Home News Politics

మరో పార్టీ పెట్టిన కన్నడ స్టార్ !

SHARE

ఒక పార్టీ పెట్టి నడిపించడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఓ నటుడు ఏకంగా రెండో పార్టీ కూడా పెట్టేశాడు. మొదట పెట్టిన పార్టీలో చేరిన నాయకుల రాజకీయాలు చూసి కలత చెందిన కన్నడ స్టార్ వారిపై చర్యలు తీసుకోకుండా తానే ఆ పార్టీ వదిలి సైడయ్యారు. మళ్ళీ తన పుట్టిన రోజున మరో పార్టీ పెట్టి కన్నడనాట సంచలనం రేపారు….

కన్నడ సూపర్ స్టార్, నటుడు ఉపేంద్ర మళ్ళీ రాజకీయ ఆరంగేట్రం చేసేందుకు రెడీ అయ్యారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల కిందట ‘కర్ణాటక ప్రజ్ఞావంతర జనతా పార్టీ’ని స్ధాపంచిన ఉపేంద్ర తన పార్టీ నేతలతో వేగలేక తానే పార్టీ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత బీజేపీలో చేరతారని ప్రచారం జరిగినా దాన్ని ఖండిస్తూ మరో రాజకీయ పార్టీ నెలకొల్పాడు.
పాలనలో జవాబు దారీతనం, ఆర్థిక పారదర్శకత ఉండాలనే లక్ష్యంతో ‘ఉత్తమ ప్రజారాజకీయ పార్టీ’ ని ప్రారంభిస్తున్నట్లు అయన తెలిపారు. మంగళవారం తన నివాసంలో పార్టీని, వెబ్‌సైట్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. కులం, డబ్బు, వర్గం, ఆయుధాలను విడిచి జావాబుదారితనంతో కూడిన పాలన అందించడమే తమ పార్టీ ఆశయమని ఉపేంద్ర చెప్పారు.

కండబలంతో ఓట్లను అడిగే వారికి తమ పార్టీలో అసలు స్థానం లేదని ఉపేంద్ర ప్రకటించాడు. అలాంటి నాయకులు తమకు అవసరం లేదన్నాడు. ప్రతి ఊరిలోని సమస్యలనూ ఫోన్ల ద్వారా వీడియోగా తీసి పార్టీ వెబ్‌సైట్లోకి అప్ లోడ్ చేయాలని ఉపేంద్ర తన అభిమానులను, పార్టీ కార్యకర్తలను కోరాడు. సమస్యల పరిష్కారానికి ప్రణాళికలను రచించి వాటిని పరిష్కారిస్తామన్నారు. సినిమాల ఎంపిక విషయంలోనే డిఫరెంట్ గా ఆలోచించే కన్నడ స్టార్ ఉపేంద్ర రాజకీయాల్లోను తన మార్క్ చూపించాడు.