Home News Politics

పొలిటికల్ చుట్టాలు….

SHARE

రాజకీయాల్లో బంధుత్వాల హవా బలంగా నడుస్తోంది. రాజకీయ కుటుంబాల్లోని వియ్యంకులు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. ముందుగా నాయకులైన వారు కొందరు తర్వాత వియ్యంకులుగా మారారు. కొందరికి మాత్రం ఆ తర్వాత అవకాశాలు వచ్చాయి. స్వయంగా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. బావా బావమరుదుల బంధం ఆ తర్వాత వియ్యంకుల అనుబంధంగా మారింది. బాలయ్య మరో వియ్యంకుడు కూడా రాజకీయ కుటుంబానికి చెందిన వారే. విశాఖ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ, దివంగత టీడీపీ నేత ఎంవీవీఎస్‌ మూర్తి మనుమడు భరత్‌కు బాలయ్య తన రెండో కుమార్తెను ఇచ్చి పెళ్లి చేశారు.

ఏపీలో ఇద్దరు వియ్యంకులు ఏకంగా రాష్ట్ర మంత్రులుగా ఉన్నారు. మంత్రి నారాయణ కుమార్తెను గంటా శ్రీనివాసరావు కుమారుడు వివాహం చేసుకున్నారు. ఈ ఇద్దరూ మంత్రులు అయిన తర్వాతే వియ్యమందడం విశేషం. గంటాకు మరో వియ్యంకుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టీడీపీ ఎమ్మెల్యే రామాంజనేయులు కుమారుడు గంటా కుమార్తెను పెళ్లాడారు. అప్పట్లో వీళ్లిద్దరూ కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నారు. గత ఎన్నికలకు కొద్దిగా ముందు వీరు టీడీపీలోకి వచ్చారు. ఇక… ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, టీటీడీ పాలకమండలి చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ వియ్యంకులే. యనమల కుమార్తెను సుధాకర్‌ యాదవ్‌ కుమారుడు వివాహం చేసుకొన్నారు. ఈ వివాహానికి ముందు నుంచే సుధాకర్‌ యాదవ్‌ రాజకీయాల్లో ఉన్నారు. పోయిన ఎన్నికల్లో ఆయన కడప జిల్లా మైదుకూరు అసెంబ్లీ స్ధానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. సుధాకర్‌ యాదవ్‌కు మరో బంధుత్వం కూడా ఉంది. తెలంగాణ పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ కూడా సుధాకర్‌ యాదవ్‌కు వియ్యంకుడవుతారు.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన దివంగత నేత ఎర్రన్నాయుడుకు కూడా ప్రముఖులు వియ్యంకులుగా ఉన్నారు. ఆయన కుమారుడు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన నాయుడు విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కుమార్తెను వివాహం చేసుకొన్నారు. ఎర్రన్నాయుడుకు మరో వియ్యంకుడు ఆదిరెడ్డి అప్పారావు తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీలో ప్రముఖునిగా ఉన్నారు. జిల్లా స్థాయిలోనూ గుంటూరు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్‌ వియ్యంకులయ్యారు.

ఇదే జిల్లాలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు వియ్యంకుడైన పేరం హరిబాబు చిత్తూరు జిల్లాలో టీడీపీలో రాజకీయ ప్రముఖుడు. చిత్తూరు జిల్లాకే చెందిన దివంగత నేత ముద్దు కృష్ణమ నాయుడుకు కర్ణాటకలో సీనియర్‌ నేత, మాజీ మంత్రి సుబ్రమణ్య నాయుడు వియ్యంకుడు. ప్రకాశం జిల్లా కనిగిరి టీడీపీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు..కడపకి చెందిన సి.రామచంద్రయ్య వియ్యంకులు.

రాజకీయాల్లో ఉన్న వారు తమ కుటుంబానికి తగిన స్థాయి ఉన్న సంబంధాన్ని ఎంపిక చేసుకోవాలని అనుకొన్నప్పుడు అదే రంగంలో ఉన్న వారు తారసపడుతున్నారు. రాజకీయ హోదా ఒకే స్ధాయిలో ఉన్నప్పుడు త్వరగా వివాహ సంబంధాలు కుదురుతున్నాయి. ఒకసారి బంధం ఏర్పడిన తర్వాత ఈ కుటుంబాలకు ఒకరి మద్దతు మరొకరికి లభిస్తోంది. దీనివల్ల ఒక్కోసారి కొత్త అవకాశాలు కూడా ఆ కుటుంబాలు పొందే అవకాశం వస్తోంది. ఒకరికి ఉన్న పలుకుబడి మరొకరికి ఉపయోగపడుతుందని కొందరి భావన. కానీ, తలపండిన నేతలు ఈ వాదనతో ఏకీభవించడంలేదు. రాజకీయాల్లో సొంత శక్తి, స్థానిక బలాబలాల ఆధారంగానే అవకాశాలు వస్తాయి తప్ప మరొకరి మద్దతుతో రావని వారంటున్నారు!