తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి రాజుకుంది. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పార్టీలన్ని తమ ప్యూహాలకు పదును పెడుతున్నాయి. అసెంబ్లీ రద్దు రోజే 105 మంది అభ్యర్ధులను ప్రకటించి గులాబీ బాస్ కేసీఆర్ సంచలనానికి తెర తీశారు. ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా అధికార టీఆర్ఎస్ ను మట్టికరిపించేందుకు కలిసి వచ్చే పార్టీలతో మహాకుటమిని ఏర్పాటు చేసింది. ఇక్కడే టీఆర్ఎస్ తన మాస్టర్ ప్లాన్ కు పదునుపెట్టింది. ఆపరేషన్ ఆకర్ష్ అంటూ విపక్షాల గూళ్ళను ఖాళీ చేసి గులాబీ పార్టీని నింపుతున్నారు. పాత కేసులను తిరగదోడుతూ విపక్ష పార్టీలను డిఫెన్స్ లో పడేస్తున్నారు.
విపక్ష పార్టీల సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కే వచ్చేలా ఉండటం టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా అన్నీ పార్టీలు సీట్ల విషయంలో భేషజాలకు వెళ్లకపోవడంతో మహకూటమి ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. దీంతో కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసింది కారు పార్టీ. గతంలో వారి పై ఉన్న పాత కేసులను తిరగదోడేందుకు ప్రయత్నిస్తుందని టాక్ వినిపిస్తుంది.
ఇందులో భాగంగానే మనుషుల అక్రమ రవాణాకు పాల్పడ్డారనే ఆరోపణలపై సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డిని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. జగ్గారెడ్డి కేసు విచారణ కొనసాగుతుండగానే.. మరో కాంగ్రెస్ నేత, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సోదరుడు గండ్ర భూపాల్‌రెడ్డిలపై కూడా ఆయుధ చట్టం కింద కేసు నమోదైంది. క్రషర్ల లావాదేవీల విషయంలో తనపై తుపాకీతో దాడి చేశారంటూ రవీందర్ రావు, భూపాల్‌రెడ్డిలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటి నుంచి తెరుకునే లోపు జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అక్రమాల కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా జూబ్లీహిల్స్ పోలీసులు కాంగ్రెస్ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో పాటు అప్పటి కమిటీలో ఉన్న 13 మందికి నోటీసులు జారీ చేశారు.
హస్తం పార్టీ నేతల పై కేసులు ఇంతటితో ఆగేలా లేవు. కుత్భుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ పై ఎస్సీ ఎస్టీ వేదింపుల చట్టం క్రింద కేసు నమోదు చేశారు. గులాబీ పార్టీ టార్గెట్ చేసిన మరో నేత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజన నేత మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావ్. వచ్చే ఎన్నికల్లో బోథ్ అసెంబ్లీ నుంచి బరిలోకి దిగాలని సన్నద్దం అవుతున్న బాపురావ్ ఆదివాసి ఉద్యమం పేరుతో ప్రజలల్లోకి వెలుతున్నారు. దీంతో గతంలో మనుషుల అక్రమ రవాణా కేసులో జైలు కి వెళ్ళి బెయిల్ పై సోయం బయటకి రావడంతో ఆ దిశగా అధికార పార్టీ దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ప్రభుత్వ పెద్దల నుంచి అనుమతి వస్తే సోయం కి కూడా కష్టాలు తప్పేలా లేవు. ముఖ్యంగా కాంగ్రెస్,టీడీపీలు రెండు పొత్తుకు సిద్దమవుతుండటంతో రెండిటిని టార్గెట్ చేస్తూ ఓటు కు నోటు కేసు తెరమీదకు వచ్చిన ఆశ్చర్యం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇలా అధికార పార్టీ టార్గెట్ లో ఉన్న నెక్స్ట్ నేత ఎవరన్న చర్చ కాంగ్రెస్ నేతల్లో వినబడుతుంది.