Home News Politics

పెద్దాపురంలో గెలుపెవరిది…?

SHARE

ఒకవైపు ఉపముఖ్యమంత్రి…మరోవైపు ఎంపీ భార్య! ఇద్దరూ కాపులే. ఇద్దరూ స్థానికేతరులే! ఇదీ తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో పరిస్థితి. అభ్యర్థుల గెలుపులో గత నాలుగు దశాబ్దాలుగా బీసీలు, ఎస్సీలు, కమ్మలు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో పెద్దాపురంలో ‘బిగ్‌ ఫైట్‌’ జరగనుంది.

పెద్దాపురంలో టీడీపీ అభ్యర్థి, ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో నిన్నమొన్నటిదాకా కలిసి పనిచేసిన కాకినాడ టీడీపీ ఎంపీ తోట నరసింహం భార్య తోట వాణి వైసీపీ తరఫున బరిలో నిలవడమే దీనికి కారణం. ఆమె టీడీపీ దివంగత సీనియర్‌ నేత మెట్ల సత్యనారాయణరావు కుమార్తె కూడా. చినరాజప్ప, వాణి ఇద్దరూ ఇక్కడ స్థానికేతరులే. చినరాజప్ప అమలాపురానికి చెందినవారు. 2014 ఎన్నికల్లో పెద్దాపురం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. నియోజకవర్గంలో మున్నెన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని నమ్మకంగా ఉన్నారు. ఇక రాజకీయ కుటుంబ నేపథ్యం, బంధుత్వాలు, రాజప్పపై టీడీపీలో ఉన్న అసమ్మతి తన విజయానికి దోహదపడతాయని తోట వాణి ఆశాభావంతో ఉన్నారు.

రాజప్ప, వాణి ఒకే సామాజికవర్గం వారు కావడంతో పోటీ రసవత్తరంగా మారింది. నరసింహం జగ్గంపేట నియోజకవర్గానికి చెందినవారు. 2004, 09లో ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ తరఫున గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో టీడీపీలోకి వచ్చారు. చంద్రబాబు 2014 ఎన్నికల్లో కాకినాడ లోక్‌సభ టికెట్‌ ఇచ్చారు. అక్కడ గెలిచాక టీడీపీ లోక్‌సభాపక్ష నేతగా నియమించారు. అనారోగ్యం కారణంగా నరసింహం ఈసారి లోక్‌సభకు పోటీచేయలేనని.. తన భార్యకు జగ్గంపేట అసెంబ్లీ టికెట్‌ ఇవ్వాలని చంద్రబాబును కోరారు. అక్కడ జ్యోతుల నెహ్రూ బరిలో ఉండడంతో చంద్రబాబు నిస్సహాయత వ్యక్తంచేశారు. వైసీపీలో చేరినా నరసింహానికి జగ్గంపేట దక్కలేదు.నియోజకవర్గంలో ప్రభావం చూపగల టీడీపీ నేత బొడ్డు భాస్కర రామారావు సహకారం చినరాజప్పకి ఎంత అన్నది ఇక్కడ ఆసక్తికరంగా ఉంది.

పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట, పెద్దాపురం మునిసిపాలిటీలు, రెండు రూరల్‌ మండలాలకు విస్తరించి ఉంది. 1983 నుంచి 2014 వరకు జరిగిన 8 అసెంబ్లీ ఎన్నికల్లో ఏడుసార్లు పెద్దాపురంలో టీడీపీ తరఫున కమ్మ సామాజికవర్గం వారే పోటీ చేశారు. 2014 ఎన్నికల ముందు కుల సమీకరణల్లో స్థానికేతరుడైన చినరాజప్పను కోనసీమ నుంచి తెచ్చి పోటీకి పెట్టారు. నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లలో 3 వంతులకు పైగా బీసీలే ఉన్నారు. చినరాజప్ప హయాంలో అభివృద్ధి పనులు జరిగాయి. ఇక్కడ మొత్తం ఓటర్లు 1,98,360 ఉండగా బీసీలు 57,508, కాపు 48,856, ఎస్సీలు 32,034, కమ్మ 22,626 మంది ఓటర్లుగా ఉన్నారు. చినరాజప్ప ఉపముఖ్యమంత్రి పదవిలో ఉండడం. బాబు, లోకేశ్‌లతో సాన్నిహిత్యంవివాదరహితుడు.. ఆర్థికంగా బలమైన నేపథ్యం ఉండటం ఆయనకు ప్లస్ గా మారింది. వివాదాస్పద అసైన్డ్‌ భూముల్లో అక్రమ మైనింగ్‌ ఆరోపణలు పార్టీలో వివాదాలను సమన్వయం చేసుకోలేకపోవడం. సోదరుడు జనసేనలో చేరడం ఆయనకు మైనస్ గా మారింది.

ఇక వైసీపీ అభ్యర్ధి తోట వాణి దశాబ్దాలుగా రాజకీయ కుటుంబ నేపథ్యం, అందరితోనూ స్నేహంగా మెలగడం పెద్దాపురంలో బంధుత్వాల బలం ,భర్త అనారోగ్యం సానుభూతిగా మారడం అనుకూలంగా ఉన్నాయి. డిప్యూటీ సీఎంని ఢీకొట్టాల్సి రావడం, ఖర్చుకు వెనుకంజ,బలమైన నాయకుల మద్దతు లేకపోవడం కొంత మైనస్ గా మారింది. ఏదిఏమైన ఈసారి పెద్దపురంలో బిగ్ ఫైట్ జరగనుంది.