Home News Stories

ఆ మంత్రికి గెలుపు నల్లేరు పై నడకేనా…?

SHARE

సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని 14 శాసనసభ నియోజకవర్గాల్లో ప‌ల‌మ‌నేరుకి జిల్లాలో ప్రత్యేకస్థానం ఉంది. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రస్తుత భారీ ప‌రిశ్రమల శాఖ మంత్రి అమ‌ర్‌నాథ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009లో టీడీపీ నుంచి గెలిచిన ఆయన 2014 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరి తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మళ్ళీ కొద్ది రోజులకే సొంత గూటికి చేరారు. ఆ తర్వాత చంద్రబాబు మంత్రివర్గంలో భారీ ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2004 వరకు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా ఉన్న పలమనేరు నియోజకవర్గాల పునర్విభజనలో జనరల్ కేటగిరిలోకి మారింది. ఇక ప్రతిపక్ష వైసీపీకి ముగ్గురు నియోజకవర్గ ఇంచార్జులు మారి నాలుగో కృష్ణుడు తెర పైకి వచ్చాడు. ఎన్నికల వేళ పలమనేరు నియోజకవర్గంలోని రాజకీయం పై తెలుగుపాపులర్ టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్….

ముందు నుంచి నియోజకవర్గంలో టిడిపికి గట్టి పట్టుంది… గత ఎన్నికల్లో సీనియర్ నాయకుడు , ఎన్నికల మేనేజ్‌మెంట్ తెలిసిన అమర్‌నాథ్ రెడ్డి కూడా వైసిపి అభ్యర్ధిగా పోటీ చేసి ..కేవలం మూడు వేల లోపు ఓట్లతో బయటపడ్డాడు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక అమర్ నాథరెడ్డి కుటుంబానికి టీడీపీతో మంచి అనుబంధం ఉంది. అమ‌ర్‌నాథ్‌రెడ్డి తండ్రి రామ‌కృష్ణారెడ్డి టీడీపీ నుంచి లోక్‌స‌భ అభ్యర్థిగా పోటీ చేసి ప‌లుమార్లు గెలిచారు. 2014 ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలోకి వెళ్లిన అమ‌ర్‌నాథ్‌రెడ్డి టీడీపీ నుంచి బ‌రిలో ఉన్న సుభాష్‌చంద్రబోస్‌పై గెలిచారు. ఆ త‌ర్వాత వైసీపీలో పొస‌గ‌క‌పోవ‌డం..అధికారం టీడీపీ చేతిలో ఉండ‌టం వంటి అంశాలు ఆయ‌న్ను సొంత గూటికి చేరుకునేలా చేశాయ‌ని చెప్పాలి. ఇక ప్రస్తుత ఎన్నిక‌ల విష‌యానికి వస్తే…ఈ సారి టీడీపీ నుంచి ఆయ‌న‌కు టికెట్ క‌న్ఫ‌ర్మ్ అయ్యింది.

చంద్రబాబు సొంత జిల్లా కావ‌డంతో సాధార‌ణంగానే ఆయ‌న ప్రభావం ప‌ల‌మ‌నేరుపై కాస్త ఎక్కువే అని చెప్పాలి. గ‌తంలో కుప్పంలో ఉన్న కొన్ని మండ‌లాలు ప‌ల‌మ‌నేరులోకి వెళ్లడంతో ఇక్కడ టీడీపీకి చాలా ప్లస్ కానుంది. గ‌తేడాది వైసీపీ నుంచి విజ‌యం సాధించిన అమ‌ర్‌నాథ్‌రెడ్డిని ఎలాగైనా ఈసారి మ‌ట్టిక‌రిపించాల‌ని వైసీపీ శ్రేణులు గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉండ‌గా…అభివృద్ధి జ‌రిగిన ధీమా..చంద్రబాబు అండ‌తో అమ‌ర్‌నాథ్‌రెడ్డే బ‌లంగా క‌నిపిస్తున్నారు. అయితే వైసీపీ నుంచి బ‌ల‌మైన ప్రత్యర్థి లేక‌పోవ‌డం ఆయ‌న‌కు క‌ల‌సి వ‌చ్చే అంశం.

వైసీపీ నుంచి అభ్యర్ధిగా వెంక‌ట్‌గౌడ్ పేరు వినిపిస్తోంది. వెంక‌ట్‌గౌడ్ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వయ‌క‌ర్తగా వ్యవ‌హ‌రిస్తున్నారు. అమర్‌నాథ్‌రెడ్డి పార్టీ మారిన తర్వాత నియోజవవర్గ కేంద్రంలో భారీ బహిరంగ సభను నిర్వహించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గ వైసీపీ బాధ్యతలను తాను పర్యవేక్షిస్తానని వెల్లడించారు .. అప్పట్లో బిల్డర్ రాకెష్‌రెడ్డికి ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు అప్పగించారు… పార్టీ కార్యక్రమాలను రాకేష్‌ కొద్ది రోజుల పాటు నిర్వహించారు… ఇదే సమయంలో ఆకుల గజేంద్ర అనే నాయకుడు రంగప్రవేశం చేసారు.. సెగ్మెంట్లో తన సామాజిక వర్గం ఓట్లు ఎక్కువుగా ఉన్నాయని… ఈ సారి తానే అభ్యర్ధినని హడావుడి చేశారు.

నియోజకవర్గంలోని వీ కోట మండలానికి చెందిన వెంకటగౌడ్ ఓ ఎన్జీఓ ద్వారా ప్రజలకు చేరువై ఆ తర్వాత వైసీపీలో చేరారు. మధ్యలో వైసీపీలో పవన్ కూమార్ రెడ్డి తెరపైకి వచ్చారు .. నియోజకవర్గ వర్గంలో ఓ గ్రూపును మెయిన్ టెయిన్ చేసే పనిలో ఉన్నారు పవన్.. దీంతో ఇప్పుడు ఎవరు ఇంచార్జో, ఎవరు ఎన్నికల బరిలో వుంటారో తెలియని స్థితిలో ద్వీతీయ శ్రేణి నాయకులు కొట్టుమిట్టాడాల్సి వస్తోందంట… హాడావుడి చేస్తున్న ప్రతి నాయకుడు తమకు పెద్దాయన అశీస్సులు వున్నాయంటు పెద్దిరెడ్డి పేరు ను చెబుతున్నారని కార్యకర్తలు అవేదన చెందుతున్నారు.

ఇక నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపు 2ల‌క్షల‌47వేల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. ఇందులో బీసీలు, వెల‌మ వ‌ర్గ ఓటర్లు అధిక‌మ‌నే చెప్పాలి. జ‌న‌సేన ఇక్కడ పెద్దగా బ‌లంగా లేదు. ఇక కాంగ్రెస్ నుంచి ప్రముఖ పారిశ్రామిక వేత్త పార్థసార‌థి బ‌రిలో ఉండ‌నున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి కృష్ణమూర్తిరెడ్డి పోటీకి నిల‌బ‌డుతున్నట్లు స‌మాచారం. కానీ పోటీ మాత్రం వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ అన్నట్లుగానే ఉండ‌నుంది.