క‌ప్పుకుంటాడో లేదో చెప్ప‌కుండా, వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీపై క్లారిటీ ఇవ్వ‌కుండా త‌న మ‌ద్ద‌తు జ‌గ‌న్‌కేన‌ని ప్ర‌క‌టించాడు. ఇప్ప‌టికే ఐవైఆర్‌, ర‌మ‌ణ‌దీక్షితులులాంటి వాళ్లంద‌రినీ చేర‌దీస్తున్న జ‌గ‌న్‌…త‌న శ‌త్రువుని నోరారా తిడ‌తాడ‌ని పోసానిని కూడా దువ్వుతున్నారు. అయితే పోసాని ఎప్పుడెలా రియాక్ట్ అవుతాడో తెలీదు. ఇవాళ త‌మ‌కో ఆయుధంలా ఉప‌యోగ‌ప‌డ‌తానుకున్న‌వాడే రేపు … దుమ్ము దుల‌ప‌డ‌న్న గ్యారంటీ ఏమీలేదు. అస‌లే మెంట‌ల్‌కృష్ణ‌. తేడావ‌స్తే మెంట‌లెక్కించేస్తాడు. త‌స్మాత్‌ జాగ్ర‌త్త‌.