Home News Politics

తెలుగు ఓట‌రూ…నువ్వెటు?

క‌న్న‌డ‌నాట తెలుగోళ్ల చుట్టే రాజ‌కీయం

జ‌రిగేదేమో క‌ర్ణాట‌క రాష్ట్ర ఎన్నిక‌లు. కానీ అంద‌రిచూపూ తెలుగువాళ్ల‌పైనే. ఎందుకంటే క‌న్న‌డ‌నాట ఫ‌లితాల‌ను శాసించే స్థాయిలో ఉన్నారు అక్క‌డి తెలుగుఓట‌ర్లు. పైగా ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాద‌నే అంచ‌నాలు, హంగ్ త‌ప్ప‌ద‌నే జోస్యాల‌తో క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో తెలుగు ఓట‌ర్లే అన్ని పార్టీల‌కు కీల‌క‌మైపోయారు. అందులో…ఏపీకి కేంద్రం అన్యాయం చేసింద‌న్న ప్ర‌చారంతో క‌న్న‌డ‌నాట తెలుగు ఓట‌ర్లు ఎలా స్పందిస్తార‌న్న ఉత్కంఠ పెరుగుతోంది. ఏపీనుంచి వివిధ పార్టీల నేత‌లు ప్ర‌చారంలో దిగ‌టంతో క‌ర్ణాట‌క ప్ర‌చారంలో తెలుగుద‌నం ఉట్టిప‌డుతోంది.

క‌ర్ణాట‌క‌లో క‌చ్చితంగా రాబోయేది హంగ్ ప్ర‌భుత్వ‌మే. ఒక‌టి రెండుశాతం ఓట్లు గెలుపోటుముల్ని నిర్దేశించేలా ఉన్నాయి. అందుకే సంఖ్యాప‌రంగా నేత‌ల త‌ల‌రాత‌ల్ని శాసించే స్థాయిలో ఉన్న తెలుగు ఓట‌ర్ల చుట్టూ పార్టీలు ప్ర‌ద‌క్షిణాలు చేస్తున్నాయి. క‌ర్ణాట‌క‌లో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 15శాతం పైనే. క‌న్న‌డ‌, ఉర్దూల త‌ర్వాత క‌న్న‌డ‌నాట ఎక్కువ‌మంది మాట్లాడేది తెలుగే. దాదాపుగా 45 నుంచి 50 స్థానాల్లో అక్క‌డ స్థిర‌ప‌డ్డ తెలుగు ప్ర‌జ‌ల ఓట్లే కీల‌కం కాబోతున్నాయి.

కేవ‌లం క‌ర్ణాట‌క రాష్ట్ర రాజ‌ధాని బెంగ‌ళూరులోనే దాదాపు 25ల‌క్ష‌ల‌మంది తెలుగు ఓట‌ర్లున్నారు. న‌గ‌రంలోని 28 సీట్ల‌లో వీరే నిర్ణేత‌లు. 12 జిల్లాల్లో తెలుగువారి ఎఫెక్ట్ క‌ర్ణాట‌క నేత‌ల భ‌విత‌వ్యాన్ని నిర్దేశించ‌బోతోంది. బెంగ‌ళూరు న‌గ‌రంతో పాటు బెంగ‌ళూరు రూర‌ల్‌, తుముకూరు, చిత్రదుర్గ, బీదర్, బళ్లారి, కొప్పల్, రాయచూర్, కలబురిగి, యాద్‌గిర్, కోలార్, చిక్‌బళ్లాపూర్‌లలో తెలుగువారి సంఖ్య ఎక్కువ‌. బీదర్, కలబురిగి, కోలార్, బళ్లారిలలో 30 శాతం మంది తెలుగు ఓటర్లే. కోలార్‌లో 76 శాతం, బెంగళూరు రూరల్‌లో 65 శాతం, రాయచూర్‌లో 64 శాతం, బళ్లారిలో 63 శాతం మంది తెలుగువారే.

కేంద్రంపై స‌మ‌ర‌శంఖం పూరించిన టీడీపీ మోడీకి వ్య‌తిరేకంగా నేత‌ల్ని, సంఘాల్ని క‌ర్ణాట‌క‌లో దించింది. వారు జేడీఎస్‌కి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. త‌న‌కు మ‌ద్ద‌తివ్వాల్సిందిగా ఇప్ప‌టికే సీఎం సిద్ధ‌రామ‌య్య తెలుగు ప్ర‌జ‌ల్ని కోరారు. ఏపీ ప‌రిణామాలు క‌న్న‌డ‌నాట ప్ర‌భావం చూప‌కుండా బీజేపీ జాగ్ర‌త్త‌ప‌డుతోంది. మ‌రోవైపు కేవ‌లం ఏపీకి అన్యాయం జ‌రిగింద‌నే కారణంతో క‌న్న‌డ‌నాట తెలుగు ప్ర‌జ‌లంతా బీజేపీకి వ్య‌తిరేక‌మ‌య్యే ప‌రిస్థిత‌యితే లేదు. ఎన్నో ఏళ్లుగా అక్క‌డ స్థిర‌ప‌డిపోయిన తెలుగువారికి ఎవ‌రి జెండా వారికుంది, ఎవ‌రి ఎజెండా వారికుంది. అందుకే తెలుగు ప్ర‌జ‌ల మీటింగుల్లో అభిప్రాయ‌భేదాలు త‌లెత్తుతున్నాయి.