Home News Stories

మరోసారి ఉండవల్లి చెడుగుడు….. కుటుంబరావు సవాల్ కి సై….

SHARE

ఏపీ పాలిటిక్స్ లో పరిచయం అక్కర్లేని నేత ఉండవల్లి. ఎలాంటి విషయం పై అయినా ఒక క్లారిటీతో మాట్లాడగల సీనియర్ పొలిటిషియన్ గా పేరు ఉంది. ప్రభుత్వ ఆర్ధిక సలహాదారు కుటుంబరావు ఈయన ప్రభుత్వ సలహాదారుగా కాకుండా టీడీపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తారన్న పేరు ఉంది. ఈ అర్ధశాస్త్ర పితామహుడు (రావుగారు ఫీలవుతారు లెండి అలా) తరచు సవాళ్ళు విసురుతుంటాడు. కుటుంబరావు సవాళ్ళకు దిమ్మతిరిగే అన్సర్లు ఇచ్చాడు ఉండవల్లి. ఎక్కడైన సవాల్ కి సై అంటూ పలు అంశాలను శరపరంపరగా సంధించాడు…

పోలవరం నుంచి పుష్కరాల వరకు అమరావతి బాండ్ల నుంచి అన్నా క్యాంటిన్ల వరకు ఉన్న లోసుగులన్ని విప్పి చెప్పారు ఉండవల్లి. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ ల హత్య తర్వాత  పోలీస్ స్టేషన్ ల ముట్టడి జరిగిందని, దాంతో అక్కడ పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసిందని, మరి రాజమండ్రి వద్ద పుష్కరాలలో ఇరవై తొమ్మిది మంది చనిపోతే ఒక్కరిని కూడా ఎందుకు సస్పెండ్ చేయలేదని ఈ మాజీ ఎంపీ ప్రశ్నించారు. అరకు ఘటనపై ప్రభుత్వం స్పందించిందని, మరి పుష్కరాల తొక్కిసలాటకు ఎవరిని ఎందుకు బాద్యులను చేయలేదని ఆయన అన్నారు. సోమయాజులు కమిషన్ నివేదిక లో సిసి ఫుటేజ్ లు ఏమయ్యాయో తెలీయదనడం దారుణంగా ఉందన్నారు. కనీసం కలెక్టర్ ఇచ్చిన నివేదికపై కూడా చర్చించలేదని, కలెక్టర్ ని విచారణకు పిలవలేదని ఆయన అన్నారు.

ఇక పోలవరం ప్రాజెక్టు 2019 కి పూర్తి చేయడం సాధ్యకాదని కాగ్ నివేదిక చెప్పినందున ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు నిజానికి పోలవరం ప్రధాన కాల్వల టన్నల్స్ పనులు మొదలు కానేలేదని,ఇక డ్యాం నిర్మాణపనులు అంతలోనే ఉన్నాయని స్పిల్ వే చూపించి పోలవరం పనులు శరవేగమంటూ జనాన్ని తీసుకెళ్ళి చూపించడం విడ్డురంగా ఉందన్నారు. ఏదైనా మాట్లాడితే చంద్రబాబుపై కక్ష గా మాట్లాడుతున్నట్లు లెక్కగడుతున్నారే తప్ప అందులో వాస్తవాన్ని అర్ధం చేసుకోవలన్నారు. అసలు ప్రాజెక్ట్ లో థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోలు ఎందుకు చేయడంలేదంటూ కాగ్ తలంటిందన్నారు.

అమరావతి బాండ్ల గురించి ప్రస్తావించినప్పుడు కుటుంబరావు ద్వారా మాట్లాడించిన ప్రభుత్వం మరి పోలవరం గురించి ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ చేత ఎందుకు సమాధానం చెప్పించలేదని ఉండవల్లి ప్రశ్నించారు. అసలు పోలవరం భేతాళ కథలా అన్పిస్తోందన్నారు. ‘ఇంజనీర్లను మీడియా ముందు పోలవరం గురించి చెప్పమనండి ఇదే పోలవరం పై నా ఆఖరు ప్రెస్ మీట్. సమాధానం చెబితే దీనిపై ఇక ప్రెస్ మీట్స్ ఆపేస్తా”అని ఉండవల్లి ప్రకటించారు. అమరావతి బాండ్ల వ్యవహారం గురించి లేవనెత్తి అంశాలపై ప్రభుత్వ ఆర్ధిక సలహాదారు కుటుంబరావు చర్చకు అంగీకరించారని, దాంతో తాను వెళ్లి కలిశానని,అయితే చంద్రబాబు అమెరికా పర్యటన,ఆర్ధిక వేత్తల బృందం రావడం వంటి పరిణామాల వలన వచ్చేవారం చర్చిద్దామని చెప్పారని, అందుకే రెండు రోజుల్లో అమరావతి వెళతానని ఉండవల్లి చెప్పారు.

అన్నక్యాంటీన్లలలో కూడా అవినీతి రాజ్యమేలుతోందని ,వివరాలు త్వరలో వెల్లడిస్తానని ఆయన చెబుతూ కుటుంబరావుకి అంగీకారమైతే పోలవరం కాగ్, ఆదరణ, అన్నక్యాంటీన్లపై చర్చించడానికి రావాలంటూ సవాల్ విసిరారు. రాఫెల్ పై కుంభకోణం పై వాస్తవాలు వెల్లడించాలని ఉండవల్లి కేంద్రాన్ని కోరారు. రాఫెల్ ఎలా పనిచేస్తుందో చెప్పమనలేదని, రేటు ఎంతో చెప్పమంటే రహస్యం అంటున్నారని ఆయన వాపోయారు. భోఫోర్స్ కుంభకోణం ఆరోపణలపై అప్పట్లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఓడిపోయిందని ఉండవల్లి చెబుతూ ,అయితే కార్గిల్ యుద్ధం లో బోఫోర్స్ గన్ లు ఎలా పేలాయో,విజయం ఎలా లభించిందో అందరూ చూసారని ఆయన గుర్తుచేశారు.