Home News Politics

పరకాల బరిలో నిలిచి గెలిచేదెవరు…

SHARE

ఇక్కడ అంతా కూల్‌గా సాగిపోతుందనుకున్న రాజకీయం.. హఠాత్తుగా వేడెక్కింది. అధికార పార్టీ తరపున సీటు ఖాయం అనుకున్న తరుణంలో.. టికెట్ రాకపోవటం షాకిచ్చింది. దీంతో ఆమె పార్టీకి గుడ్‌బై చెబుతూ రివర్స్ షాక్ ఇచ్చారు. కారు దిగి హస్తం కండువా కప్పుకున్నారు. అంతటితో ఆగకుండా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆయన కుమారుడు కేటీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. పరకాల బరిలో దిగిన కొండా సురేఖను ఓడించేందుకు టీఆర్ఎస్ నాయకత్వం సర్వశక్తుల్ని మోహరించింది. పరకాలలో చల్లా వ్యూహాల్ని ఎదుర్కొని.. కొండా దంపతుల జండా ఎగరేయగలరా?

ఉమ్మడి వరంగల్ జిల్లాలో.. మరే నియోజకవర్గంలోనూ లేని రాజకీయం పరకాలలో నడుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల కంటే… అసెంబ్లీ రద్దు తర్వాత జరిగిన వ్యవహారాలు నియోజకవర్గ రాజకీయాల్ని ఊహించని రీతిలో మార్చేశాయి. మాజీ మంత్రి కొండా సురేఖకు తొలి జాబితాలో టికెట్ రాకపోవడంతో టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. కాంగ్రెస్‌లో చేరి పరకాల నుంచి పోటీకి దిగారు. టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన సమయంలో కేసీఆర్, కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ఆమె రాసిన బహిరంగ లేఖ, చేసిన విమర్శలు సంచలనం రేపాయి. దీంతో కొండా సురేఖ కారు పార్టీ హిట్‌లిస్ట్‌లో చేరారు…

పరకాల నియోజక వర్గంలో పరకాల, ఆత్మకూరు, గీసుకొండ, సంగెం నడికుండ.. దామెర మండలాలున్నాయి. నియోజకవర్గంలో 1,94, 983 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుష ఓటర్లు 97,450 మంది. 97, 533 మంది మహిళా ఓటర్లున్నారు. ఈసారి 12131 మంది కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. అభ్యర్థుల జయాపజయాలు నిర్ణయించే స్థాయిలో ఉంది నియోజకవర్గంలో బీసీ ఓటు బ్యాంక్. మొత్తం ఓటర్లలో 50 శాతం మంది బీసీలు. 25శాతం ఎస్సీ, పది శాతం ఎస్టీ. పది శాతం ఓసీ ఓటర్లున్నారు.

2014లో టీడీపీ నుంచి గెలుపొందిన చల్లా ధర్మారెడ్డి.. తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం టీఆర్ఎస్ తరపున పోటీ పడుతున్నారు. పరకాల లో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న కొండా సురేఖ.. నిన్న మొన్నటి వరకూ టీఆర్ఎస్‌లోనే ఉన్నారు. 2014లో వరంగల్ ఈస్ట్ నుంచి ఆమె టీఆర్ఎస్ టికెట్ మీద గెలిచారు. కేసీఆర్ ప్రకటించిన తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆగ్రహం చెందిన కొండా దంపతులు టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి సొంత గూటికి చేరారు. ఆమె ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఉంది టీఆర్ఎస్ నాయకత్వం. ఈసారి టీడీపీ- కాంగ్రెస్‌ కలిసి పోటీ చేస్తూ ఉండటం తనకు కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు కొండా సురేఖ. కాంగ్రెసు, టీడీపి ఓట్లను కలిపితే గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి పోలైన ఓట్ల కన్నా ఎక్కువ వస్తాయనేది ఆమె ధీమా.

టీడీపీలో గెలిచి టీఆర్ఎస్‌లోచేరిన చల్లా ధర్మారెడ్డికి నియోజకవర్గంలో మంచి పేరుంది. టీడీపీ క్యాడర్‌ను ఆయన కాపాడుకున్నారని.. తనతోనే ఉంచుకున్నారని టాక్. పరకాల పంచాయతీని పురపాలక సంఘంగా మార్చడం, రెవెన్యూ డివిజన్ ను తిరిగి సాధించడం తన విజయానికి దోహదం చేస్తాయనే విశ్వాసంతో ఉన్నారాయన. 1200 కోట్ల రూపాయలతో మెగా టెక్స్ టైల్ పరిశ్రమకు శంకుస్థాపన చేయడం, 1500 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం, 120 గ్రామాలకు మిషన్ భగీరథ నీరు అందించడం తనకు కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు.

గతంలో సాధించిన విజయాలు, స్థిరమైన ఓటు బ్యాంక్ ఉండటంతో బీజేపీ కూడా పరకాల సీటుపై ఆశలు పెట్టుకుంది. గతంలో ఈసీటులో బీజేపీ, భారతీయజనసంఘ్ గెలిచాయి. బీజేపీ తరపున విజయచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ముందే ఖరారు చేయడంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గం మీద ఆయనకు పట్టుంది. మోడీ ప్రవేశ పెట్టిన పథకాలు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు తనకు కలిసి వస్తాయని అంటున్నారాయన

కొండా సురేఖ పరకాలకు రావడంతో… ఈ నియోజకవర్గం హాట్ సీట్‌గా మారింది. గత ఎన్నికల్లో ఆమె వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి గెలిచినా… అంతకుముందు పరకాల ఎమ్మెల్యేగా పనిచేశారు. నియోజకవర్గంలోని పరకాల, గీసుగొండ, ఆత్మకూరు, సంగెం మండలాల్లో కొండా కుటుంబానికి మంచి పట్టుంది. కొండా వరంగల్‌ తూర్పుకు వెళ్లిపోయాక వారి అనుచరగణం తప్పనిసరి పరిస్థితుల్లో టీఆర్‌ ఎస్‌ లోకి వెళ్లింది. ఇప్పుడు కొండా తిరిగి రావడంతో పరిస్థితులు మారుతున్నాయి. పాత మిత్రులు అనుచరగణం తిరిగి కొండాతో కలుస్తున్నారు. ఇక సురేఖను పరకాల నియోజకవర్గంలో చాలామంది మహిళలు తమ ఇంటి ఆడపడుచుగా చూస్తుంటారు…

కొండా సురేఖ పరకాలలో పోటీకి దిగిన తర్వాత.. స్థానికంగా పరిస్థితులు, సమీకరణలు మారాయి. హైకమాండ్ ఆశీస్సులతో చల్లా కూడా ఏ మాత్రం తీసిపోని రీతిలో పోటీ పడుతున్నారు. దీంతో నియోజకవర్గ ఓటర్లు ఈసారి ఎలాంటి తీర్పు ఇస్తారా అనే దానిపై ఆసక్తి ఏర్పడింది..