Home News Stories

పెద్దకూరపాడులో పై చెయ్యి ఎవరిది…?

గుంటూరు జిల్లాలో కీలక నియోజ‌క‌వ‌ర్గం పెద్దకూర‌పాడు. గతంలో కాంగ్రెస్ కి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం పునర్విభజనతో 2009 నుంచి టీడీపీకి అడ్డగా మారింది. ఇక్కడ వరసగా రెండు సార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు కొమ్మాలపాటి శ్రీధర్. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా కన్నాలక్ష్మీనారాయణ వరుసగా 5 సార్లు గెలుపొందారు. ఇక నియోజకవర్గంలో పట్టుకోసం పాకులాడుతుంది విపక్ష వైసీపీ. ఈ నియోజకవర్గం పై పార్టీ అధినేతస్థాయిలో ఫ్యూహాలు రచిస్తూ పట్టుసాధించే ప్రయత్నం చేస్తుంది.అయితే కుల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండే ఈ నియోజ‌కవ‌ర్గం ఎన్నిక ఈ సారి ఆసక్తి పెంచుతుంది. పెదకూరపాడు నియోజకవర్గ పొలిటికల్ సినారియో పై తెలుగు పాపులర్ టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్….

రెండు వ‌రుస విజ‌యాల‌తో నియోజకవర్గంలో మంచి స్వింగ్ లో ఉన్నారు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్. 2009, 2014 ఎన్నిక‌ల్లో భారీ విజయాలు నమోదు చేసిన టీడీపీ ఎమ్మెల్యే పై ప్రత్యేక దృష్టి పెట్టింది వైసీపీ. గ‌త సంవ‌త్స‌ర కాలంగా ఈ నియోజ‌క‌వ‌ర్గంపై ఎప్ప‌టిక‌ప్పుడు జ‌గ‌న్‌స్థాయిలో వ్యూహాలు రూపొందినట్లు స‌మాచారం. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ కొమ్మాల‌పాటిపై పోటీ చేసి ఓడిపోయిన బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు ప్ర‌స్తుతం వినుకొండలో పోటీకి రెడీ అవుతున్నారు. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లంగా ఉన్న క‌మ్మ సామాజికి వ‌ర్గానికి చెందిన నేత‌ను నిల‌బెట్టాల‌ని వైసీపీ అధిష్ఠానానికి ఫిర్యాదులు వెళ్ల‌డంతో కొంత‌కాలం క్రిత‌మే తాటికొండ నియోజ‌క‌వ‌ర్గం తుళ్లూరు మండ‌లం పెద్ద‌పరిమి గ్రామానికి చెందిన రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి నంబూరి శంక‌ర్‌రావును బ‌రిలో నిలిపేందుకు ప్లాన్ చేసింది విపక్ష వైసీపీ.

2014 ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు వినుకొండ నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లిపోయారు. అప్ప‌టి నుంచి నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌ల‌ను మూడేళ్ల‌పాటు గుంటూరు మాజీ కార్పోరేట‌ర్, కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌నోహ‌ర్‌నాయుడుకు అప్పగించారు. దాదాపు మూడేళ్లుగా పార్టీ కోసం అన్నీతానై ప‌నిచేశాడు కావటి మనోహర్.వ‌చ్చే ఎన్నికల్లో ఆయ‌న పోటీ చేస్తార‌ని చాలామంది నాయ‌కులు భావించారు. అయితే అనుహ్యంగా క‌మ్మ సామాజిక వ‌ర్గం నేత‌ను నిల‌బెడితేనే ఇక్క‌డి విజ‌యం సాధించ‌గ‌ల‌మ‌ని కొంత‌మంది నేత‌లు పేర్కొన‌డంతో అధిష్టానం ఆమేర‌కు నంబూరి వైపు మొగ్గు చూపి బాధ్య‌త‌లు అప్ప‌గించింది. వాస్త‌వానికి ఇదే ఇప్పుడు ఆ పార్టీకి న‌ష్టం చేకూర్చేలా ఉంది. మూడేళ్లు క‌ష్ట‌ప‌డి పార్టీ కోసం ప‌నిచేసిన మ‌నోహ‌ర్‌నాయుడును కాద‌ని..నంబూరికి టికెట్ ఇస్తుండ‌టంపై సొంత పార్టీ కార్య‌క‌ర్త‌ల నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోందంట‌.

క‌మ్మ వ‌ర్గానికి పెద్ద పీట వేయ‌డం కొన్ని ఈక్వేష‌న్ల ప‌రంగా క‌రెక్ట్‌గా ఉన్నా నిన్న‌టి వ‌ర‌కు కావ‌టి వెంట ఉన్న కాపులు పార్టీకి ఎదురు తిర‌గ‌డంతో పాటు నంబూరిను ఓడిస్తామ‌ని శ‌ప‌థాలు చేస్తున్నారు. ఇక ఇక్క‌డ నుంచి జ‌న‌సేన కూడా పోటీ చేయ‌నున్న నేప‌థ్యంలో కాపులు ఓట్లు బ‌లంగా చీల‌నున్నాయి. ఈ ప‌రిణామాల‌న్నీ కూడా ఓటు బ్యాంకు బ‌లంగా క‌నిపిస్తున్న కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్‌కు అనుకూలంగా మారుతోంద‌న్న వాద‌న‌ను రాజకీయ విశ్లేష‌కులు వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే రెండుసార్లు గెలిచిన కొమ్మాల‌పాటి హ్యాట్రిక్ కొడ‌తాన‌న్న ధీమాతో ఉన్నారు. ఆయ‌న‌పై సొంత పార్టీలో అసంతృప్తులు, అల‌క‌లు ఉన్నా విప‌క్షంలో అంత‌కుమించిన అస‌మ్మ‌తి ఉండ‌డం ఆయ‌న‌కు ఏమేరకు కలసిరానుందన్నది తెలియాల్సి ఉంది.

రెండు నెలల్లో జరగనున్న ఎన్నిక‌ల వేళ ఇక్కడి ప‌రిణామాలు ఎలా మార‌తాయో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.