Home News Politics

నల్లారి,పెద్దిరెడ్డి మధ్య సెగలు పుట్టిస్తున్న పీలేరు పోరు….!

SHARE

ఎన్నికలకు ఐదు నెలలు సమయం ఉండగానే పీలేరు రాజకీయం వేడెక్కింది. ఇక్కడ మాజీ సీఎం సోదరుడు టీడీపీలో చేరడంతో పీలేరు రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడ నుంచి పోటీ చేసే విషయంలో టీడీపీ నల్లారి కిశోర్ కుమార్ రెడ్డికి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికే నల్లారికి నామినేటెడ్ పదవి ఇచ్చి తన బలం బలగాన్ని సిద్దం చేసుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇది చిత్తురుజిల్లాని శాసిస్తున్న వైసీపీ సీనియర్ లీడర్ పెద్దిరెడ్డి అడ్డా కావడంతో ఇక్కడ జరుగుతున్న పోరు పై ఆసక్తి నెలకొంది….

నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఆ పార్టీకి బలం పెరిగినట్లయింది. నల్లారి చేరికతో ఈసారి పీలేరు తమదేనన్న ధీమా వ్యక్తమవుతోంది. పైగా నల్లారిని నామినేటెడ్ పదవుల్లో నియమించడంతో ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారికంగా పాల్గొనే వీలు చిక్కింది. దీంతో ఇప్పటికే నియోజకవర్గంలో ఒకసారి పర్యటన పూర్తయింది. వివిధ వర్గాల వారితో సమావేశం అవుతూ తనను వచ్చే ఎన్నికల్లో గెలిపించాల్సిందిగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రచారాన్ని ప్రారంభించారు.

ఇక్కడ వైసీపీ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా మాజీ ఎంపీ మిధున్ రెడ్డి పీలేరు నియోజకవర్గంపై దృష్టిపెట్టారు. వారంలో నాలుగురోజులు ఆయన పీలేరు నియోజకవర్గంలోనే పర్యటిస్తున్నారు. పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఈసారి పీలేరును సీరియస్ గా తీసుకుంది. నల్లారి కుటుంబాన్ని ఈ ఎన్నికల్లో ఓడించగలిగితే రాజకీయంగా తమకు ఎదురేలేదని భావిస్తుంది. అందుకు అనుగుణంగానే ఇప్పటి నుంచే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిధున్ రెడ్డి ప్రత్యేకంగా పీలేరుపైనే దృష్టి కేంద్రీకరించారు. అన్ని వర్గాల వారినీ కలుస్తూ అన్న ఒక పార్టీ, తమ్ముడు ఒక పార్టీలో ఉండి ప్రజలను మోసం చేస్తున్నారన్న ప్రచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళుతున్నారు.

ఇక సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ,పెద్దిరెడ్డి సన్నిహితుడు చింతల రామచంద్రారెడ్డి మరోసారి గెలిచేందుకు ఇప్పటికే గడపగడపకు వైసీపీ పేరుతో ఒకసారి నియోజకవర్గాన్ని చుట్టేశారు. మరో విడత పర్యటనకు ఆయన సిద్ధం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్ధి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో 15 వేల ఓట్ల పైచిలుకు ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్ధి చింతల రామచంద్రారెడ్డి గెలిచారు. ఇక్కడ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మూడో స్థానానికే పరిమితమయ్యారు.

ఇక కాంగ్రెస్ పార్టీలో చేరిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే రెండు సార్లు పీలేరులో పర్యటించడం విశేషం. పీలేరులో ఎటువంటి కార్యక్రమాలకు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హాజరుకాకపోయినప్పటికీ తన సన్నిహితులు, అభిమానులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఇటు తమ్ముడికి మద్దతివ్వమని బహిరంగంగా చెప్పకపోయినా, భవిష్యత్తులో టీడీపీ, కాంగ్రెస్ పొత్తు ఉంటుందనేది దాదాపు ఖాయమవ్వడంతో ఆయన ప్రస్తుతానికి మౌనంగానే ఉన్నారు. నల్లారి రెండుసార్లు వచ్చినా సోదరుడిని కలవకపోవడం విశేషం. ఇలా పీలేరు ఇప్పటినుంచే రాజకీయాలు ఊపందుకున్నాయి. రెండు ప్రధాన పార్టీలూ పోటా పోటీగా ప్రచారాన్ని ప్రారంభించాయి. మరి ఎన్నికల నాటికి ఓటర్లు ఎవరివైపు ఉంటారో తెలియదుకాని పీలేరులో ఇప్పుడే ఎన్నికల వేడి మొదలయింది.