Home Entertainment Cinema

బుల్లోడుగా బాలయ్య.. గుండమ్మగా నిత్యామీనన్…!

SHARE

ఎన్టీఆర్ బయోపిక్ దీపావళి కి మరో సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. తెలుగునాట అగ్ర కథానాయకులుగా వెలుగొందిన ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి నటించిన చిత్రాల్లో ‘గుండమ్మ కథ’ ఒకటి. అప్పట్లో ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రంలోని ‘లేచింది నిద్ర లేచింది మహిళా లోకం’ అనే పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఇప్పుడు ఇదే పాటను మరోసారి వెండితెరపై చూపించబోతున్నారు. అయితే ఈ కొత్త ‘గుండమ్మ కథ’లో ఎన్టీఆర్‌గా నందమూరి బాలకృష్ణ, మహానటి సావిత్రిగా నిత్యా మీనన్ కనిపించనున్నారు.

బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఈ భారీ చిత్రంలో ఇంచుమించుగా స్టార్లందరూ నటిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబుగా రానా, హరికృష్ణగా కళ్యాణ్‌ రామ్, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్ సింగ్, నాగేశ్వరరావుగా సుమంత్, బసవతారకంగా విద్యాబాలన్ పోస్టర్లు విడుదలయ్యాయి. ఇప్పుడు సావిత్రిగా నిత్యా మీనన్ లుక్ వచ్చింది.

దీపావళి పండుగ సందర్భంగా ‘గుండమ్మ కథ’ చిత్రంలోని ‘లేచింది నిద్ర లేచింది’ పాట స్టిల్‌ను విడుదల చేసారు. సావిత్రి పాత్రలో నిత్యామీనన్ కనిపించారు. పండుగ సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు, నందమూరి అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఎన్‌బీకే ఫిల్మ్స్ ఈ పోస్టర్‌ను విడుదల చేసింది. సావిత్రి పాత్రను పోషిస్తుండటంపై నిత్యా మీనన్ ఆనందం వ్యక్తం చేసింది. సావిత్రమ్మ పాత్రను చేస్తుండటం ఎంతో గర్వంగా ఉందని ట్వీట్ చేసింది. కాగా, జనవరి 9న ‘కథానాయకుడు’గా.. 24న ‘మహానాయకుడు’గా ఎన్టీఆర్ బయోపిక్ విడుదల కానుంది.