Home News Stories

పాలమూరు గులాబీలో అసమ్మతి గుబులు….!

SHARE

ఒక వైపు గులాబీ పార్టి అభ్యర్దుల ప్రచార హోరు, మ‌రో ప‌క్క అసంతృప్తుల అస‌మ్మతి స‌భ‌లతో మహబూబ్‌నగర్‌ జిల్లా టిఆర్‌ఎస్‌లో ఒకింత గందరగోళ వాతావరణం కనిపిస్తోంది… ముఖ్యంగా రెండు సెగ్మెంట్లలో రెబల్స్‌గా పోటీ చేయడానికి సిద్దమయ్యారు టికెట్‌ ఆశించి భంగపడ్డ గులాబీ నేతలు … ఇక మరో ఒక‌టి రెండు నియోజ‌క వ‌ర్గాల్లో అస‌మ్మతి చ‌ల్లారిన‌ట్లు క‌నిపించినా .. చివ‌రి వ‌ర‌కు క‌లిసివస్తారా అన్న అనుమానం అభ్యర్ధుల్లో గుబులు రేపుతోంది..

టీఆర్‌ఎస్‌ ముందస్తు ఎన్నిక‌ల‌కు అభ్యర్దులను ప్రకటించిన వెంటనే … మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మ‌క్తల్, షాద్ న‌గ‌ర్ , క‌ల్వకుర్తి, అచ్చంపేట‌, అలంపూర్ నియోజ‌క వ‌ర్గాల్లో అస‌మ్మతి సెగలు రాజుకున్నాయి… గులాబీ పార్టీ పెద్దలు రంగంలోకి దిగి అచ్చంపేట‌, అలంపూర్ , క‌ల్వకుర్తి నియోజ‌క వ‌ర్గాల్లో అస‌మ్మతి రాగం స‌ద్దుమ‌ణిగేలా చేయగలిగారు.. షాద్‌న‌గ‌ర్ లో , మ‌క్తల్‌లో మాత్రం అసంతృప్తి నేతలు రెబల్స్‌గా పోటీకి సై అంటున్నారు …

షాద్ న‌గ‌ర్లో తాజా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాద‌వ్‌కే తిరిగి టికెట్‌ దక్కింది… అయితే అక్కడ అభ్యర్ది మార్పు ఖాయమని అని గ‌త కొంత‌కాలంగా ప్రచారం జరగడంతో అంజ‌య్య యాద‌వ్‌తో విభేదాలున్న టిఆర్ఎస్ నేతలు వీర్లప‌ల్లి శంకర్, అందె బాబ‌య్యలు టికెట్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు… ఆ క్రమంలో అందె బాబ‌య్య ను తమ దారిలోకి తెచ్చుకొని అస‌మ్మతి టీంలో చీలిక తేగలిగింది గులాబీ జిల్లా నాయ‌కత్వం… వీర్ల ప‌ల్లి శంక‌ర్ మాత్రం తాను బరిలో ఉంటానంటూ ఏర్పాట్లు చేసుకుంటున్నారు

మక్తల్‌లో టికెట్‌ దక్కించుకున్న తాజా మాజీ చిట్టెం రామ్మోహ‌న్ రెడ్డికి అసమ్మతి సెగలు గట్టిగానే తగులుతున్నాయి .. ఆయన అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తూ మ‌క్తల్ టిఆర్‌ఎస్‌ నేతలు గోపాల్ రెడ్డి , ఆశిరెడ్డి, జ‌లంధర్ రెడ్డి, సూర్యనారాయ‌ణగుప్తాలు … రామ్మోహ‌న్ రెడ్డికో హ‌టావో టిఆర్ఎస్ బ‌చావో అంటూ మండ‌లాల వారిగా అస‌మ్మతి స‌భ‌లు నిర్వహిస్తున్నారు .. ఇక్కడి అస‌మ్మతి చ‌ల్లార్చేందుకు ఆపధర్మ మంత్రి ల‌క్ష్మారెడ్డి, ఎంపి జితేంద‌ర్ రెడ్డి లు రంగంలోకి దిగినా ఫ‌లితం లేక పోయింది…

అంతకుముందు కేటిఆర్ తో భేటి అయినప్పడు అసంతృప్తి వాదులు సామాన్య కార్యక‌ర్తకు టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామ‌ని , రామ్మోహ‌న్ రెడ్డికి మాత్రం స‌హ‌క‌రించేది లేదని స్పష్టం చేసినట్లు సమాచారం.. ఆ క్రమంలో ఇటీవల కేటిఆర్ ప‌ర్యట‌న త‌రువాత మ‌క్తల్ లో అస‌మ్మతి చ‌ల్లారుతుంది అని భావించిన గులాబీ శ్రేణుల‌కు.. అస‌మ్మతి టీం జ‌లంద‌ర్ రెడ్డి పోటీలో ఉంటారని ప్రకటించి ఝలక్‌ ఇచ్చింది..మొత్తం మీద షాద్ న‌గ‌ర్ , మ‌క్తల్ నియోజ‌క వ‌ర్గాల్లో అస‌మ్మతి గులాబీ పార్టికి త‌ల‌నొప్పిగానే మారింద‌ని చెప్పవ‌చ్చు…