Home News Stories

ఇందూరు రాజకీయం పై తెలుగు పాపులర్ టీవీ స్పెషల్ రిపోర్ట్…..

SHARE

విళక్షణ తీర్పు ఇచ్చే ఇందూరు రాజకీయం ఎలా ఉంది. నిజాంసాగర్ ప్రాజెక్టు ఒక వైపు, పసుపు పంటకు పెరోందిన మార్కెట్ మరో వైపు ఉన్న నిజామాబాద్ లో రాజకీయం ఎప్పుడు రంగులు మారుతూనే ఉంది. ఎన్టీఆర్ టైంలో టీడీపీకి, వైఎస్ టైంలో కాంగ్రెస్ కి పట్టం కట్టిన జిల్లా గత ఎన్నికల్లో కేసీఆర్ కారుకి జై కొట్టింది. హెమాహేమి నేతలున్న ఇందూరులో ఎన్నికల వేళ రాజకీయం ఎలా ఉంది….

నిజామాబాద్ జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించిన టీఆర్ఎస్.. ప్రచారంలో ముందుంది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎవరో తేలాల్సి ఉంది. ముఖ్యంగా టీఆర్ఎస్ ఇక్కడ మళ్లీ తాజా మాజీలనే బరిలోకి దింపుతోంది. కాంగ్రెస్ కూడా తమ సీనియర్లనే పోటీకి నిలిపే అవకాశముంది.

నిజామాబాద్‌ అర్బన్‌ లో టీఆర్ఎస్ నుంచి బిగాల గణేష్‌ గుప్తా బరిలో దిగుతున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి ఆరుగురు ఆశావహులు టికెట్ కోసం క్యూలో ఉన్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్‌లో చేరిన రాజ్యసభ ఎంపీ డీఎస్ కాంగ్రెస్‌లోకి తిరిగి చేరితే ఈ టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నా, స్పష్టత రాలేదు. అయితే, ఇప్పటికే ఆయన అనుచరులు కాంగ్రెస్‌లోకి రావడంతో డీఎస్ రాక అనివార్యమని భావిస్తున్నారు. మరి, కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం చెబుతుందో చూడాలి. బీజేపీ నుంచి యెండల లక్ష్మీ నారాయణ, ధనపాల్ సూర్యనారాయణ గుప్తాలు టికెట్ ఆశిస్తున్నారు. టీజేఎస్ కూడా ఇక్కడ ఈ స్థానం కోసం కాంగ్రెస్‌పై ఒత్తిడి తెస్తోంది.



నిజామాబాద్‌ రూరల్‌
లో టీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, బీజేపీ నుంచి గడ్డం ఆనందరెడ్డి మళ్లీ బరిలోకి దిగారు. భూపతిరెడ్డి, అరికెల నర్సారెడ్డిలు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. ఇక మహాకుటమి పొత్తులో ఈ సీటు టీడీపీకి ఇస్తే ఇక్కడనుంచి సీనియర్ లీడర్ మండవ వెంకటేశ్వరరావు బరిలో దిగనున్నారు. బాన్సువాడలో ఆపద్ధర్మ మంత్రి పోచారం శ్రీనివాసర్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ స్థానంపై పోచారానికి గట్టిపట్టే ఉంది. ఈ నేపథ్యంలో బలమైన అభ్యర్థిని నిలిపేందుకు కాంగ్రెస్ వ్యూహం పన్నుతోంది. అభ్యర్థిపై కాంగ్రెస్ ఇంకా నిర్ణయం తీసుకోకపోయినా.. టికెట్ ఆశిస్తున్న మాల్యాద్రి రెడ్డి, కాసుల బాలరాజ్‌లలో ఒకరికి టిక్కెట్ దక్కనుంది.

కామారెడ్డిలో మాజీ విప్ గంప గోవర్ధన్. టీఆర్ఎస్ నుంచి పోటీలో ఉండగా కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న శాసన మండలి విపక్షనేత షబ్బీర్‌ అలీ.. ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. ఈ స్థానం తనకే కేటాయిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నుంచి కాటిపల్లి వెంకట రమణారెడ్డి బరిలో దిగుతున్నారు. కామారెడ్డిలో రాహుల్ మీటింగ్ సక్సెస్ తో షబ్బీర్ మంచి జోరు మీదున్నాడు. ఆర్మూర్‌ నుంచి టీఆర్ఎస్ సిట్టింగ్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి బరిలో దిగగా కాంగ్రెస్ నుంచి గతంలో పోటీచేసిన మాజీ స్పీకర్ సురేష్‌ రెడ్డి ఇటీవల టీఆర్ఎస్‌లో చేరడంతో కొత్తవారికి ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం దక్కనుంది. ఏబీ శ్రీనివాస్, ఆకుల లలిత, రాజారాం యాదవ్‌లు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి వినయ్ రెడ్డి బరిలో దిగుతున్నారు.

ఎల్లారెడ్డిలో టీఆర్ఎస్ నుంచి ఏనుగు రవీందర్ రెడ్డి మరోసారి బరిలో దిగుతున్నారు. ఈ స్థానాన్ని టీజేఎస్ కోరుకుంటున్న నేపథ్యంలో తమ ఆశావహులకు టికెట్ ఇవ్వాలా లేదా టీజేఎస్‌కు ఇవ్వాలా అని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. టీజేఎస్ నుంచి న్యాయవాది రచనారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. బోధన్‌లో పాతకాపులే పోరాడుతున్నారు. టీఆర్ఎస్ నుంచి షకీల్‌ ఆమిర్‌ మళ్లీ బరిలోకి దిగుతుండగా, కాంగ్రెస్‌ నుంచి మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి పోటిపడుతున్నారు.

బాల్కొండలో టీఆర్ఎస్ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి బరిలో దిగుతున్నారు. ఇటీవలే టీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి, మాజీ విప్‌ అనిల్‌ కాంగ్రెస్ నుంచి టికెట్లు ఆశిస్తున్నారు. కూటమి పొత్తుల్లో భాగంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ కుమారుడు మల్లికార్జునరెడ్డి టికెట్ కోరుతున్నారు. జుక్కల్‌ నుంచి కాంగ్రెస్ నుంచి గంగారాం, గడుగు గంగాధర్, అరుణ తార టికెట్ ఆశిస్తున్నారు. ఈ సీటుపై వీరు చాలా ఆశలు పెట్టుకున్నారు. టీఆర్ఎస్ నుంచి హన్మంత్‌ షిండే మళ్లీ బరిలోకి దిగుతున్నారు.