Home News Stories

సీమలో సిట్టింగ్ ఎంపీలకు జలక్…!

SHARE

ఒకరిది సుదీర్ఘ రాజకీయ అనుభవం.. ఇంకొకరిది పొలిటికల్‌గా న్యూ ఎంట్రీ.. ఒకే జిల్లా నుంచి ఒకే పార్టీ అభ్యర్ధులుగా పోటీ చేసిన ఆ ఇద్దరు ఘనవిజయం సాధించారు .. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రాకపోయినా వారు మాత్రం చట్టసభల్లో అడుగుపెట్టారు .. తర్వాత ఎవరి లెక్కలతో వారు అధికారపక్ష గూటికి చేరారు.. తీరా మళ్లీ ఎన్నికలు వచ్చే సరికి వారి పరిస్థితి వారికే అర్థం కాకుండా తయారైంది .. ఒకరు యూ టర్న్‌ తీసుకుని సొంతగూటికి చేరి దిక్కులు చూస్తుంటే.. ఇంకొకరు నాలుగురోడ్ల కూడలిలో నుంచుని ఎటు వెళ్లాలో దారులు వెతుక్కుంటున్నారు… ఇంతకీ ఎవరా నేతలు? ఇప్పుడు వారి పయనమెటు?

ఎస్పీవై రెడ్డి .. నంద్యాల ఎంపిగా హ్యట్రిక్‌ కొట్టిన నేత .. బుట్టా రేణుక వైసిపి అభ్యర్ధిగా గత ఎన్నికల్లో అరంగేట్రంతోనే కర్నూలు ఎంపిగా విజయం సాధించారు .. వైసిపి టికెట్‌తో గెలిచిన ఆ కర్నూలు జిల్లా ఎంపిలు ఇద్దరు తమతమ లెక్కలతో తెలుగుదేశంపార్టీలో చేరిపోయారు .. టీడీపీ ఎంపీ టికెట్ కోసం సిట్టింగ్ ఎంపీలు ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుక చివరి వరకు ప్రయత్నించారు… అయితే ఇద్దరు సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు దక్కలేదు… దాంతో యూటర్న్‌ తీసుకున్న బుట్టా రేణుక వైసీపీ కండువా కప్పుకుంటే… ఎస్పీవై రెడ్డి టీడీపీ ని వీడి జనసేనకి జై కొట్టారు.

కర్నూలు ఎంపీ బుట్టా రేణుక చెప్పుకోదగ్గ రాజకీయ నేపథ్యం లేకున్నా 2014 లో వైసీపీ అభ్యర్థిగా అనూహ్యంగా తెరపైకి వచ్చారు.. హైద్రాబాద్ లో వ్యాపారాల్లో స్థిరపడిన బుట్టా రేణుక వైసిపి నుంచి ఎంపీ గా పోటీ చేసి గెలుపొందారు… కొన్నాళ్ళకే బుట్టా రేణుక భర్త నీలకంఠం టీడీపీ కండువా కప్పుకోగా మూడేళ్ళ తరువాత బుట్టా రేణుక కూడా టీడీపీ తో జత కట్టారు… తీరా ప్రస్తుత ఎన్నికల ముందు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి టిడిపిలో చేరడంతో రేణుకకు కర్నూలు ఎంపి సీటు దక్కకుండా పోయింది….

మారిన ఈక్వేషన్లతో కర్నూలు ఎంపీ సీటుపై ఆశలు వదులుకున్న రేణుక.. ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానం అడిగితే ఆధోని సీటు ప్రతిపాదించింది టీడీపీ అధిష్టానం… అక్కడ గెలుపు కష్టమని భావించి అందుకు తిరస్కరించిన ఆమె… యూటర్న్‌ తీసుకుని తిరిగి వైసీపీ గూటికి చేరారు.. వైసీపీలో కూడా ఆమెకు ఎక్కడా టికెట్‌ కాని, హామీకాని లభించలేదు.. దాంతో ప్రస్తుతానికి జిల్లాలో వైసీపీ అభ్యర్థుల విజయం కోసం బుట్టా రేణుక పనిచేయాల్సి పరిస్థితి.. రాబోయే రోజుల్లో వైసీపీ అధిష్టానం కరుణిస్తే రాజ్యసభ సీటు దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు ఆమె..

ఇక నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి వైసీపీ నుంచి గెలుపొందిన వెంటనే టీడీపీ కండువా కప్పుకున్నారు… అనారోగ్యం కారణంగా మూడేళ్ళుగా రాజకీయ కార్యకలాపాలను తగ్గించారు ఎస్పీవై రెడ్డి… ఈ ఎన్నికల్లో కుటుంబసభ్యుల కోసం నంద్యాల అసెంబ్లీ లేదా ఎంపీ టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు … గౌరు చరిత దంపతులను వైసీపీ నుంచి టీడీపీకి తెచ్చిన శివానంద రెడ్డికి టీడీపీ ఎంపీ టికెట్ దక్కింది… దీంతో స్వతంత్రంగా పోటీచేస్తానని ప్రకటించారు ఎస్పీ వై రెడ్డి… మరో వైపు తమ పార్టీలో చేరాలంటూ ఆయనతో .. బీజేపీ, జనసేన, వైసీపీ నేతలు సంప్రదింపులు జరిపాయి..చివరకు జనసేనకు జైకొట్టిన ఎస్పీవై రెడ్డి మరోసారి నంద్యాల పార్లమెంట్ అభ్యర్ధిగా బరిలోదిగుతున్నారు. నంద్యాల పరిధిలో కాపుల ఓట్లు నిర్ణాయాత్మక శక్తిగా ఉండటంతో జనసేన వైపే మొగ్గారు ఎస్పీవై రెడ్డి. నంద్యాల అసెంబ్లీ నుంచి కూడా తన కూతురు లేదా అల్లుడిని బరిలోదించి తనపంతం నెగ్గించుకోవాలనుకుంటున్నారు ఎస్పీవైరెడ్డి.