Home News Stories

ముందస్తుకు అసలు భయం ఇదేనా !

SHARE

ఎన్నో పోరాటాలతో సాధించుకున్న రాష్ట్రం. ఆ పై తొట్టతొలి స్వియ ఏలుబడి సర్కార్. అయినా ఐదేళ్ళ పుర్తి చేయకుండానే మరో ఐదేళ్ళు అధికారం కోరుతున్నారు గులాబీ అధినేత. సభను ముందే రద్దు చేసి ముందస్తు ఎన్నికలంటూ సైరన్ మోగించారు. పైకి అభివృద్ది అంటున్నా ఎవరి వృద్ది కోసం ఈ ముందస్తు ముహుర్తం!

అసలు ముందస్తు ఎన్నిక కారణం ఎవరు ? దీనికి కారణం కాంగ్రెస్ అంటారు గులాబీ బాసు. అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు కు ముహుర్తం పెట్టిన కేసీఆర్ సారు ఆ నెపం కాంగ్రెస్ మీదకు నెట్టాడు. అవును మరి కేసీఆర్ దృష్టిలో బంగారు తెలంగాణ అభివృద్దికి అడ్డుపడుతుంది హస్తం పార్టియే కదా మరి. కేసీఆర్‌ సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారు. ఎలా అడ్డుకుంటున్నారని, ఎవరూ అడక్కుండానే ఆయనే చెబుతారు. తాను ప్రకటించిన పథకాలకు వారు ఇంకా కొన్ని చేర్చి కేసీఆర్ లాగానే ప్రజాకర్షక పథకాలు ప్రకటిస్తున్నారు. ఫించన్ పెంపు,ఉచిత గ్యాస్, పేద కుటుంభాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అవును మరి ఇవన్ని కేసీఆర్ అభివృద్దికి ఆటంకాలే కదా మరి… హస్తం పార్టీ నేతలు కారు పార్టీ దారిలోనే సంక్షేమ పథకాల పై సవారి చేస్తాం అంటున్నారు. ఆ మాట కొస్తే, కాంగ్రెస్‌కు ఆ అడ్డుకునే విద్యే తెలిస్తే, గట్టి ప్రతిపక్షంగానే నిలిచేది. సర్కారుకు వ్యతిరేకంగా ఏ ఒక్క అంశం మీదా, ఏ ఒక్కనాడూ, ఏ ఒక్క చోటా కాంగ్రెస్‌ వారు గట్టి పోరాటం చేసిన దాఖలాలులేవు. ఈ 4 యేళ్ళ కాలంలోనూ కేసీఆర్‌ సర్కారుని నిలబెట్టి కడిగేసిన ఉదంతం కాంగ్రెస్‌ కు ఒక్కటీ లేదు.

పాలకులకు నచ్చినవే పత్రికల్లో శీర్షికలవుతున్న రోజులివి“.  ఏమి రాయాలో కాదు, ఎలా రాయాలో కూడా వారే డిసైడ్ చేస్తున్నారు. ఇంకా అంతా అనుకూలమే మరి. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ చేసే విమర్శలెప్పుడూ పస లేనివే. సచివాలయంలో నుంచి కాకుండా ప్రగతి భవన్‌ నుంచే సర్కారును నడుపుతానంటే, వారే మన్నా అడ్డుపడ్డారా, తెలంగాణ రాష్ట్రంలోని తొట్టతొలి క్యాబినెట్‌ లో ఒక్క మహిళ కూడా లేకుండా పాలన సాగిస్తే, ఈ కాంగ్రెస్‌ నేతలు నిరసనగా ఎప్పుడైనా ఒక ఉద్యమం చేశారా. మరి గట్టిగా మట్లాడితే మహిళా, శిశు సంక్షేమాన్ని ఎప్పుడూ మహిలళే చెయ్యాలా? పురుష పుంగవులు మహిళోద్దారకులే అని మారు మాట్లాడకుండా తిప్పి కొట్టగల గడసరి కేసీఆర్. కేసులతో అభివృధ్ది పనులు ఆగిపోయాయన్నారు. ఏ కేసుతో ఏ అభివృధ్ది పని ఆగిపోయిందో వివరణ లేదు. తనవి అనుకున్నవి తన శైలిలో చేసుకు పోతుంటే, చోద్యం చూస్తూ ‘ఏదీ అనక పోతే బాగుండద’ని తగిలీ తగలకుండా విమర్శలు చేస్తున్నారు. రద్దయిన శాసన సభలో పాలకపక్షంగా టీఆర్‌ఎస్‌ వైఫల్యం ఎంతో లెక్కదీయటం కష్టం కానీ, విపక్షంగా కాంగ్రెస్‌ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతోంది.

అసలు ఇంత అర్జెంట్ గా అసెంబ్లీ ని ఎందుకు కేసీఆర్ రద్దు చేశారంటే ఏదో చెప్పాలి కాబట్టి ఈ కారణం చెబుతున్నారు కానీ, అసలు కారణం అందరికి తెలిసిందే. సర్కారన్నాక వ్యతిరేకత వుంటుంది. అందులోనూ కొత్తగా ఏర్పడ్డ ఏ రాష్ట్రంలోనయినా అధికారంలో వున్న పార్టీ మీద పుట్టెడు వ్యతిరేకత వుంటుంది. ఎందుకంటే ప్రజల ఆకాంక్షలు అలా వుంటాయి. తెలంగాణలో ప్రజలు కోరుకున్నవి చాలా వున్నాయి. కేసీఆర్‌ తీర్చలేనివి చాలా చాలా వున్నాయి. మహబూబ్ నగర్ నుంచి ముంబై వలసలు, నల్గొండలో ఫ్లోరొసిస్‌,నిరుద్యోగం ఇవన్ని సమైక్య పాలన నుంచి తెలంగాణలో ఏటికి ఎదురీదుతున్న సమస్యలు. మరి ప్రభుత్వం మీద ఆసంతృప్తి లేకుండా ఎలా వుంటుంది?

ఒక్కొక్క సారి వ్యతిరేకత ఎలా వుంటుందంటే అవతల పార్టీలో ఎలాంటి ఇమేజ్ ఉన్న నాయకుడు ఉన్నారన్నది ప్రజలు చూడరు. 1989 లో ఎన్టీఆర్ మీద వ్యతిరేకత వ్యక్తమైనప్పుడు కాంగ్రెస్ లో ఏ చరిశ్మ ఉన్నా నాయకుడున్నాడు ? ఎన్టీఆర్ మీద వ్యతిరేకతే కాంగ్రెస్ కి వోట్ల వర్షం కురిపించింది. ఇవన్ని గమనించే ఇతర పక్షాలకు ఊపిరి పీల్చే సమయం ఇవ్వకుండా నెపం ప్రతిపక్షాల పై నెట్టి కదనరంగంలో దూకారు కేసీఆర్.