Home News Politics

ఆ మంత్రుల సీట్లకు ఎసరు…!

SHARE

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఏపీలోని ప్రధాన పార్టీలకు సీట్ల సర్దుబాటు వ్యవహారం కత్తి మీద సాములా మారింది. సమయం తక్కువగా ఉండటంతో త్వరితగతిన ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు వైసీపీ, టీడీపీ కసరత్తు ముమ్మరం చేశాయి. అయితే… ఈ సీట్ల సర్దుబాటు వ్యవహారం టీడీపీలోని ఐదుగురు మంత్రుల సీట్లకు ఎసరు తెచ్చి పెట్టేలా కనిపిస్తోంది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, శిద్దా రాఘవరావులను ఎంపీలుగా పోటీ చేయాలని అధిష్ఠానం ఆదేశించింది.

అయితే.. ఎంపీలుగా పోటీ చేయడానికి ఈ ఇద్దరు మంత్రులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తలు ప్రచారంలో ఉండగానే శిద్దా అనుచరులు ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని ఆయన ఇంటి ముందు బైఠాయించారు. దీంతో అధిష్ఠానంతో చర్చలు జరిపేందుకు శిద్ధా సిద్దమయ్యారు. గంటాది కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. విశాఖ ఎంపీగా గంటా శ్రీనివాస్‌ పోటీ చేసేందుకు ఆసక్తి కనబర్చని పక్షంలో అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించే యోచనలో టీడీపీ అధిష్ఠానం ఉన్నట్టు తెలుస్తోంది. ఒంగోలు ఎంపీగా మంత్రి శిద్దాను పోటీ చేయించాలని టీడీపీ భావిస్తోంది.

ఒంగోలు లోక్‌సభకు శిద్దా పేరు పరిశీలనలో ఉండగానే ఒంగోలు నుంచి పోటీకి ఈదర హరిబాబు ఆసక్తి చూపుతున్నారు. మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ అరుణమ్మ, పాలేటి రామారావు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. నెల్లూరు బరిలో ఒంటేరు వేణుగోపాల్‌రెడ్డి, కాటంరెడ్డి విష్ణువర్దన్‌రెడ్డి, బొమ్మిరెడ్డి ఉన్నారు. నరసరావుపేట నుంచి పోటీకి రాయపాటి ఆసక్తి చూపుతున్నారు.

ఇప్పటికే మంత్రి ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేసేందుకు సిద్దపడ్డారు. మంత్రి కాల్వకు టికెట్‌ ఇవ్వొద్దని ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి అధిష్టానాన్ని కోరారు. కొవ్వూరులో మంత్రి జవహర్‌కు వ్యతిరేకంగా భారీ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. స్పీకర్ కోడెలను కూడా నరసరావుపేట నుంచి ఎంపీగా బరిలో నిలిపే యోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. నరసరావుపేట ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోడెల భావిస్తున్నట్లు సమాచారం.

మరో వైపు రాజమండ్రి లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక నాటకీయ పరిణామాల మధ్య సాగుతుంది. రాజమండ్రి ఎంపీ టికెట్‌ రేసులో బొడ్డు భాస్కర రామారావు, గన్ని కృష్ణ ఉన్నారు. వీరిలో బొడ్డు భాస్కర రామారావు స్క్రీనింగ్‌ కమిటీ నేత సుజనాను కలిశారు. అయితే.. అధిష్టానం ఆలోచన ఇందుకు భిన్నంగా ఉన్నట్టు తెలుస్తోంది. రాజమండ్రి ఎంపీ స్థానానికి బాలకృష్ణ చిన్నల్లుడి పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇక మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి దంపతులు త్వరలో టీడీపీలో చేరనున్నారు. దీంతో ఆమెకు తిరుపతి పార్లమెంట్ స్థానాన్ని అధిష్టానం ఖరారు చేసింది.