Home News Stories

నరసాపురంలో ఢీ అంటే ఢీ…!

SHARE

రాజకీయం చైతన్యం గల నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు ఉహించని విధంగా మారిపోతున్నాయి. నియోజకవర్గ పరిధిలోని ఓటర్లు ప్రతి ఎన్నికల్లోనూ విలక్షణ తీర్పు ఇస్తుంటారు. ఇక్కడి నుంచి పోటీ చేసిన రాజకీయ ఉద్దండులకే పట్టం కట్టారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇప్పటివరకు తొమ్మిది సార్లు ఎన్నిక జరగ్గా నాలుగు సార్లు టీడీపీ, రెండుసార్లు బీజేపీ, ఏడు సార్లు కాంగ్రెస్‌ కైవసం చేసుకున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసిన బీజేపీ ఈ సారి ఒంటరిగా తలపడనుంది. దీంతో టీడీపీ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్‌,బీజేపీ అయిదు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోటీ జరిగే పరిస్థితి నెలకొంది. టీడీపీ,వైసీపీ, కాంగ్రెస్‌లు ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను బరిలో నిలపగా జనసేన, భీజేపీలు మరో సామాజిక వర్గంపై దృష్టి పెట్టాయి. పార్టీల అభ్యర్థులు వ్యూహ ప్రతివ్యూహాలతో పావులు కదుపుతున్నారు. దీంతో ప్రజలు ఏ పార్టీకి మొగ్గు చూపుతారోనని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

టీడీపీ అభ్యర్థిగా వేటుకూరి శివరామరాజు (కలవపూడి శివ) ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థులను కలిసి విజయానికి సహకరించాలని కోరారు. నియోజకవర్గ పార్టీశ్రేణులతో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల ప్రచారానికి కదులుతున్నారు. మొదటి నుంచి అనేక పేర్లు పరిశీలనకు వచ్చినా చివరకు ఎవరు ఊహించని రీతిలో ప్రస్థుత ఉండి ఎమ్మెల్యే శివరామరాజు అభ్యర్థిగా ఖరారయ్యారు. ఉండి నియోజకవర్గంపై ఆయనకు మంచి పట్టుంది. భీమవరం నియోజకవర్గంలోనూ మంచి పరిచయాలు ఉన్నాయి. మిగిలిన నియోజకవర్గాల్లో తక్కువ పరిచయాలు ఉన్నప్పటికీ టీడీపీ అభ్యర్థుల బలం, పార్టీశ్రేణులు వంటి పరిణామాలు కలిసొస్తాయని భావిస్తున్నారు.

ఉహించని రీతితో వైసీపీ అభ్యర్థిగా కనువరి రఘురామకృష్ణంరాజు ఖరారయ్యారు. కొద్దిరోజుల ముందు వరకు టీడీపీలో కొనసాగిన ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. పార్టీలో నాయకులతోనూ మంచి పరిచయాలు పెంచుకున్నారు. ఇప్పుడు అవన్నీ రఘురామకృష్ణంరాజుకు కలిసొస్తాయని పార్టీ భావిస్తోంది. టిక్కెట్‌ అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి నియోజకవర్గాల్లో విస్తృతంగా తిరుగుతూ అందరి మద్దతు కోరుతున్నారు. సామాజికవర్గాల వారీగా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇతర పార్టీల్లో అసంతృప్తితో పార్టీని వీడిన నాయకులను వైసీపీలో చేరేందుకు కీలక పాత్ర పోషిస్తున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా కనువరి బాపిరాజు పోటీ చేస్తున్నారు. ఆయన పోటీలో నిలవడం ఆరోసారి. గతంలో కాంగ్రెస్‌ తరఫున రెండుసార్లు ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లో పోటీ చేసినా రాష్ట్ర విభజన అంశం వల్ల డిపాజిట్‌ దక్కలేదు. ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీల అమలుపై కాంగ్రెస్‌ ఆందోళన కార్యక్రమాలు కలిసి వస్తాయని పార్టీ భావిస్తోంది.బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు బరిలో దిగారు. మొదట ఎంపీ గోకరాజు గంగరాజును పోటీలో నిలపాలని అధిష్ఠానం ఆలోచన చేసినా ఈసారి పోటీ చేయనని ఆయన చెప్పారు. దీంతో మాణిక్యాలరావు పేరును పరిశీలించింది. ఆయన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పినా పార్టీ అధిష్ఠానం నుంచి ఒత్తిడి వచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాలోని పార్టీ నాయకులు ఆయన పేరునే సూచించినట్లు తెలిసింది.

ఇక జనసేన అభ్యర్ధిగా పవన్ సోదరుడు నాగబాబు రంగంలోకి దిగారు. ఇక్కడ సామాజికవర్గ పరంగా జనసేన కూడా కీలకంగా మారడంతో ఎంపీ సీటు తమదే అన్న ధీమతో ఉంది. దీంతో టీడీపీ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్‌,బీజేపీ అయిదు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోటీ జరిగే పరిస్థితి నెలకొంది.