Home Entertainment Cinema

కథానాయకుడు ‘కల్లాస్’….‘మహానాయకుడు’ ఎప్పుడో…?

SHARE

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ మూవీ ‘కథానాయకుడు’ పార్ట్ ఎన్నో అంచనాల మధ్య రిలీజైంది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా మొదట అభిమానుల్ని అలరించిన లాంగ్ రన్ లో మాత్రం భారీ లాస్ నే మూటగట్టుకుంది. ఎన్టీఆర్ సినీ రంగ నేపథ్యాన్ని ఆసక్తిగా తెరకెక్కించారు క్రిష్ కానీ ఇది ఎందుకో ‘మహనటి’ మాదిరిగ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక సెకండ్ పార్ట్ రిలీజ్ పై ఇప్పుడు ఇండస్ట్రీలో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి.

ఎన్టీఆర్ బయోపిక్ సెకండ్ పార్ట్ ‘మహానాయకుడు’ విడుదల తేదీలో సందిగ్ధత వీడటంలేదు. తొలిభాగం ఎన్టీఆర్ కథానాయకుడు రిజల్ట్ ఎఫెక్ట్ ‘మహానాయకుడు’ సినిమాపై ఉండనుండటంతో ఈ సినిమా విడుదలకు వెనకడుగులు పడుతున్నాయి. నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ మూవీ తొలిభాగం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలై తెలుగు ప్రేక్షకులకు చేరువ కాలేకపోయింది. నందమూరి అభిమానుల్ని అలరించినప్పటికీ లాంగ్ రన్‌లో నష్టాల బాట పట్టింది ఎన్టీఆర్ కథానాయకుడు. లాభాల సంగతి అటుంచితే.. ఓవరాల్‌గా రూ. 50 కోట్ల నష్టాలను మిగిల్చినట్టు ట్రేడ్ అనలిస్ట్‌లు లెక్కలు కడుతున్నారు.

ఈ తరుణంలో ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ విడుదలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. తొలిభాగం నష్టాలను పూడ్చుకునేందుకు డిస్టిబ్యూటర్స్ ఈ సినిమాను కొనే ధైర్యం చేయడం లేదు. కాగా తొలిభాగం మొత్తం ఎన్టీఆర్ సినిమా జీవితంపై రూపొందించగా.. రెండో భాగాన్ని ఎన్టీఆర్ రాజకీయ జీవితంపై చిత్రీకరించారు. ఇందులో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడం.. చంద్రబాబు ఎంట్రీ.. లక్ష్మీపార్వతి లాంటి అంశాలు కీలకం కానున్నాయి. వాస్తవానికి ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రాన్ని తొలిభాగం విడుదలైన ఐదురోజుల తరువాత అంటే.. జనవరి 15న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఆ తరువాత ఫిబ్రవరి 7 అంటూ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.

అయితే ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రానికి మిశ్రమ స్పందన లభించడంతో ఈ విడుదల తేదీని వాయిదా వేస్తూ ఫిబ్రవరి 22కి జరిపారు. అయితే ‘కథానాయకుడు’ విడుదల తరువాత ‘మహానాయకుడు’ విడుదల తేదీపై ఇప్పటివరకూ దర్శక, నిర్మాతల నుండి ఎలాంటి అఫీషియల్ డేట్ అనౌన్స్‌మెంట్ రాకపోవడంతో ఫిబ్రవరి 22 కూడా కన్ఫామ్‌గా చెప్పలేని పరిస్థితి. దీనికి తోడు ఎన్టీఆర్ మహానాయకుడు షూటింగ్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. కీలకమైన భారీ సన్నివేశాలు తెరకెక్కించాల్సి ఉంది. బడ్జెట్ తదితర అంశాలను పరిగణలోనికి తీసుకుని అనేక బ్రేక్‌ల మధ్య ఈ షూటింగ్ నడుస్తోంది. ఇకపోతే ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రానికి రెండు నెలల ముందు నుండే విపరీతమైన ప్రమోషన్స్ నిర్వహించారు. ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ షూటింగ్ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ప్రమోషన్స్ ఇంకా ప్రారంభమే కాలేదు. ఈ సందర్భంలో అసలు రెండో పార్ట్ విడుదల చేస్తారా? లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.