Home News Politics

వెంకన్న చౌదరి కేరాఫ్ తిరుమ‌ల‌!!!

టీడీపీ కుల పిచ్చి పీక్ స్టేజీకి వెళ్లిపోయిందా?

SHARE

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం, ప్ర‌పంచ‌వ్యాప్తంగా భ‌క్త‌జ‌న కోటి ఉన్న ఆప‌ద‌మొక్కుల‌వాడిని భ‌క్తి పార‌వ‌శ్యంతో కొలుచుకోవ‌డ‌మేగానీ ఆయ‌న కుల‌గోత్రాల గురించి ఇప్ప‌టిదాకా మాట్లాడిన‌వాళ్లు లేరు. అస‌లు దేవుడికి కులమేంటి? పైగా గోవిందుడు అంద‌రివాడు. ఆయ‌న‌కి కూడా కులాన్ని ఆపాదించేస్తే…ప‌దేళ్ల త‌ర్వాత చేతికందిన అధికారంతో మ‌నోళ్లు మ‌నోళ్లు అంటూ అన్ని వ్య‌వ‌స్థ‌ల్లో పేరు చివ‌ర ఆ మూడ‌క్ష‌రాలు ఉండ‌ట‌మే ప్ర‌ధాన అర్హ‌త‌లా భావిస్తుంటే నేత‌లు నోరుజార‌డంలో..దేవుడు కూడా మ‌న చౌద‌రిగారేన‌ని చెప్పుకోవ‌డంలో వింతేముంది?

గుజ‌రాత్ భ‌క్తుడ‌యినా, ఎక్క‌డో క‌శ్మీర్‌నుంచి వ‌చ్చిన భ‌క్తుడ‌యినా, ప‌క్క రాష్ట్రం త‌మిళ‌నాడునుంచి వ‌చ్చిన భ‌క్తుడిక‌యినా తిరుమ‌ల శ్రీవెంక‌టేశ్వ‌రుడు కోరిన వ‌రాలిచ్చే దేవుడు. క్ష‌ణ‌కాలం ఆయ‌న ద‌ర్శ‌న‌భాగ్యం ల‌భించినా ఈ జీవితానికిది చాల‌నుకుంటారు. అలాంటి ప‌విత్ర‌క్షేత్రంలో రాజ‌కీయం చేస్తోంద‌ని ఇప్ప‌టికే టీడీపీమీద తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లున్నాయి. ప్ర‌ధాన అర్చ‌క ప‌ద‌వినుంచి తొల‌గించాక ర‌మ‌ణదీక్షితులు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌తో తిరుమ‌ల ప‌విత్ర‌త ప‌రీక్ష‌కు నిల‌బ‌డింది. పూజాకైంక‌ర్యాల్లో లోపాలున్నాయ‌ని, చివ‌రికి శ్రీవారిని ప‌స్తులుంచుతున్నార‌నే ఆరోప‌ణ‌ల్లో నిజ‌మెంత ఉన్నా..సామాన్య భ‌క్తుల మ‌నోభావాలు మాత్రం తీవ్రంగా దెబ్బ‌తింటున్నాయి.

తిరుమ‌ల‌ని ఇంత‌గా వివాదాల్లోకి లాగుతోందెవ‌రు? అంత‌టి ప‌విత్ర పుణ్యక్షేత్రంతో రాజ‌కీయం చేస్తున్న‌దెవ‌ర‌నేది ప‌క్క‌న పెడితే…సాక్షాత్తూ శ్రీవారికి కూడా కులం ఆపాదించేస్తోంది ప‌చ్చ‌గ్యాంగ్…అదే టీడీపీ స‌మూహం. పోనీ కొత్త బిచ్చ‌గాడిలా నిన్నామొన్న రాజ‌కీయాల్లోకొచ్చిన నాయ‌కుడెవ‌ర‌యినా నోటితుత్త‌ర‌కొద్దీ మాట్లాడాడంటే పెద్ద మ‌న‌సుతో క్ష‌మించేయొచ్చు. సినిమా నటుడిగా త‌ల‌పండిపోయి…రాజ‌కీయాల్లోనూ అపార అనుభ‌వ‌మున్న ముర‌ళీమోహ‌నే ఏడుకొండ‌ల‌వాడిని త‌మ కులంలో క‌లిపేసుకుని..మ‌ళ్లీ ఏదో ఫ్లోలో నోరుజారానంటే క్ష‌మించేయ‌గ‌ల‌మా?

వెంక‌టేశ్వ‌రుడు కాద‌ట‌..వెంక‌టేశ్వ‌ర చౌద‌రి అట‌. పిచ్చాపాటిగా ఎవ‌రితోనో మాట్లాడుతూ స‌ర‌దాగా మాట్లాడిన వీడియో లీక‌య్యిందంటే ఔనా అంటూ కాస్త ఆశ్చ‌ర్య‌ప‌డి మ‌ర్చిపోవ‌చ్చు. కానీ పార్టీ కార్య‌క్ర‌మం మినీ మ‌హానాడులోనే తిరుమ‌ల వెంక‌న్న‌ని చౌద‌ర్ల‌లో క‌లిపేశాడు రాజ‌మండ్రి ఎంపీ ముర‌ళీమోహ‌న్‌. సాక్షాత్తూ వ‌డ్డీకాసుల‌వాడిని వెంక‌న్న చౌద‌రిగా మార్చేశారు. బుద్ధి గ‌డ్డితిందా అని అడిగితే అప్ప‌టిదాకా ప‌క్క‌నున్న బుచ్చ‌య్య‌చౌద‌రితో మాట్లాడ‌టంతో పొర‌పాటున అలా అనేశాన‌ని లెంప‌లేసుకుంటున్నాడు ముర‌ళీమోహ‌న్ . టంగ్ స్లిప్ అయ్యింది స్వామీ అంటూ ఇంట్లో వెంక‌న్న ఫొటోముందు చెంప‌లేసుకున్నాన‌ని ఏమాత్రం సిగ్గుప‌డ‌కుండా వివ‌ర‌ణ ఇచ్చుకున్నాడు. క‌డుపులో ఎంత కుల‌గ‌జ్జి లేక‌పోతే య‌థాలాపంగా దేవుళ్ల‌కి కూడా తోక‌లు త‌గిలించేస్తారు? అస‌లే తిరుమ‌ల వివాదంతో త‌ల‌బొప్పిక‌ట్టిన చంద్ర‌బాబుకి ముర‌ళీమోహ‌న్ కామెంట్స్ బోన‌స్‌.