Home News Politics

లింగాయ‌త్‌ల ఓట్లు ఎవ‌రికి?

చివ‌ర్లో బీజేపీ చ‌క్రం తిప్పేసిందా?

లింగాయత్‌లను ప్రత్యేక మతంగా గుర్తిస్తూ తీర్మానం చేయ‌డంలోనే దూరాలోచ‌న దాగుంది. క‌ర్ణాట‌క‌లో బీజేపీకి కీల‌క ఓటుబ్యాంక్‌ని దూరం చేసేందుకు ముంద‌స్తుగానే మాస్ట‌ర్ ప్లాన్ వేశారు సీఎం సిద్ధ‌రామ‌య్య‌. రాష్ట్రంలోని దాదాపు స‌గానికి పైగా నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపోట‌ముల్ని ప్ర‌భావితం చేయ‌గ‌ల లింగాయ‌త్‌ల‌కు గాల‌మేసేందుకు వారిని ప్ర‌త్యేక మ‌తంగా గుర్తిస్తూ తీర్మానం చేశారు. తెలివిగా బంతిని కేంద్ర‌ప్ర‌భుత్వ కోర్టులోకి నెట్టేశారు. త‌మ వైపునుంచి అంతా చేశామ‌ని..ఇక చేయాల్సింది కేంద్ర‌మేన‌ని బీజేపీని ఇర‌కాటంలో ప‌డేయొచ్చ‌నేది క‌న్న‌డ‌నాట కాంగ్రెస్ ప్లాన్‌.

మొద‌ట్లో లింగాయ‌త్‌లు కాంగ్రెస్‌వైపు మొగ్గిన‌ట్లే ఉన్నా చివ‌ర్లో సీన్ మారిన‌ట్లే క‌నిపిస్తోంది. కర్నాటక జనాభాలో 20శాతం ఉన్న లింగాయత్‌లు 120సీట్లలో అభ్యర్థుల గెలుపోటముల్ని ప్రభావితం చేయ‌గ‌ల‌రు. అంటే వాళ్ల ఆశీస్సులుంటే అధికార‌పీఠాన్ని అల‌వోక‌గా ఎక్కేయొచ్చ‌న్న‌మాట‌. అందుకే య‌డ్యూర‌ప్ప మీద వ్య‌క్తిగ‌తంగా అసంతృప్తి ఉన్నా, ఆయ‌న బ్యాక్‌గ్రౌండ్ బాగా లేక‌పోయినా బీజేపీ సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌కటించింది. లింగాయ‌త్ వ‌ర్గానికి చెందిన యడ్యూరప్ప 2013లో ప్రత్యేకంగా పార్టీ పెట్ట‌ట‌మే బీజేపీ సంప్ర‌దాయిక ఓటు బ్యాంక్‌కి గండికొట్టింది. లింగాయత్‌లంతా అప్ప‌ట్లో కాంగ్రెస్ వైపు మొగ్గ‌టంతో ఆ పార్టీ సులువుగా గెలిచింది.

మ‌ళ్లీ ఎన్నిక‌ల‌నాటికి స‌మీక‌ర‌ణాలు మారిపోయాయి. య‌డ్యూర‌ప్ప బీజేపీలోకి రావ‌డం, ఆయ‌న్నే ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా పార్టీ ప్ర‌క‌టించ‌టంతో లింగాయ‌త్ వ‌ర్గం ఈసారి త‌మ‌వైపేన‌న్న అంచ‌నాల్లో ఉంది క‌మ‌ల‌ద‌ళం. సిద్ధ‌రామ‌య్య వ్యూహంతో మొద‌ట్లో కాస్త కంగారుప‌డ్డా త‌ర్వాత వాతావ‌ర‌ణాన్ని త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకోవ‌డంలో బీజేపీ నెగ్గుకొచ్చిన‌ట్లే క‌నిపిస్తోంది. మ‌తం హోదాపై ఏమీ చెప్ప‌కుండానే మ‌ఠాధిప‌తుల‌ని మెప్పించేందుకు బీజేపీ చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించిన‌ట్లే ఉంది.

లింగాయ‌త్‌లు మ‌ఠాధిప‌తుల మాట జ‌వ‌దాట‌రు. లింగాయత్‌లలో ఒకరిద్దరు మఠాధిపతులు కాంగ్రెస్‌కు ఓటు వేయాలని సూచించారు. తుముకూరు సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామితోపాటు మిగతా వారు ఇప్పటి వరకూ ఎటూ తేల్చలేదు. వారంతా త‌మ‌కు అనుకూల‌మ‌నే న‌మ్ముతోంది బీజేపీ. మ‌ఠాధిప‌తుల్ని ఒప్పించ‌డంలో త‌న పాత్ర‌ను స‌మ‌ర్ధంగా పోషించ‌బ‌ట్టే..130 సీట్ల‌తో బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని అమిత్‌షా అంత న‌మ్మ‌కంగా చెబుతున్నారు. అయితే ఎవ‌రి నమ్మ‌కం నిలుస్తుంది? లింగాయ‌త్‌ల బ‌లం ఎవ‌రిని గెలిపిస్తుంద‌నేది మాత్రం ఫ‌లితాలొచ్చాకే తెలుస్తుంది.