Home Entertainment

బాబోయ్ బాల‌య్య‌తోనా?

తేజ్ సేఫ్‌..రిస్క్ తీసుకునేదెవ‌రు?

SHARE
Boyapati Balayya at NTR Biopic Launch
Boyapati Balayya at NTR Biopic Launch

బాల‌య్య జోలికెళ్తే ప్ల‌గ్గులో వేలుపెట్టిన‌ట్లేన‌ని ఇండ‌స్ట్రీలో అంద‌రికీ తెలుసు. ఎందుకంటే ఆయ‌న ఎవ‌రికి ఎదురెళ్లినా వాళ్ల‌కే రిస్క్‌. ఆయ‌న‌కు ఎవ‌రు ఎదురొచ్చినా వాళ్ల‌కే రిస్క్‌. కంటిచూపుతో చంపేస్తాడో…తొడ‌గొట్టి తాట‌తీస్తాడో చెప్ప‌లేం.

మొన్న ధ‌ర్మ పోరాట దీక్ష‌లో బావ‌గారు ముచ్చ‌ట‌ప‌డి బామ్మ‌ర్ది చేతికి మైకిస్తే ర‌చ్చ‌రంబోలా చేశాడు. హిందీలో మోడీమీద‌ పొట్ట‌చెక్క‌ల‌య్యేలా పంచ్‌లు వేశాడు. మ‌ర‌లాంటి బాల‌య్య‌తో సిన్మా తీయ‌డ‌మంటే సునామీకి ఎదురెళ్లిన‌ట్లే. ఏమ‌యితే అద‌వుతుంద‌ని తెగించేసిన‌ట్లే. పెద్ద‌పెద్ద ద‌ర్శ‌కులే ప్యాక‌ప్ చెప్పేదాకా అల‌ర్ట్‌గా ఉండే బాల‌య్య‌తో పెట్టుకున్నాడు తేజ‌. అది కూడా ఎన్టీఆర్ బ‌యోపిక్ మీద‌. అప్పుడే అనుకున్నారు తేజ‌కి మ‌డ‌త‌డిపోద్ద‌ని.ఎన్టీఆర్ బ‌యోపిక్ ప్రాజెక్ట్‌నుంచి తేజ త‌ప్పుకోవ‌డంతో సిన్మా జ‌నం అంచ‌నా నిజ‌మైంది. నేనేరాజు..నేనేమంత్రిని అనుకునే బాల‌య్య‌తో మామూలు సిన్మా తీయ‌డ‌మే క‌ష్ట‌మైతే..అన్న‌గారి బ‌యోపిక్‌కి సిద్ధ‌ప‌డే దుస్సాహ‌సం చేశాడు తేజ‌. బ‌యోపిక్ అన్నాక జీవితంలోని కీల‌క‌ఘ‌ట్టాల్ని క‌చ్చితంగా తెర‌కెక్కించాల్సిందే. ఎందుకంటే ద‌శాబ్ధాల‌పాటు తెలుగు ప్ర‌జ‌ల‌కు అన్న‌గారేంటో, ఆయ‌న నేప‌థ్య‌మేంటో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు తెలుసు. ఏది దాచిపెట్టాల‌నుకున్నా, దేన్ని విస్మ‌రించాల‌నుకున్నా ఆ ప్ర‌య‌త్నం అసంపూర్తే. బ‌యోపిక్ ప్లానింగ్ ద‌గ్గ‌రే ఎంట‌రైపోయాడు బాల‌య్య‌. అలాకాదు ఇలాగ‌ని ఆయ‌న స్క్రిప్ట్‌ని మార్చేస్తుంటే…త‌న వ‌ల్ల కాద‌ని తేజ‌కి అర్ధ‌మైపోయింది. అందుకే క్ష‌ణం ఆలస్యం చేయ‌కుండా అర్జంట్‌గా టాటాబైబై చెప్పేశాడు. తొంద‌ర‌ప‌డొద్ద‌ని నిర్మాత‌లు రిక్వెస్ట్ చేసినా బ‌తికుంటే బ‌లుసాకు తినొచ్చుగానీ బాల‌య్య‌తో పెట్టుకోనంటున్నాడు తేజ‌.

బ‌యోపిక్ తీయాలంటే ఎంతో క‌స‌ర‌త్తు జ‌ర‌గాలి. ఎన్టీఆర్ జీవితంలోని ప్ర‌తీ కీల‌క‌ఘ‌ట్టాన్నీ జాగ్ర‌త్త‌గా ప‌ట్టుకురావాలి. నేలవిడిచి సాముచేస్తే ప్ర‌యోగం విక‌టిస్తుంది. ఇలాంటి సిన్మాలు తెర‌కెక్కించాలంటే డైరెక్ట‌ర్‌కి ఫ్రీ హ్యాండ్ ఉండాలి. బ‌డ్జెట్ చూసుకోకూడ‌దు. ఏడాదిప‌ట్టినా ఓపిగ్గా చెక్కుతూనే ఉండాలి. కానీ బాల‌య్య లెక్క వేరేలా ఉంది. సిన్మా ఆయ‌న అనుకున్న‌ట్లే తెర‌కెక్కాలి. కొన్ని జీవిత‌ఘ‌ట్టాల్సి చూసీ చూడ‌న‌ట్లు వ‌దిలేయాలి. మూడునాలుగు నెల‌ల్లో సిన్మా రీలు చుట్టేయాలి. ఎన్టీఆర్ బ‌యోపిక్ తీసేంత సామ‌ర్థ్యం త‌న‌కు లేద‌ని తేజ త‌ప్పుకున్నాడు. అంత మ‌హాన‌టుడి జీవిత చ‌రిత్ర‌ని రెండున్న‌ర గంట‌ల్లో చూపించే సాహ‌సం తాను చేయ‌లేనంటున్నాడు ద‌ర్శ‌కేంద్రుడు.

తాను చేయ‌లేన‌ని రాఘ‌వేంద్ర‌రావు చెప్పినా ఓ స‌ల‌హా మాత్రం ఇచ్చాడు. బాల‌య్యతో వందో సిన్మాగా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణిని తెర‌కెక్కించిన క్రిష్ పేరుని సూచించాడు. రెండేళ్లు టైం ఇచ్చి డైరెక్ట‌ర్‌కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వ‌క‌పోతే ఎన్టీఆర్ జీవిత‌చ‌రిత్ర పేరుతో చేసే ప్ర‌య‌త్నం చెడ్డ‌పేరు తెస్తుంద‌ని త‌ల‌పండిన రాఘ‌వేంద్ర‌రావు స‌ల‌హా ఇచ్చార‌ని టాక్‌. స‌ల‌హా బానే ఉందిగానీ అడ్డ‌మొస్తేనే చెంప ఛెళ్లుమ‌నిపించే బాల‌య్య అంత ఓపిగ్గా వెయిట్‌చేస్తాడా? లేక‌పోతే..ఎవ‌రో చేసేదేంటి స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రి నాన్న‌గారి సిన్మా నేనే చేస్తానంటాడా?